Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

‘కశ్మీరీ చందమామ’పై రక్త చారికలు!

twitter-iconwatsapp-iconfb-icon
కశ్మీరీ చందమామపై రక్త చారికలు!

ఉన్నట్లుండి మన ఇళ్లపై కొందరు దుండగులు దాడి చేసి కాల్పులు జరిపి, విధ్వంసం సృష్టిస్తే ఎలా ఉంటుంది? ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్లు ఖాళీ చేసి భయభ్రాంతులవుతూ మరో ఊరికి శరణార్థులుగా వెళ్లి జీవించాల్సి వస్తే మన పరిస్థితి ఏమిటి? విశాలమైన ఇళ్లను వదిలిపెట్టి పరాయి ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండడానికి చోటు దొరకక, చాలీ చాలని గదుల్లో దుర్భర జీవితం గడపాల్సి వస్తే ఏమి చేయగలం? మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో కశ్మీరీ పండితులకు ఇదే జరిగింది. అక్కడి నుంచి కశ్మీరీ పండిత కుటుంబాలు పెద్ద ఎత్తున వలస వచ్చి జమ్ములోనూ, ఢిల్లీలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ తలదాచుకోవాల్సి వచ్చిందన్న మాట అవాస్తవం కాదు. దేశ రాజధాని ఢిల్లీలో అలాంటి వారిని చాలామందిని చూశాను. వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. మీకూ, నాకూ తెలిసిన రాహుల్ పండితా ఆ పాత్రికేయులలో ఒకరు.


ఇవాళ దేశ వ్యాప్తంగా ‘కశ్మీరీ ఫైల్స్’ సినిమాపై చర్చ జరుగుతోంది. పెల్లుబుకిన భావోద్వేగాల మధ్య అనేకమంది ఆ సినిమాను చూస్తున్నారు. ఒకే కోణాన్ని ప్రదర్శించిన ఈ సినిమా ఇప్పుడు విడుదల కావడం వెనుక ఒక లక్ష్యం ఉన్నదని, ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలని అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భావిస్తోందని అనేవారు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ సినిమా అద్భుతంగా ఉన్నదని, ప్రతీ భారతీయుడు చూడాల్సిన సినిమాగా అభివర్ణించారు. బిజెపి నేతలు అనేక మంది ఆ సినిమాను ప్రజలకు ఉచితంగా చూపిస్తున్నారు. సినిమా గురించి ప్రచారం చేసుకోవడం సరే, కశ్మీరీ పండితులకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నకు బిజెపి నేతలనుంచి జవాబు రావల్సి ఉన్నది.


రాహుల్ పండితా రచించిన ‘అవర్ మూన్ హాస్ బ్లడ్ క్లాట్స్’ (మా చందమామపై నెత్తుటి మరకలున్నాయి) అన్న పుస్తకంలో కశ్మీరీ పండితులపై కొన్ని శతాబ్దాలుగా జరిగిన దారుణాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. కశ్మీర్‌లో 14వ శతాబ్దంలో ఇస్లాం ప్రవేశించకముందు విలసిల్లిన హిందూ, బౌద్ధ సంస్కృతి గురించి ఆయన క్లుప్తంగా ప్రస్తావించారు. మొగల్ సామ్రాజ్య హయాంలో దేశంలో అన్ని ప్రాంతాల్లో ప్రజల పట్ల దారుణాలు జరిగినట్లే కశ్మీర్‌లో కూడా జరిగాయి. రాహుల్ పండితా తన పుస్తకంలో సుల్తాన్ సికందర్ హయాంలో హిందువుల ఊచకోతనూ, మత మార్పిడుల ఆరంభాన్ని, అఫ్ఘాన్ పాలకుల నెత్తుటి కేళిని ఉల్లేఖించారు. అదే సమయంలో పరమత సహనంతో వ్యవహరించిన ముస్లిం పాలకుల గురించీ, హిందూ, ముస్లిం వ్యత్యాసాలకు అతీతంగా కాశ్మీరీ కవయిత్రి లల్లేశ్వరి ( 1320–92) మార్మిక కవిత్వం గురించీ, షేక్ నూరుద్దీన్ నూరానీ (1377–1438) సూఫీ కవిత్వం గురించీ పలవరించారు.


