Abn logo
Jan 21 2021 @ 01:17AM

కుసుమిస్తున్న కేసీఆర్ విప్లవాలు

‘స్వీయఅస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష’ అని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అన్నారు. గత ఆరున్నరేళ్లుగా తెలంగాణ సాధించిన అభివృద్ధి జయశంకర్ సూత్రీకరణకు అద్దం పడుతోంది. ఆర్థిక స్వావలంబనే అస్తిత్వ పరిరక్షణకు మార్గమని నమ్మిన, నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన నేతృత్వంలో తెలంగాణ ప్రగతియజ్ఞం నిరాటంకంగా కొనసాగుతోంది.


పల్లెసీమలు సుభిక్షంగా ఉంటే, కులవృత్తులు వెలుగులు విరజిమ్మితే, నవీన విద్యావంతులు అభ్యుదయంలో అగ్రగాములుగా నిలిస్తే తెలంగాణ మరింతగా వృద్ధి చెందుతుంది. ఈ ప్రగాఢ విశ్వాసంతో నాలుగు విప్లవాల దిశగా తెలంగాణను కేసీఆర్ పయనింపచేస్తున్నారు. హరితవిప్లవం (-వ్యవసాయ వృద్ధి), శ్వేతవిప్లవం (పాలు, డైరీ ఉత్పత్తుల వృద్ధి), నీలివిప్లవం (మత్స్యసంపద వృద్ధి), పింక్‌ రివొల్యూషన్ (మాంసం ఉత్పత్తుల పెరుగుదల)తో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతి కేసీఆర్ దార్శనికతకు జయపతాక. ఈ నాలుగు రంగాల్లో సాధించిన, సాధించబోయే వృద్ధి తెలంగాణ గ్రామీణ ఆర్థికవ్యవస్థను పట్టణాలతో సమానంగా తీర్చిదిద్దుతుందనడంలో సందేహం లేదు. ముందుచూపుతో, సద్భావనతో తెలంగాణ గ్రామీణ ప్రజలను ఆర్థికంగా పరిపుష్టం చేద్దామనే ప్రయత్నాలకు వక్రభాష్యం చెబుతూ ‘గొర్రెలు, బర్రెలు ఇస్తే అభివృద్ధి జరుగుతదా’ అని వికృత వాదాన్ని వినిపించిన వితండవాదులకు ఆ రంగాల్లో జరిగిన అభివృద్ధి కనువిప్పు కావాలి.


ప్రస్తావిత నాలుగు విప్లవాలలో ప్రధానమైనది హరితవిప్లవం. అది మిగతా మూడు విప్లవాలకు ఆధారం. అదే సమయంలో తెలంగాణ సామాజిక ఆర్థిక వికాసానికి ఆదరువు. ప్రత్యేక తెలంగాణ సాకారమైన నేపథ్యంలో కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రత్యేకించి గోదావరిని గ్రామీణానికి చేరువ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు, దానిలో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, వందలాదిగా తవ్విన కాలువల ద్వారా నిండిన నీటి వనరులు, మిషన్ కాకతీయతో బాగుపడ్డ చెరువులు, నవీకరించిన మధ్యస్థాయి ప్రాజెక్టులు, వందలాదిగా కట్టిన చెక్‌డ్యాంలు... వీటన్నిటి ద్వారా పెరిగిన సాగునీటి లభ్యత, పెరిగిన భూగర్భ జలసంపద తెలంగాణ మాగాణాన్ని రైతులకు సిరుల సంపదగా, హరిత తెలంగాణకు నెలవుగా మార్చింది. 2014–2015లో 72 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న పంటల ఉత్పత్తి 2019–2020 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో 121 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. నీటి వనరులతో పాటు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా, మార్కెటింగ్, గిడ్డంగుల వ్యవస్థ పటిష్ఠత, వ్యవసాయ శాఖ పనితీరు హరిత తెలంగాణ సాకారానికి బాటలు వేశాయి.


వ్యవసాయానికి తోడుగా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవాలని పిలుపునిచ్చి ఆ దిశగా చేపట్టిన మరో విప్లవం శ్వేతవిప్లవం. కేసీఆర్ దార్శనికతకు మరో ఉదాహరణగా ఈ విప్లవం తెలంగాణలో నిశ్శబ్దంగా ముందుకెళుతున్నది. రాష్ట్రం ఏర్పాటు నాటికి 42 లక్షల టన్నులు ఉన్న పాల ఉత్పత్తి, 2019–-20లో 56 లక్షల టన్నులకు పైగా చేరింది. పాడి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ బర్రెల పంపిణీ ఈ అనూహ్య వృద్ధికి కారణం. మరోవైపు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న విజయ డైయిరీ రూ.౩౦కోట్ల నష్టాలను పూడ్చుకొని, రూ.31 కోట్ల లాభాల్లోకి వచ్చింది. 75,000 రైతుకుటుంబాలు ఈ డెయిరీలో భాగస్వాములు. నిరుద్యోగ యువతకు డెయిరీ పార్లర్ల రూపంలో ఉపాధిని కల్పిస్తోంది. రూ. 250 కోట్లతో 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో నిర్మించబోయే మెగా డెయిరీ రాష్ట్రంలో శ్వేతవిప్లవ ఫలితాలను ద్విగుణీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది.


తెలంగాణలో సంప్రదాయికంగా చేపల పెంపకం ద్వారా జీవించే వర్గాల స్థాయిని, అదే సమయంలో రాష్ట్ర ఆదాయాన్ని, అనుబంధరంగాల్లో ఉపాధిని పెంచగలిగే మరొక రంగం మత్స్యసంపద అభివృద్ధి. ఈ లక్ష్య సాధనకు ఉద్దేశించిందే నీలి విప్లవం. కేసీఆర్ నిర్దేశించిన ఈ విప్లవం రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పరుగులెత్తిస్తున్నది. మత్స్యరంగం తెలంగాణలో 5 లక్షల కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తోంది. 77 రిజర్వాయర్లు, 25,000కు పైగా చెరువులు, 5 లక్షల 72 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న నీటి వనరులు, ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం మత్స్యసంపద దినదినాభివృద్ధికి పట్టుగొమ్మలుగా మారాయి. ఫిషర్‌మెన్ సొసైటీలకు రివాల్వింగ్‌ఫండ్ ఇవ్వటమే కాక, చేపల అమ్మకాల కోసం పరిశుభ్రమైన వసతులు కల్పించేందుకు రాష్ట్రంలో 84 చేపల మార్కెట్లు, 5 హోల్‌సేల్ మార్కెట్లు, రెండు శిక్షణా కేంద్రాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. నీలివిప్లవంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ తెలంగాణలో మత్స్యసంపద అభివృద్ధిని, తదనుగుణంగా ఆదాయాన్ని పెంచుతాయి. 


ఈ వరుసలోనే మరో విప్లవం పింక్‌విప్లవం. దీని ఫలితం గానే తెలంగాణ గత మూడేళ్ళలో మాంసం ఉత్పత్తుల పెరుగుదలలో గణనీయమైన వృద్ధి సాధించింది. గొల్ల కురుమల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం కేసీఆర్ చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం ఈ అభివృద్ధికి ఆధారం. 2012లో రాష్ట్రంలో కోటి పదిలక్షల గొర్రెలు ఉంటే 2019లో కోటితొంభైఒక్క లక్షలు, నేటి లెక్కల ప్రకారం రెండుకోట్లకు చేరింది. రాష్ట్రంలో 40 లక్షల మంది గొర్రెల పెంపకంపై ఆధారపడ్డారు. 


మాంసం వినియోగంలో జాతీయ సగటు 5.4 కేజీలుగా ఉంటే, తెలంగాణ రాష్ట్ర సగటు 9.2 కేజీలు. దేశంలోని మాంసం ఉత్పత్తుల వృద్ధిరేటు 6 శాతం కాగా, తెలంగాణ వృద్ధిరేటు 16.9 శాతం. ఐదు సంవత్సరాలలోనే 2.49 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి పెరిగింది. గొర్రెమాంసం ఉత్పత్తి 2017–18లో 1.58 లక్షల టన్నులు ఉంటే, ఒక్క సంవత్సరంలోనే 78 వేల టన్నుల వృద్ధితో 2018–-19లో 2.36 లక్షల టన్నులు అయింది.


కరోనా విపత్తు వల్ల ఆదాయాలు తగ్గిన పరిస్థితులలో కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన ఈ బహుముఖ ప్రగతి సాధన విప్లవం తెలంగాణలోని వివిధ వర్గాలవారు ఆదాయమార్గాలను సంరక్షించుకునేందుకు విశేషంగా తోడ్పడుతోంది. తెలంగాణ సామాజిక, ఆర్థిక రంగాలను ఉత్థాన దిశగా పరుగులెత్తించే ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తోంది. కొన్ని రాజకీయ పక్షాలు అనుసరిస్తున్న విశృంఖలవాదం, విభజనతత్వం, వితండవాదం, రెచ్చగొట్టే ప్రసంగాలు అన్నీ ఉత్తుత్తి మాటలు మాత్రమే. తెలంగాణకు కావాల్సింది ఇవి కాదు. ‘యాక్షన్స్ స్పీక్ లౌడర్ దేన్ వర్డ్స్’ అన్నట్లుగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగి మరిన్ని రంగాలలో విప్లవాత్మక అభివృద్ధి జరగాలి. అన్ని వర్గాల వారి అభివృద్ధితో బంగారు తెలంగాణ ఆవిర్భవించాలి. కేసీఆర్ నేతృత్వంలో ఇదే మన లక్ష్యమవ్వాలి.

రావుల శ్రీధర్ రెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు

Advertisement
Advertisement
Advertisement