Advertisement
Advertisement
Abn logo
Advertisement

రక్తపాతం

అనంతగిరి మండలం బగ్మారవలసలో  దారుణం

రెండు కుటుంబాల మధ్య గొడవ

మారణాయుధాలతో పరస్పరం దాడులు

ముగ్గురి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

మృతుల్లో తండ్రీకొడుకు


అనంతగిరి, డిసెంబరు 1:

జిల్లాలోని అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగి, అది కాస్తా కొట్లాటకు దారితీయడంతో ముగ్గురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తండ్రీకుమారులు కావడం గమనార్హం. కాగా ఈ కొట్లాటలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. 

బగ్మారవలస గ్రామానికి చెందిన కిల్లో కోమటి (45) చిల్లంగి చేస్తుంటాడని గొల్లోరి డొంబు, అతని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. దీనిపై ఇరువర్గాల మధ్య కొద్దిరోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఇరు కుటుంబాల వారు ఘర్షణ పడ్డారు. ఈ సమయంలో కోమటి పెద్ద కుమారుడైన బలరామ్‌పై డొంబు కుమారుడు సుబ్బారావు కత్తితో దాడి చేశాడు. దీనిని అడ్డుకునేందుకు కోమటి యత్నించగా, అతని ఛాతీపై కత్తిపోటు పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన కోమటి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇదే సమయంలో కోమటి మరో కుమారుడైన భగవాన్‌పైనా సుబ్బారావు కత్తితో దాడిచేశారు. అతనికి కూడా  తీవ్రగాయాలయ్యాయి. దీంతో కోమటి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరణాయుధాలతో గొల్లోరి డొంబు, సుబ్బారావులపై దాడి చేశారు. డొంబు తీవ్రగాయాలతో అక్కడి నుంచి తప్పించుకోగా, సుబ్బారావు కుప్పకూలిపోయాడు. అనంతరం స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత అంబులెన్స్‌ రావడంతో గొల్లోరి సుబ్బారావు (25), కిల్లో కోమటి కుమారులైన బలరామ్‌, భగవాన్‌లను చికిత్స నిమిత్తం అనంతగిరి పీహెచ్‌సీకి తరలించారు. చికిత్స పొందుతూ సుబ్బారావు మృతిచెందాడు. మిగిలిన ఇద్దరికీ ప్రథమ చికిత్స అందించి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొల్లోరి డొంబు కోసం గాలిస్తుండగా, సమీపంలో రోడ్డు పక్కన విగతజీవిగా పడివున్నాడు. పోలీసులు దగ్గరకు వెళ్లి పరిశీలించి, ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు.

Advertisement
Advertisement