Hyderabadలో కలకలం.. దుకాణం ముందు బాలిక మృతదేహం.. ఒంటిపై తీవ్ర గాయాలు.. పక్కనే మద్యం సీసాలు.. అసలేం జరిగింది..?
ABN , First Publish Date - 2021-11-06T16:35:27+05:30 IST
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గుర్తు తెలియని ఓ చిన్నారి మృతదేహం...
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గుర్తు తెలియని ఓ చిన్నారి మృతదేహం కలకలం సృష్టించింది. దుకాణం ఎదుట వదిలి వెళ్లిన ఈ మృతదేహం కుడిచేయి వెనక్కితిప్పినట్టుగా ఉండడం, సంబంధీకులెవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని చిన్నారి మృతదేహం ఓ దుకాణం ఎదుట కనిపించింది. పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్1లోని జలగం వెంగళరావు పార్కు ఎదురుగా ఉన్న మిడ్ టౌన్ భవనం సమీపంలో కొన్ని రోజులుగా తెరవని లేపాక్షి ఎంబ్రాయిడరీ దుకాణం వద్ద ఈనెల 4న ఓ బాలిక మృతదేహం పడి ఉండడం స్థానికులు గమనించారు. 100 డయల్ ద్వారా ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక వయసు 4-5 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీంను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు.
తెచ్చిపడేశారా..?
దుకాణం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. బాలిక చనిపోయాక అక్కడకు తెచ్చి వదిలేశారా, లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా తెలియనున్నది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. పోస్టుమార్టంను వీడియో తీయించడంతో పాటు సీటీస్కాన్ కూడా చేయించారు. వీటి రిపోర్టులు వస్తేగానీ బాలిక మృతికి కారణాలు చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. బాలిక ఫొటోలతో కూడిన పోస్టర్లను పోలీసులు వివిధ ప్రాంతాలలో పెట్టారు. బాలిక గురించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిస్తే తమకు సమాచారం అందించాలని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి (94906 16610) కోరారు. అలాగే, నెంబర్లు కందిమళ్ల నాగయ్య (డీఐ), 94906 16613, సతీష్ (ఎస్‌ఐ) 94906 16365, 040-27852494 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
వెనక్కి తిరిగి ఉన్న కుడిచేయి..!
బాలిక పడి ఉన్న స్థితిని బట్టి ఎక్కడో హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలు పెద్దగా లేవు. అంతేకాకుండా బాలిక కుడి చేయి వెనక్కి తిప్పినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బాలిక నైట్ డ్రెస్ మీద ఉండగా ఆమె ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టడంతో అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఘటనా స్థలంలో మద్యం సీసాలు లభించడంతో పోలీసులు వాటి పై ఉన్న వేలి ముద్రలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.