Abn logo
Oct 18 2020 @ 09:54AM

సేవతో ‘రక్త సంబంధం’ కలుపుకుంది

Kaakateeya

ప్రపంచంలోని కోట్లాది ప్రజానికంతో ‘రక్త సంబంధాన్ని’ కలుపుకునేందుకు సిద్ధం అయ్యింది. ‘బ్లడ్‌.లైవ్‌’ అనే టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌తో రక్తదానానికి వినూత్న వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఆమె ఎవరో కాదు.. పద్మజారెడ్డి సరిపల్లి. రైతు బిడ్డగా పుట్టి.. టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పి.. పారిశ్రామికవేత్తగా.. సామాజిక సేవకురాలిగా.. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఆమె ప్రయాణం తన మాటల్లోనే..


‘పుట్టింది ఆంధ్రాలోనే అయినా.. పెరిగిందంతా నగరంలోనే. నేను పక్కా హైదరాబాదీని.. తెలంగాణ బిడ్డని. దశాబ్దాల కాలంగా నగరంలో స్థిరపడిపోయాం. బాలానగర్‌, కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలో పద్మక్కగా అందరికీ సుపరిచతమే. వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచి కష్టంతో కలిసిమెలిసి ఇష్టంగా పెరిగా. పొలంలో కూలీలతో కలిసి పని చేశా. అప్పుడే వారి వెన్నులో కష్టానికి దన్నుగా నిలవాలనుకున్నా. పెరిగి పెద్దయ్యాక ఏం చదువుకున్నా.. ఎలాంటి కొలువు సాధించినా.. పేదలకు దూరం కాకూడదు అనుకున్నా. వారికి చేయూత అందించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనుకున్నా. ఇప్పుడు అదే చేస్తున్నా. నేను ఉంటున్న సుభాష్‌నగర్‌ 25 ఏళ్లుగా నాకు తెలుసు. ఎక్కువగా పేదలు, వలస కార్మికులే కనిపిస్తారు. ఇదో మినీ భారత్‌లా అనిపిస్తుంది. దేశం నలుమూలల నుంచి పొట్టచేతబట్టుకుని వచ్చేవారే ఎక్కువ. దీంతో మొదట్నుంచీ వారికి ఏదో ఒక రూపంలో సాయపడేదాన్ని. ఇక కరోనా సమయంలో అయితే ఇక్కడి పరిస్థితి అత్యంత దయనీయం. నెలల తరబడి రోజూ కొన్ని వేల మందికి నిత్యావసర సరుకులు అందించాం. టన్నుల బియ్యం పేదలకు పంచాం. పెద్ద మొత్తంలో ఖర్చు చేసి సుభాష్‌నగర్‌, బాలానగర్‌ పరిసర ప్రాంతాల్లో కొంత వరకు ఆకలి తీర్చాం. వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చడంలో తోడ్పాటునందించాం. స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి సాయం వచ్చినప్పుడు అవి అర్హులకు అందేలా సహకారం అందించాను.  


మహిళా సంక్షేమంలో భాగంగా...

