బోధిసత్వమే మన వారసత్వం

ABN , First Publish Date - 2022-06-23T06:56:36+05:30 IST

మొన్నీమధ్య మన గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక పుస్తకావిష్కరణ సభ సభలో పాల్గొన్నారు. ఆయన ఆవిష్కరించిన పుస్తకం పేరు ‘మహారాణ: సహస్ర వర్ష్ కా ధర్మయుద్ధ’...

బోధిసత్వమే మన వారసత్వం

మొన్నీమధ్య మన గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక పుస్తకావిష్కరణ సభ సభలో పాల్గొన్నారు. ఆయన ఆవిష్కరించిన పుస్తకం పేరు ‘మహారాణ: సహస్ర వర్ష్ కా ధర్మయుద్ధ’. సహజంగానే ఈ పుస్తకం మన చరిత్రవైపు, మన పూర్వ చక్రవర్తుల ప్రతాపాల వైపు, మన గత పాలకుల వైభవోపేత కాలం వైపు మనల్ని డ్రైవ్ చేస్తుంది. పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత వారు తమ జ్ఞానాన్ని కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మన చరిత్రకారులు మొగలుల గురించే ప్రాధాన్యతనిచ్చి రాశారు గానీ మన నిజమైన చరిత్రను తక్కువే చేశారన్నది ఆయన వాదన. పాండ్యులు, చోళులు, మౌర్యులు, గుప్తులు మొదలైన ఎందరినో మరుగుపరచి, మన చరిత్రకారులు మొగల్ చక్రవర్తులకు మొదటి పీట వేశారన్నది ఆయన అభియోగం. అంతటితో ఆగలేదు. ‘వారు (ఆయన దృష్టిలో ఉన్న చరిత్రకారులు) చేయాలనుకున్నది చేశారు. కానీ మమ్మల్ని ఎవ్వరాపగలరు?’ అని అమితోత్సాహంతో అన్నారు. చరిత్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాల మీద కాదు వాస్తవాల మీద లిఖించబడుతుందని కూడా వ్యాఖ్యానించారు. మంత్రిగారి మాటల్లో తప్పేముంది? మన చరిత్రను మనం మరువరాదు. కానీ పాలకుల అభీష్టాల మీద చరిత్ర రాయబడదని ఆయన అన్న మాట నడుస్తున్న చరిత్రకు ఎంతవరకు అన్వయించుకోవచ్చు? నేడు చరిత్ర పుస్తకాలను మారుస్తున్నారు, మసీదుల కింద పురాతన కట్టడాల కింద తమకు కావలసిన చరిత్రను తవ్వడానికి బుల్‌డోజర్లు సిద్ధం చేస్తున్నారు. మరి పాలకులు తలుచుకున్నదే చరిత్ర అని నిరూపించడానికే కదా ఈ ప్రయత్నాలు?


గౌరవ మంత్రివర్యులు ఇంకొన్ని చారిత్రక వివరాలు చెప్పారు. పాండ్యులు, చోళులు, పల్లవులు, అహోంలు, శాతవాహనులు ఎన్నేసి సంవత్సరాలు పరిపాలించారో సెలవిచ్చారు. ఇది మనమంతా చదువుకున్న చరిత్రే. కొశాంబి నుంచి నెహ్రూ నుంచి రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర దాకా అందరూ రాసిన చరిత్రే. ఎవరూ ఎవరినీ తక్కువ చేయలేదు. అన్నింటి కంటే ఆయన చెప్పిన మాట ఒకటి ఆశ్చర్యానికి గురిచేసింది. అదేమంటే చాలా దశాబ్దాల తర్వాత మన సంస్కృతిని ప్రపంచం ఆమోదించే రోజులొచ్చాయట. మన దేశంలో సాగుతున్న ద్వేష ప్రచారం వల్ల మనం ప్రపంచం ముందు ఎంత సిగ్గుతో తలదించుకోవలసిన సందర్భాలు ఇటీవల ఎన్ని వచ్చాయో మనకు తెలియదా? మంత్రిగారు, ఆయన పాలక అనుయాయులు ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నారో మరి. సరే ఆ చరిత్రే చూద్దాం.