ఇదంతా ఒక ఎత్తు అయితే కశ్మీర్ కల్లోలం వెనుక దేశ విభజన సమయం నుంచీ పాకిస్థాన్ ప్రమేయాన్ని కాదనలేము. పాక్ ప్రేరేపిత దురాక్రమణ దారులు స్థానికుల మద్దతుతో సృష్టించిన బీభత్సం ఒక ఎత్తు అయితే, 1980వ దశకంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామాల ప్రభావం కశ్మీర్‌పై పడడం మరొక ఎత్తు. భారత్‌కు వంద నెత్తుటి గాట్లు పెడతామన్న బేనజీర్ భుట్టో, జియాఉల్ హక్ విధానాలు, అఫ్ఘాన్‌లో రష్యన్ దురాక్రమణ, పాకిస్థాన్‌కు అమెరికా ఇచ్చిన మద్దతు, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన ఘట్టాలను కూడా మరిచిపోలేం. వీటన్నిటి మధ్య తోటి ముస్లిం స్నేహితులే తమకు వ్యతిరేకం కావడం, పాకిస్థాన్ అనుకూల నినాదాల్ని చేయడం, ఒకప్పుడు ఇరు మతాల పండగల్ని, వివాహాల్నీ కూడా రెండు మతాల వారు కలిసి జరుపుకున్న శుభ దినాలు సమసిపోయి ఒకర్నొకరు ద్వేషించే రోజులు రావడం, ఆజాదీ నినాదాలు మిన్నంటడం, మొత్తం కశ్మీరీ సమాజమే తమను వెలివేయడం వరకు రాహల్ పండితా గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తన సోదరుడు రవిని బస్సు నుంచి లాగి ఉగ్రవాదులు తూటాలకు బలి చేయడాన్ని కూడా ఆయన చూశారు. కళ్లముందే మొత్తం కుటుంబాన్ని కాల్చి చంపితే దాక్కుని బయటపడ్డ సునీల్‌ధర్ లాంటి వారూ ఆయనకు తెలుసు. తమ ఆడపిల్లలను మెజారిటీ వర్గం నుంచి కాపాడుకోవాల్సిన దుస్థితికీ గురయిన కుటుంబాలూ తెలుసు. జనవరి 1990 నుంచి సెప్టెంబర్ 1990 వరకు 3.5 లక్షలమంది కశ్మీరీ పండితులు శరణార్థులుగా తరలి వెళ్లారని రాహుల్ పండితా అంచనా. జమ్ముకు పారిపోయి చాలీ చాలని ఇళ్లలో, ధర్మశాలల్లో నివసించిన రాహుల్ కుటుంబం చివరకు ఢిల్లీ చేరుకుంది.


కశ్మీరీ పండితుల విషయంలో మూడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమూ న్యాయం చేయలేకపోయింది. ఇప్పటికీ వారు దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్నారు. కొన్ని వందల సంవత్సరాలు కశ్మీర్‌లో నివసించిన వారు ఇవాళ చెట్టుకొకరూ, పుట్టకొకరూ చెల్లా చెదురయ్యారు. పండితులను ఊచకోత కోసిన వారిని కోర్టులు వదిలేశాయి. ‘మేము పెద్ద ఓటు బ్యాంకు కాదు కనుక మా గురించి ఎవరూ పట్టించుకోలేదు, మీడియాకు కూడా మా ఘోష వినిపించలేదు’ అని వారు వాపోతున్నారు. ఇవాళ దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని రాహుల్ పండితా చెప్పారు.


కశ్మీరీ అంశం ఎలా పరిష్కారమవుతుంది? కశ్మీర్‌లో పండిత కుటుంబాలు వలస వెళ్లడానికి కారణాలను అన్వేషించకుండా సమస్య పరిష్కారం కాదని రాహుల్ పండితా అంటారు. కేవలం ఇస్లామిక్ మిలిటెంట్లే కాదు, మొత్తం మెజారిటీ మతస్థులు కశ్మీరీ పండితులపై ఎందుకు దాడి చేశారో, సాధారణ ప్రజలు కూడా తమ పట్ల క్రూరంగా ఎందుకు వ్యవహరించారో తేలాలని ఆయన అంటారు, కేవలం కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి, అదృశ్యాల గురించీ మాట్లాడితే సరిపోదన్నారు. కశ్మీరీ పండితుల సమస్యను ఎలా పరిష్కరించాలన్న విషయంలో భారత ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదని రాహుల్ పండితా అభిప్రాయపడుతున్నారు. కశ్మీరీ ముస్లిం మెజారిటీ కశ్మీరీ పండితులను తిరిగి ఆమోదించే పరిస్థితి ఎలా కల్పించాలి, ఏ విధంగా వారి మధ్య చర్చలకు ప్రాతిపదిక కల్పించాలన్న విషయం చర్చించాల్సి ఉన్నదని ఆయన అన్నారు. అసలు కశ్మీరీ ముస్లింలు, ప్రజాస్వామ్యానికి పూర్తిగా కాకపోయినా గణనీయంగా విలువనిస్తున్న భారత్‌లో ఉండడం మంచిదా, లేక ఒక ఇస్లామిక్ రాజ్యంగా విఫలమై, ప్రజాస్వామ్యం పూర్తిగా విచ్ఛిన్నమై, ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్థాన్‌లో భాగం కావడం మంచిదా? ఆజాదీ కశ్మీర్ అచరణలో సాధ్యమా అన్న ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. వీటన్నిటి గురించి స్వేచ్ఛగా చర్చించాలని రాహుల్ పండితా అభిప్రాయపడ్డారు.


