500 రోజులు పూర్తయిన రిలే దీక్షలు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల మహా ప్రదర్శన
ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకూ పోరాడతామని ప్రకటన
విశాఖపట్నం, విజయవాడ, జూన్ 26(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 500 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం విశాఖ నగరంలో మహా ప్రదర్శన నిర్వహించారు. తొలుతో స్టీల్‌ప్లాంట్ గేటు నుంచి బైక్ ర్యాలీగా నాయకులు దొండపర్తి జంక్షన్ వద్ద గల డీఆర్‌ఎం కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వేలాదిమంది కార్మికులు, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద గల గాంధీ విగ్రహం వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. దారి పొడవునా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన సభలో పలువురు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులను స్టీల్‌ప్లాంట్ లోపలకు అడుగు పెట్టనీయకుండా తొలి విజయం సాధించామన్నారు. ప్రైవేటీకరణ ప్రక్రియను ఐకమత్యంగా అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమను అసలు అమ్మేవాడు ఎవడు? కొనే వాడు ఎవడు?’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడలో ప్రశ్నించారు.