ధారావిలో కరోనాపై దరువు

ABN , First Publish Date - 2020-07-12T06:50:33+05:30 IST

ముంబైలోని ధారావి ప్రాంతానికి ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుంది. ఇక్కడ జనసాంద్రత కూడా చాలా ఎక్కువ. రెండున్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ధారావిలో చదరపు కిలోమీటర్‌కు...

ధారావిలో కరోనాపై దరువు

  • పోరాడితే మహమ్మారిపై విజయం సాధ్యమే
  • ధారావి విజయగాధే సాక్ష్యం: డబ్ల్యూహెచ్‌ఓ
  • నాలుగు ‘టి’ల సిద్ధాంతంతో వైర్‌సపై గెలిచాం
  • గెలుపును గుర్తించినందుకు కృతజ్ఞతలు: బీఎంసీ

ముంబై, జూలై 11: ముంబైలోని ధారావి ప్రాంతానికి ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరుంది. ఇక్కడ జనసాంద్రత కూడా చాలా ఎక్కువ. రెండున్నర చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ధారావిలో చదరపు కిలోమీటర్‌కు 2.27లక్షలమంది నివాసం ఉంటున్నారు. అతి చిన్న ఇళ్లల్లో 8మంది, 10మంది సభ్యులున్న కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. వీధులు అత్యంత చిన్నగా.. నడిచేందుకు దారి లేనంత రద్దీగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో భౌతిక దూరం పాటించడం, కరోనా వంటి ఒక మహమ్మారిని అదుపులోకి తీసుకురావడం దాదాపు అసాధ్యమే. కానీ.. బృహన్ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) దాన్ని సుసాధ్యం చేసింది. విజయవంతంగా కరోనా ఉధృతిని కట్టడి చేసింది. ఇప్పటి వరకూ మొత్తం 2370కేసులు ధారావిలో నమోదు కాగా.. ప్రస్తుతం 122కేసులు మాత్రమే ఉన్నాయి. ధారావి సాధించిన ఈ అపూర్వ విజయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కీర్తించింది. జెనీవాలో ఇటీవల జరిగిన ఓ వర్చువల్‌ ప్రెస్‌మీట్‌లో డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌-జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ధారావి గురించి ప్రస్తావించారు. వైరస్‌ తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సరే.. దానిపై పోరాడి విజయం సాధించవచ్చనేదానికి ముంబైలోని ధారావియే ఉదాహరణ అని ఆయన పొగడ్తలు కురిపించారు. ఒకప్పుడు కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా ఉన్న ధారావి, నేడు కరోనా మహమ్మారిని పూర్తిగా అణగదొక్కి ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటోంది.


ఈ విజయం ఎలా సాధ్యమైంది?

ప్రైవేటు వైద్యులు, స్థానికులు పూర్తిగా సహకరించడంతోనే ఈ అద్భుతాన్ని సాధించగలిగామని బీఎంసీ జి నార్త్‌ వార్డుకు సహాయ కమిషనర్‌ కిరణ్‌ దిఘావ్‌కర్‌ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘‘కరోనా చికిత్స విషయంలో బీఎంసీ సంప్రదాయ మార్గాన్ని మార్చింది. వైర్‌సను త్వరగా పసిగట్టడంలో, సమయానికి సరైన చికిత్స అందించడంలో క్రియాశీలక స్ర్కీనింగ్‌ మాకు ఉపకరించింది. ధారావిలో కనీసం 6లక్షల నుంచి 7లక్షలమందికి స్ర్కీనింగ్‌ నిర్వహించాం. వారిలో 14వేలమందికి పరీక్షలు చేశాం. క్వారంటైన్‌కు 13వేలమందిని తరలించాం. ధారావి ప్రజల్లో 80ు కమ్యూనిటీ మరుగుదొడ్లనే వినియోగిస్తున్నారు. దీంతో.. రోజుకు పలుమార్లు వాటిని శుభ్రపరిచాం. వైర్‌సను అడ్డుకునేందుకు ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ అనే నాలుగు ‘టి’ల సిద్ధాంతాన్ని అనుసరించాం. ప్రత్యేకంగా నిర్వహించిన శిబిరాల్లో భాగంగా.. వైద్యులు 47,500 ఇళ్లకు వెళ్లారు.


14,970 మందికి మొబైల్‌ వాహనాల్లో స్ర్కీనింగ్‌ నిర్వహించారు. పాఠశాలలు, వివాహ వేడుకల భవనాలు, క్రీడా భవన సముదాయాల్ని కరోనా అనుమానితుల్ని ఉంచేందుకు ఉపయోగించాం. 14రోజుల్లోనే 200 పడకల కొవిడ్‌-19 ఆస్పత్రిని ప్రారంభించాం. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశాం. తీవ్ర అనారోగ్యం ఉన్నవారిని మాత్రమే బయటికి తరలించాం. ప్రజలు బయటికి రాకుండా ఉండేందుకు, కూరగాయల్ని, నిత్యావసరాల్ని ఇళ్లకే అందించాం’’ అని కిరణ్‌ వివరించారు. కాగా.. తాము సాధించిన ‘మిషన్‌ ధారావి’ విజయాన్ని గుర్తించినందుకు డబ్ల్యూహెచ్‌ఓకు బీఎంసీ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపింది.  


Updated Date - 2020-07-12T06:50:33+05:30 IST