కశ్మీరీ నిర్వాసితుడైన రాహుల్ పండితా తన జీవితాన్ని ఈ దేశంలో ఇతర ప్రాంతాల్లో నిర్వాసితులైన ఆదీవాసీల్లో వెతుక్కోవడం చెప్పుకోదగ్గ విషయం. జార్ఖండ్, బస్తర్, ఛత్తీస్‌ఘఢ్, మహారాష్ట్ర అడవుల్లో తిరిగి అక్కడి ఆదీవాసీల గురించి ఆయన విస్తృతంగా రాశారు. తాము ఉన్న ప్రాంతం నుంచి కూకటి వేళ్లతో సహా పెకిలించుకుపోయి నిరాశ్రయులుగా బతుకుతున్న వారి జీవితాలతో ఆయన మమేకమయ్యారు. గుజరాత్ అల్లర్ల సమయంలో ఒక మాజీ ఎంపీని దుండగులు చంపడాన్ని తన తండ్రి హర్షించినప్పుడు మానవత్వం గురించి గుర్తు చేసిన ఉదాత్తుడు రాహుల్ పండితా.


కశ్మీరీ పండితుల అంశం బిజెపి ఎజెండాలో ఎప్పుడు చేరింది? రామజన్మభూమి కన్నా కశ్మీరీ పండితులకు బిజెపి తన ఆవిర్భావ సమయంలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు? కశ్మీరీ పండితుల గురించి బిజెపి ఒక ప్రతిపక్షంగా ఎన్నిసార్లు చట్టసభల్లో ప్రస్తావించింది? ఇవన్నీ చర్చనీయాంశమైన ప్రశ్నలు. వాజపేయి ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరీపండితుల దుస్థితి గురించి తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. కాని ఏమి చేయాలో ఆయనకు కూడా పాలుపోలేదు. ఆడ్వాణీ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోపే జమ్ములోని ఉదంపూర్ జిల్లాలోని రెండు గ్రామాల్లో మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా 29 మంది తలలను ఉగ్రవాదులు ఉత్తరించారు. ఆ తర్వాత మరో రెండు నెలలకు ప్రేమనగర్ గ్రామంలో ఒక పెళ్లిలో పాల్గొన్న 25 మందిని ఊచకోత కోశారు. ‘వారి భద్రత గురించి హామీ ఇవ్వకుండా వారిని అదే గ్రామాల్లో జీవించాలని నేనెలా చెప్పగలను’ అని ఆడ్వాణీ తన ఆత్మకథలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘మిమ్మల్ని రక్షించకపోతే నేను హోంమంత్రిగా ఉండడం తగింది కాదు’ అని చెప్పిన ఆడ్వాణీ తన హయాంలో కశ్మీరీ పండితుల పునరావాసానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేకపోయారు. కశ్మీరీ పండితులు తిరిగి తమ రాష్ట్రంలోని స్వస్థలాల్లో ప్రవేశించలేని పరిస్థితి రానంతవరకూ కశ్మీరీ సమస్యకు గౌరవనీయమైన, శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందని అనుకోను అని ఆడ్వాణీ ప్రకటించారు. ‘కశ్మీరీ ఫైల్స్’ను మెచ్చుకున్న మోదీ వద్ద కశ్మీరీ పండితుల సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉన్నది? కనీసం ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిష్కారం సాధించే ప్రయత్నం జరుగుతుందా?


కశ్మీరీ పండితులు శరణార్థులుగా వెళ్లడం అనేది కేవలం మతపరమైన సమస్యగా, రాజకీయ అంశంగా భావించినంత కాలం ఆ సమస్యకు పరిష్కారం లభించదు. అసలు భారతదేశంలో శరణార్థులుగా, నిర్వాసితులుగా మారడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. దేశ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది నిర్వాసితులుగా మారుతున్నారని ఢిల్లీలోని ‘ఇండియన్ సోషల్ ఇనిస్టిట్యూట్’ నిర్వహించిన అధ్యయనం మాత్రమే కాదు ‘ప్రపంచ శరణార్థుల సర్వే’ సైతం స్పష్టం చేసింది. ఈశాన్య భారత రాష్ట్రాలలో జరిగిన హింసాకాండ వల్ల వేలాది మంది శరణార్థులయ్యారు. బస్తర్‌లో వేలాది ఆదివాసీలు శరణార్థులుగా జీవిస్తున్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడుంలో ఒకప్పుడు ప్రభుత్వం ఉపయోగించుకున్న ఆదివాసీలు ఏ రాష్ట్రానికి చెందిన వారమనేది తెలియక అంతర్ రాష్ట్ర సరిహద్దు అడవుల్లో ఎలాంటి గుర్తింపు లేకుండా జీవిస్తున్నారని, వారిని ఏ రాష్ట్రమూ స్వీకరించడం లేదని ఒక ఎన్జీవో తెలిపింది. ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వేలాది మంది అనేక రాష్ట్రాల్లో తమ మనుగడ కోసం పోరాడుతున్నారు. ప్రజలను ఓటు బ్యాంకులుగా భావించినంతకాలం ఈ దేశంలో కశ్మీరీ పండితులకే కాదు, మరే రకమైన నిర్వాసితుల సమస్యకు కూడా పరిష్కారం లభించదు.

కశ్మీరీ చందమామపై రక్త చారికలు!

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.