మత్స్యకారుల ఆచూకీ కోసం.. ముమ్మర గాలింపు చర్యలు

ABN , First Publish Date - 2022-07-06T07:09:47+05:30 IST

సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్‌, నేవీ, మెరైన్‌ పోలీసులు గాలింపుచర్యలు ముమ్మరం చేశారని కలెక్టర్‌ రంజిత్‌బాషా మంగళవారం తెలిపారు. ఈనెల 2వతేదీన రెండు బోట్లలో క్యాంప్‌బెల్‌ పేటకు చెందిన మత్స్యకారులు చేపలవేటకు వెళ్లారని ఆయన తెలిపారు.

మత్స్యకారుల ఆచూకీ కోసం..  ముమ్మర గాలింపు చర్యలు

- కృష్ణా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా

మచిలీపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్‌, నేవీ, మెరైన్‌ పోలీసులు గాలింపుచర్యలు ముమ్మరం చేశారని కలెక్టర్‌ రంజిత్‌బాషా మంగళవారం తెలిపారు. ఈనెల 2వతేదీన రెండు బోట్లలో క్యాంప్‌బెల్‌ పేటకు చెందిన మత్స్యకారులు చేపలవేటకు వెళ్లారని ఆయన తెలిపారు. తూర్పుగోదావరిజిల్లా అంతర్వేది వద్ద ఐఎన్‌డీ-ఏపీ-కే2-ఎంవో-60ఫైల్‌నెంబరు ఏపీ-3469 నెంబరుతో ఉన్న ఫైబర్‌బోటు ఇంజను మరమ్మతుకుగురై నిలిచిపోయిందన్నారు. బోటులో విశ్వనాథపల్లి చినమస్తాన్‌, చిననాంచారయ్య, చెక్కా నరసిహారావు, మోకా వెంకటేశ్వరరావు ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నేవీ అధికారులు చాపర్‌తో గల్లంతైన వారికోసం మంగళవారం నాలుగు గంటపాటు గాలించారని తెలిపారు. కోస్ట్‌గార్డుకు చెందిన వీరా, ప్రియదర్శిని అనే రెండుబోట్లు వీరి ఆచూకీకోసం గాలిస్తున్నాయని తెలిపారు. బుధవారం మరో చాపర్‌ను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నట్టు తెలిపారు. జేసీ మహేశ్‌కుమార్‌ ఎప్పటికపుడు నేవీ, కోస్ట్‌గార్డ్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా మత్యకారుల ఆచూకీని కనుగొంటామని, గల్లంతైన మత్స్యకారుల బంధువులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. 

బోటు యజమాని ఏడుకొండలు మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. వేటకు వెళ్లిన మత్స్యకారులు క్రమశిక్షణతోనే ఉంటారని, సెల్‌ఫోన్లు చార్జింగ్‌ అయిపోయి కలవడం లేదా అనే దానిపై విచారిస్తున్నామన్నారు. గ్రామంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో సోమవారం రాత్రంతా నిద్రపోకుండా అధికారుల నుంచి ఏదైనా మంచి కబురు వస్తుందేమోనని ఎదురు చూశామన్నారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని క్యాంపుబెల్‌ పేట గ్రామస్థులు ప్రార్ధనలు చేస్తున్నారు.

మత్స్యకారుల బాధ్యత ప్రభుత్వానిదే..

- బోట్ల నిర్వహణ, భద్రతపై అశ్రద్ధ

- మత్స్యకారుల కుటుంబాలకు టీడీపీ నేతల పరామర్శ 

 క్యాంపుబెల్‌పేట నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. క్యాంపుబెల్‌పేటలోని నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లభించని నేపథ్యంలో మంగళవారం క్యాంప్‌బెల్‌పేటలో మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి విశ్వనాథపల్లి భారతి, కనకదుర్గ, రామాని వెంకటరమణలకు కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ, టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావులు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో కొల్లు రవీంద్ర మాట్లాడారు. 48 గంటలైనా ఇంకా ప్రభుత్వం గాలింపు చర్యల్లో విఫలమయ్యారని, గతంలో గిలకలదిండికి చెందిన ఒక బోటు ఆచూకీ తెలియకపోతే విమానాలతో చంద్రబాబు వెతికించారన్నారు. కలకత్తా దగ్గర ఆచూకీ తెలవడంతో గిలకలదిండికి తీసుకువచ్చామన్నారు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం సాయం తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యలు అసంతృప్తిగా ఉన్నాయని, స్పందించాల్సిన స్థాయిలో ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టంను ఏర్పాటు చేసుకుంటే మత్స్యకారులు ఆందోళనపడనక్కరలేదన్నారు. మత్స్యకారులకు సాంకేతిక పరికరాలు ఇవ్వకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కాకినాడ తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలకు ఫోన్‌చేసి తమ వంతుగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

Updated Date - 2022-07-06T07:09:47+05:30 IST