సర్పంచుల నెత్తిన అప్పుల కుంపటి!

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

సర్పంచ్‌గా బరిలో గెలిచారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా.. అప్పులు తెచ్చి పనులు చేస్తున్నారు. అప్పుల కోసం ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టారు.

సర్పంచుల నెత్తిన అప్పుల కుంపటి!


  • అభివృద్ధి పనులకు బంగారు ఆభరణాలు తాకట్టు
  • బిల్లులు ఇవ్వకుండా ఆపేసిన ప్రభుత్వం 
  • వడ్డీలు కట్టలేక అవస్థలు
  • ఉమ్మడి జిల్లాలోని 1,189 పంచాయతీల్లో రూ.86.25 కోట్ల అప్పు 
  • 9 నెలలుగా ఎస్టీవోలో పాస్‌ కాని చెక్కులు

సర్పంచ్‌గా బరిలో గెలిచారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా.. అప్పులు తెచ్చి పనులు చేస్తున్నారు. అప్పుల కోసం ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టారు. పనులు చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం బిల్లులు ఇవ్వడం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ సర్పంచులు ఆందోళనకు గురవుతున్నారు. తొమ్మిది నెలలుగా బిల్లులను ఫ్రీజింగ్‌ చేశారని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు తప్పవని వారు వాపోతున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నెట్‌వర్క్‌ (ఆంధ్రజ్యోతి), మే 21 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి. పనులు చేసి డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగి మూడేళ్లు అవుతున్నా బిల్లులు రాక సర్పంచ్‌లు అప్పులపాలవుతున్నారు. చేసిన పనులకు రావాల్సిన డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. గ్రామాల్లో సర్పంచులు ప్రగతి పనులు చేయాల్సిందేనని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అభివృద్ధి పనులు చేయకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వారిని పదవి నుంచి తప్పిస్తామని, చెక్‌పవర్‌ రద్దు చేస్తామని కూడా చెప్పింది. దీంతో చేసేది లేక అనేకమంది సర్పంచులు వడ్డీలకు డబ్బులు తెచ్చి పనులు చేయించారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఆ డబ్బులను ఇవ్వడం లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడంతో పాటు అప్పులు ఇచ్చిన వారు తమ బాకీ తీర్చాలని ఒత్తిడి పెంచుతుండడంతో ఏం చేయాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు.  ప్రధానంగా ఒక్కో సర్పంచ్‌ రైతువేదిక నిర్మాణానికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. మూడు లక్షల నుంచి రూ.5లక్షల దాకా ఖర్చు పెట్టారు. అంతేకాకుండా మురుగు కాల్వలు, రైతు వేదికల నిర్మాణానికి కూడా సొంత డబ్బులే ఖర్చు పెట్టారు. వైకుంఠధామాల నిర్మాణానికి ఉపాధి నిధులు ఇస్తున్నా సిమెంట్‌, ఇటుకల వంటి వస్తువులకు సర్పంచులే డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎస్టీవోల్లో నిధుల ఫ్రీజింగ్‌

15వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎ్‌ఫసీ, ఉపాధి హామీ పథకం ద్వారా మురికికాలువలు, సీసీ రోడ్లు, భవనాలు నిర్మించారు. వీటికి సంబంధించిన నిధులు డ్రా చేసుకునేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు ఎంబీ రికార్డులు పూర్తిచేసి డీఈఈ, ఈఈ, ఎంపీడీలతో చెక్‌ మెజర్‌ చేసిన తర్వాత చెక్కులను ఎస్టీవోలకు పంపుతున్నారు. అయితే ఎస్టీవోలలో ఫ్రీజింగ్‌ పేరిట డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. సాకేతికంగా అన్ని పనులూ పూర్తి చేసినా ఎందుకు బిల్లులు రావడం లేదని సర్పంచులు ఎస్టీవోలను నిలదీస్తే పై నుంచి ఫ్రీజింగ్‌ విధిస్తున్నారు అని సమాధానం ఇచ్చి తప్పించుకుంటున్నారు.

9 నెలలుగా పాస్‌ కాని చెక్కులు..

9 నెలల కాలంగా చెక్కులు పాస్‌ కావడం లేదని, ఎస్టీవో నుండి పలుమార్లు చెక్కులు వెనక్కి వచ్చాయని సర్పంచ్‌లు వాపోతున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకనే ఫ్రీజింగ్‌ పెడుతున్నారని ఎస్టీవోలోని ఓ ఉద్యోగి తెలిపారు. అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడుతున్నామని, తామెవరికి చెప్పుకోవాలని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాగే అప్పులు చేసి బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలని సర్పంచ్‌లు కోరుతున్నారు. కనీసం పంచాయతీ సిబ్బంది జీతాలు కూడా నెలల తరబడి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. 

కక్కలేక.. మింగలేక!

అధికార పార్టీకి చెందిన సర్పంచుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మిగతా పార్టీల సర్పంచులకు లాగానే వీరికి కూడా బిల్లులు రావడం లేదు. వీరు కూడా అప్పులు తెచ్చి పనులు చేపట్టారు. కానీ, వారు ఇబ్బందులను బయటకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. తమ పార్టీకి చెందిన ప్రభుత్వమే బిల్లులు ఇవ్వకపోవడంతో ఆ కష్టాలు బయటకు చెబితే తమ నాయకుల ఆగ్రహానికి గురవుతామేనని తమలో తామే భయపడుతున్నారు. తమ కష్టాలు బయటకు చెప్పుకోలేకపోతున్నామని.. అలాగని తమకు అప్పుల బాధలు లేకుండా పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్టుగా మారిందని ఆందోళన చెందుతున్నారు.