ఇక్కడ మంత్రి గారు గుర్తుంచుకున్నది మహారాజులను, చక్రవర్తులను, వారు యుద్ధనీతితో సాధించిన స్థాపించిన సామ్రాజ్యాలనే. ఏ యుద్ధం ఎందుకు జరిగెను, ఏ రాజ్యం ఎన్నాళ్లుంది? ఇది కాదు చరిత్ర అంటే అని మన మహాకవి చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. రణరక్త ప్రవాహసిక్తమైన నరజాతి చరిత్ర అంత మహోజ్వలమైనదేం కాదు. కానీ ప్రపంచాన్ని యుద్ధాల నుంచి, మనుషుల్ని స్వార్థాల నుంచి విముక్తి చేసే మహోన్నత శాంతి ప్రదాత పుట్టిన పుణ్య భూమి మనది. గౌతమముని బోధించిన శాంతి మంత్రమే లోకానికి ఎప్పటికైనా శిరోధార్యం. అందుకే పాలకులు అశోకుడి కాలం దాకా వెళ్ళి అక్కడి నుంచి తవ్వకాలు మొదలు పెడితే ప్రపంచం నిజంగా మెచ్చుకునే చరిత్రను మనం వెలికితీసినవారమవుతాం. దైవం పేరుతో, కులం పేరుతో, స్వర్గ నరకాల పేరుతో, అంధవిశ్వాసాల ఆధిపత్యాల పేరుతో, రాజ్య విస్తరణకై నడిచిన యుద్ధనీతి పేరుతో సాగిన చరిత్ర కూడా చరిత్రే కావచ్చు, అది గొప్పది మాత్రం కాదు. గొప్పదైన అసలు చరిత్ర వేరే వుంది. అదే గౌతమ బుద్ధ చరిత్ర. వేల సంవత్సరాలు మనుషుల్ని దోచుకున్న అన్ని రకాల మానవ ప్రతికూల అంశాల మీద ఆయన కేవలం జ్ఞానం, శీలం, ధర్మం, జాలి, కరుణ, దయ, సత్ప్రవర్తన, సమాధి మొదలైన మౌలిక ఆయుధాలతో యుద్ధం చేసి గెలుపు సాధించాడు. అస్త్రం పట్టని, నెత్తురు కారని ధర్మ యుద్ధం అది. కపిలవస్తు పురంలో పుట్టిన ఆ మహాశాస్త బర్మా, టిబెట్, శ్రీలంక, చైనా, జపాన్... ఇలా మొత్తం ఆసియా ఖండానికే వెలుగు చూపించిన అఖండ బౌద్ధ జ్యోతిగా అవతరించాడు. కానీ ఆ శాంతి జ్యోతిని భరత ఖండంలో చీకటి ఆక్రమించింది. తవ్వి తీయాల్సిన అసలు చరిత్ర ఇది. మంత్రి వర్యులు పేర్కొన్న సమస్త సామ్రాజ్యాలకు, వాటి అధినేతలకు పూర్వమే బోధిసత్వుడు ఈ భూమ్మీద కాలు మోపాడు. మరి ఆయన నామ రూపాలు లేకుండా కుటిలయత్నం చేసిన చరిత్ర ఒకటి ఉంది ఇక్కడ. దాన్ని కదా తిరిగి తోడాలి? కులం పునాదిగా నిర్మితమైన సకల ఆధిపత్య సంస్కృతులు ఏ ప్రపంచానికీ ఏ దారినీ చూపలేదు. పైగా ఆ కారణంగానే ఈ దేశం అనైక్యతకు ఆలవాలమై ఎన్నో బయటి శక్తుల దురాక్రమణకు గురైంది. ఇదే విషయమై పి. లక్ష్మీనరసు ‘ద ఎసెన్స్ ఆఫ్ బుద్ధ’ అనే గ్రంథంలో ఇలా రాశారు: ‘భారతదేశ ప్రజానీకాన్ని అసంఖ్యాకమైన భాగాలుగా (కులాలుగా) విభజించటం పెద్ద శాపమైంది. అత్యధిక కులాలను రాజకీయ జీవితం నుంచి మినహాయించటంతో సమిష్టి ప్రయోజనం, సంఘటిత శక్తి అనే భావాలకు దాదాపు స్థానం లేకుండా పోయింది. నిజమైన అర్థంలో దేశాభిమానం అనే భావన కులం ఊబిలో కూరుకుపోయిన హిందూ సమాజానికి లేదు. కోట్లమందికి నివాసమైన సువిశాల భారత ఉపఖండం శతాబ్దాల తరబడి దురాక్రమణదారులకు దాసోహమవుతూ వచ్చింది.’ ఇదీ చరిత్ర. అలెగ్జాండరు మొదలుకొని, గ్రీకులు, శ్వేతయానులు, హూణులు, అరబ్బులు, ఆఫ్ఘనులు, మంగోలుల నుంచి పోర్చుగీస్, ఫ్రెంచి, బ్రిటిష్ ఇలా నిరంతర పరాధీనతలో భారతదేశం మగ్గడానికి కారణం కులమే. దీన్నే వ్యతిరేకించాడు బుద్ధుడు. బాహ్య శక్తులను ఆశ్రయించకుండా, మీ విముక్తిని మీరే సాధించుకోండని మానవ ధర్మ మార్గాన్వేషి బుద్ధుడు బోధించాడు. లోకమంతా తనను ఎంత కీర్తించినా తనను మానవుడిగానే భావించాడు. తాను పగటిని పగలే అని, రాత్రిని రాత్రే అని అంటానన్నాడు. అంటే సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగానే ఆయన చూశాడు, చెప్పాడు. మానవ దుఃఖ నివారణకు అష్టాంగ మార్గాలు బోధించాడు, ఆర్య సత్యాలు వివరించాడు. అదే ఈ దేశంలో రెండున్నర వేల సంవత్సరాల నాడు జరిగిన అసలు విప్లవం. అది ఇతరులకు మహోపదేశం అయ్యింది, కానీ ఏ కులం పునాది మీద పెత్తనాన్ని శతాబ్దాలుగా సాగించారో వారికి అవరోధంగా మారింది. లక్ష్మీనరసు అదే గ్రంథంలో దీని గురించి చాలా వివరంగా చెప్పారు. పంచమ వేదం అయిన భారతం ఏ బ్రాహ్మణాధిక్యత కోసం అవసరమైంది? గీత ఏ కులవ్యవస్థ స్థిరీకరణకు ఉద్దేశించింది? అన్నవి చర్చించారు. అందుకే బౌద్ధ ఆరామాల మీద దాడులు కొనసాగాయి ఆనాడు. క్రీ.పూ. రెండో శతాబ్దంలో పుష్యమిత్రుడు ఎన్నో సంఘారామాలను ధ్వంసం చేసి, బౌద్ధ భిక్షువులను హతమార్చినట్టు చరిత్ర చెప్తోంది. కనిష్కుని తర్వాత వందేళ్లకు శ్రావస్థి రాజైన విక్రమాదిత్యుడు, శైవుడైన మిహిరకులుడు లెక్కలేనంతమంది బౌద్ధ భిక్షువులను చంపించినట్టు తెలుస్తోంది. బౌద్ధానికి వ్యతిరేకంగా ఇతిహాసాలు వెలిసాయి, గీతోపదేశాలు సాగాయి, పురాణాలు పుట్టాయి. ఇతర మతాలు ఎంతో రక్తాన్ని చిందించటం ద్వారా తమ వ్యాప్తికి పునాదులు వేసుకున్నాయి. కానీ ఒక్క నెత్తురు చుక్క కూడా రాలకుండా హింస లేకుండా వ్యాపించిన మానవ మహా ధర్మం బౌద్ధం.


ఇతర ప్రపంచానికి మనం గొప్పగా చెప్పుకోవలసినదేమైనా ఉంటే అది బౌద్ధమే. అందుకే భూమి పొరల్లో బుద్ధుణ్ణి సమాధి చేసిన చరిత్ర ఆరాలు తీయాలిప్పుడు. ఇటీవల ఒక బుద్ధిస్టు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 గుడుల కింద బౌద్ధారామాలున్నాయని, ‘అయ్యా, పనిలో పని వాటిని కూడా తవ్వి తీయండ’ని ఒక వీడియోను పోస్టు చేశారు. మాననీయ మంత్రివర్యులు మనదేశ పురా వైభవాన్ని చాటే బుద్ధ చరిత్రను తవ్వి తీయించే పని చేపడితే మంచిది. బోధిసత్వమే మన వారసత్వం. అదే మనం ప్రపంచం ముందు గొప్పగా చెప్పుకోతగ్గ మహోజ్వల చరిత్ర.

ప్రసాదమూర్తి

Updated Date - 2022-06-23T06:56:36+05:30 IST