ఐదు రోజుల క్రితం అదృశ్యమైన హాలివుడ్ నటి శవమై..

ABN , First Publish Date - 2020-07-15T01:05:17+05:30 IST

కాలిఫోర్నియా సమీపంలోని పిరు సరస్సులో అదృశ్యమైన హాలివుడ్ నటి

ఐదు రోజుల క్రితం అదృశ్యమైన హాలివుడ్ నటి శవమై..

వెంచురా కౌంటీ: కాలిఫోర్నియాలోని పిరు సరస్సులో అదృశ్యమైన హాలివుడ్ నటి నయా రివేరా మరణించినట్టు అధికారులు వెల్లడించారు. నయా రివేరా అదృశ్యమై ఐదు రోజులు గడిచిన తరువాత ఆమె మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. అయితే ఆమె మృతదేహం గుర్తించడానికి కూడా వీలులేకుండా ఉందని.. మృతదేహాన్ని పరీక్షల కోసం పోస్ట్‌మార్టంకు పంపినట్టు అధికారులు తెలిపారు. మరోపక్క గడిచిన ఐదురోజుల్లో స్థానికంగా ఒక్క మిస్సింగ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో.. ఆ మృతదేహం వంద శాతం రివేరాదే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా.. రివేరా జులై 8న పిరు సరస్సులో బోటు అద్దెకు తీసుకుంది. తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి బోటు షికారు చేసింది. అయితే కొద్దిసేపటి తరువాత స్థానికులు బోటులో ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తించారు. వెంటనే బోటు ఎక్కి చూడగా రివేరా నాలుగేళ్ల కొడుకు నిద్రపోతూ కనిపించాడు. రివేరా లైఫ్ జాకెట్ కూడా బోటులోనే ఉండటంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తూ వచ్చారు. మరోపక్క తన తల్లితో కలిసి స్విమ్మింగ్ చేశానని.. అయితే తనను బోటు ఎక్కించి తన తల్లి మాత్రం బోటు ఎక్కలేదని రివేరా కొడుకు పోలీసులకు చెప్పాడు. కాగా.. రివేరా మృతదేహం 64 కిలోమీటర్లు ప్రయాణించిందని పోలీసులు చెప్పారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని.. త్వరలోనే పూర్తి విషయాలు తెలియజేస్తామన్నారు. కాగా.. రివేరా ‘గ్లీ’ అనే ఆరు సీజన్ల షో ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. గడిచిన ఏడేళ్లలో ఈ షోలో నటించిన ఇద్దరు వ్యక్తులు మరణించగా.. రివేరా మరణంతో ఈ సంఖ్య మూడుకు చేరింది.

Updated Date - 2020-07-15T01:05:17+05:30 IST