రావాల్సిన బిల్లులు (నియోజకవర్గాల వారీగా)

నియోజకవర్గం పంచాయతీలు     రావాల్సిన 

    బిల్లులు 

    (రూ.కోట్లలో)

మేడ్చల్‌     61 11.00

చేవెళ్ల     164 13.09

ఇబ్రహీంపట్నం     80 08.18

షాద్‌నగర్‌     152 15.00

తాండూరు     143 04.25

పరిగి     165 10.25

కొడంగల్‌     119 08.00

వికారాబాద్‌     137 10.96

మహేశ్వరం (రూరల్‌)     66 00.62

ఆమనగల్లు (కల్వకుర్తి)    102 04.86

(మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం, కందుకూరు మండలాలు. కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లాలోకి వచ్చే మండలాలు ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడ్గుల మండలాల వివరాలు మాత్రమే)

నగలు తాకట్టు పెట్టి..

ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి దూస రమేష్‌, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి సర్పంచ్‌. గ్రామంలో భూగర్భ డ్రైనేజీ పనులతో పాటు ట్రాక్టర్‌ డ్రైవర్‌ జీతాలు, డీజిల్‌ కోసం డబ్బులు కావాల్సి వచ్చింది. దీంతో తన భార్య వద్ద ఉన్న రెండున్నర తులాల బంగారు నగలను మార్వాడీ వద్ద తాకట్టు పెట్టి రూ .రెండున్నర లక్షలు తీసుకున్నాడు. అవి కూడా సరిపోకపోవడంతో తన సోదరి వద్ద ఉన్న రెండున్నర తులాల బంగారు నగలను కూడా ప్రైవేటు ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.ఆరు లక్షలు తీసుకున్నాడు.. ఆ డబ్బులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే, చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. అప్పులిచ్చిన వారు డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం మాత్రం చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఈ డబ్బుల కోసం ఎస్టీఓకు వెళితే ఫ్రీజింగ్‌ చేశారు. డబ్బులు ఇవ్వడం కుదరని చెప్పారు. దీంతో అప్పు ఎలా తీర్చాలో అర్ధం కాక ఆందోళన చెందుతున్నాడు. 

బిల్లులు రావడం లేదు 

గ్రామంలో చేపట్టిన పనులకు బిల్లులు రాలేవు. ఆరు నెలలుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నా. గ్రామంలో పనులకు సొంత డబ్బులు రూ.16 లక్షలు వెచ్చించా. ఇప్పటివరకు బిల్లులు రాలేదు. డబ్బులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

                                           బసగాళ్ల వినిత, సర్పంచ్‌, రెడ్డిపల్లి. మొయినాబాద్‌

 ఏ చెక్కులూ పాస్‌ కావడం లేదు

ఎస్టీవోలలో చెక్కులు పాస్‌ కావడం లేదు. అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు రావడం లేదు. అప్పులిచ్చిన వారు ఇంటికి వచ్చి పోతున్నారు. మాకు రావాల్సిన అసలు, వడ్డీ ఇవ్వమని అడుగుతున్నారు. అప్పులు ఇచ్చిన వారు వస్తున్నారంటేనే భయమేస్తోంది.

                                      - బద్దం గోపాల్‌రెడ్డి, సర్పంచ్‌, ఘణాపూర్‌, ఘట్‌కేసర్‌ మండలం

ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది 

పంచాయతీ నిర్వహణ కోసం రూ.10లక్షల దాకా అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో అప్పులు ఇచ్చిన వాళ్లు అడుగుతున్నారు. పంచాయతీలో పనుల కోసం నగలు తాకట్టు పెట్టి రూ.1.30లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.ఆరు లక్షలు, మిత్రుల వద్ద చేబదులుగా రూ. రెండు లక్షలు అప్పు చేశా. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. బిల్లులు వచ్చేలా కనిపించడం లేదు. పరిస్థితిని తలుచుకుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. 

                                          - జంగం సుగుణ సాయిలు, సర్పంచ్‌, ఎక్వాయిపల్లి, కడ్తాల్‌

రూ.6లక్షలు ఖర్చుపెట్టాను

పల్లె ప్రకృతివనం కోసం రూ. 6లక్షలు ఖర్చు చేశా. ఇంతవరకు బిల్లు రాలేదు. గ్రామపంచాయతీకి సంబంధించి అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కులు బ్యాంకుల్లో పాస్‌ కావడం లేదు. నాలుగు నెలలుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు రాలేవు. అప్పులు తెచ్చి చేతినుంచి ఇస్తున్నాం. 

                                                     -అంబటి ప్రభాకర్‌, సర్పంచ్‌, ఎస్‌బీపల్లి, కొత్తూర్‌ 

రూ.30వేలు వడ్డీ కడుతున్నా

గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.10లక్షల మేరకు అప్పు తెచ్చాను. ఆరు నెలలుగా ఎస్టీవోలో ఫ్రీజింగ్‌ల కారణంగా చెక్కులు పాస్‌ కావడం లేదు. తెచ్చిన అప్పులకు ప్రతినెలా రూ.30వేలు వడ్డీ కడుతున్నాను. ఎంబీ రికార్డులకు సంబంధించి అధికారులకు ఫోన్లు చేస్తే వారు స్పందించడం లేదు. 

                                                    ఎత్తరి రాములు, సర్పంచ్‌, అంతారం, తాండూరు 

Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST