Abn logo
Sep 25 2021 @ 17:48PM

అడవిలో ముగ్గురు అమ్మాయిల అస్తిపంజరాలు.. తల్లే చేసిందని అంతా అనుకున్నారు.. కానీ ఇంతలోనే ఊహించని షాక్

కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లే ముగ్గురు బిడ్డల్ని హత్య చేసిందని అంతా అనుకున్నారు. అడవిలో దొరికిన ముగ్గురు అమ్మాయిల అస్తిపంజరాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కానీ ఇంతలోనే వాళ్లకి అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకెళ్తే..


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 18న సీమ, ఆమె ముగ్గురు కుమార్తెలు అదృశ్యమయ్యారు. హాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హ్రార్ అటవీప్రాంతంలో ఈ నెల 21న గోల్(12), మునియా(10), మమత(8) అనే ముగ్గురు బాలికల అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలంలో దొరికిన దుస్తుల ఆధారంగా కుటుంబసభ్యులు బాధితులను గుర్తించారు. 


బాలికలను తల్లే చంపి పారిపోయిందని భావించి పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో శుక్రవారం సాయంత్రం ఓ మహిళ చెట్టుకు ఉరేసుకుని చనిపోయింది. అది గమనించిన స్థానిక గొర్రెల కాపరి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలంలో లభ్యమైన చెప్పులు, చీర, సెల్‌ఫోన్ ఆధారంగా ఆమెను సీమగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. అరెస్టు చేస్తారనే భయంతోనే సీమ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావించారు. కానీ ఆమె బంధువులు అది ఆత్మహత్య కాదని.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించినట్లు హాలియా స్టేషన్ అధికారి తెలిపారు.  


సీనియర్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ‘‘మేము ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మృతురాలే పిల్లలను చంపేసి, అరెస్టు చేస్తామనే భయంతో ఆత్మహత్య చేసుకుందని మా ప్రాథమిక దర్యాప్తులో తేలింది’’ అని అన్నారు. కానీ బాధితురాలి బంధువులు మాత్రం వాళ్లు వెళ్తుండగా అడ్డుకొని దాడి చేసి చంపేశారని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   

క్రైమ్ మరిన్ని...