బిడ్డని నవమాసాలు కడుపున మోయడం.. ప్రసవించడం.. కంటికి రెప్పలా కాపాడుకోవడం.. ఇవన్నీ దాటుకుని వచ్చిన క్రమంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని దగ్గరగా చూశా. పేదరికం కారణంగా సరైన పోషకాలు లభించకపోవడం.. ప్రసవ సమయంలో చికిత్స నిమిత్తం రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయిన ఓ తల్లిని చూసినప్పుడు మనసు వికలమైంది. కడుపులో సురక్షితంగా పెంచిన బిడ్డను కళ్లారా చూడకుండానే వెళ్లిపోయిందా తల్లి. ఆ బిడ్డకి అమ్మ ఎప్పటికీ ఫొటో ఫ్రేములో కనిపించే అందమైన రూపమే. ఆ సంఘటనని జీర్ణించుకోలేకపోయా. అంతేకాదు.. సరైన సమయంలో రక్తం దొరక్క వ్యక్తిగతంగా నేనూ, నాకు తెలిసిన ఎంతో మంది పడుతున్న ఇబ్బందుల్ని ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నా. ప్రస్తుతం మన జీవించే డిజిటల్‌ ప్రపంచంలో అన్ని సౌకర్యాలు, సేవలు ఆన్‌లైన్‌లో క్షణాల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ, ప్రాణాల్ని కాపాడే రక్తదానం విషయంలో ఎందుకు సరైన టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌లేదని అన్వేషించడం మొదలుపెట్టా. అప్పుడు పుట్టుకొచ్చిందే ‘బ్లడ్‌.లైవ్‌- రియల్‌ టైం లైఫ్‌ సేవింగ్‌ ప్లాట్‌ఫామ్‌’. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా రూపొందించిన స్వచ్ఛంద సామాజిక సంస్థ బ్లడ్‌.లైవ్‌. కాన్పురూములో ఉన్న కాబోయే అమ్మ... ఆఫీస్‌ నుండి ఇంటికొస్తూ యాక్సిడెంటైన నాన్న... ఇలా కుటుంబ సభ్యులు ఎవరైనా రక్తం దొరక్క చనిపోయారు అనే వార్తలు కనిపించకూడదు అనే లక్ష్యంతో ముందుకొచ్చాం. 


ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా రక్తదానం చేయడానికి ఏర్పడిన ఫ్లాట్‌ఫాం ఇది. సేవా ఫౌండేషన్‌ సౌజన్యంతో కోటి గ్రూప్‌ వారి భారత్‌ హెల్త్‌కేర్‌ లాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏళ్ల కృషి ఫలితమే ఈ బ్లడ్‌.లైవ్‌. ఇతర వివరాలకు https://blood.live సైట్‌ని చూడొచ్చు.యాప్‌లో సభ్యులైతే చాలు

ఇప్పుడు అన్నింటికీ మొబైల్‌ యాప్‌లే ప్రత్యామ్నాయం. బ్లడ్‌.లైవ్‌ కూడా సులువైన ఇంటర్ఫేస్‌తో రూపుదిద్దుకున్న యాప్‌ బేస్డ్‌సర్వీస్‌. ఇన్‌స్టాల్‌ చేసుకుని మొబైల్‌ నెంబర్‌తో సభ్యుల వ్వొచ్చు. ఓటీపీతో రిజిస్ట్రేషన్‌ ముగుస్తుంది. ఇక మీరు రక్తదానం చేసేందుకైనా.. పొందేందుకైనా బ్లడ్‌.లైవ్‌ సేవల్ని వాడుకోవచ్చు. అదీ ప్రపంచ స్థాయి ప్రైవసీ సెక్యూరిటీ యాంటీ స్పామింగ్‌ ఫీచర్లతో యాప్‌ పని చేస్తుంది. ప్రాణాల కోసం పోరాడుతూ రక్తం అవసరం ఉన్నవారిని, వారి చుట్టు పక్కల ఉన్న వాలంటీర్‌ రక్తదాతతో కనెక్ట్‌ చేసి రక్తదానాన్ని ప్రాణదానంగా మార్చడమే బ్లడ్‌.లైవ్‌ ప్రధాన ఉద్దేశ్యం. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ధైర్యంగా రక్త దాతలుగా మారొచ్చు. వారి సెక్యూరిటీ, ప్రైవసీకి ఇబ్బందులు లేకుండా యాప్‌ని తీర్చిదిద్దాం. ఫోన్‌ నంబర్లు ఆకతాయిలకు చిక్కుతాయనే సందేహం అక్కర్లేదు. టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి కూడా రిజిస్టర్‌ అయ్యే వీలుంది. స్పందించే గుణమున్న మానవతావాదులకు... అత్యాధునిక టెక్నాలజీ దొరికితే గొప్ప ఫలితం దక్కుతుంది అనేందుకు ఈ యాప్‌ నిదర్శనం.

                             - ఇషాన్‌

Advertisement
Advertisement
Advertisement