రక్తం నిల్వలు నిండుకున్నాయ్‌!

ABN , First Publish Date - 2021-05-15T05:41:26+05:30 IST

రోజుకు అవసరం 200 యూనిట్లు.. అందుతున్నది 50 గతేడాది నుంచి ఇదే పరిస్థితి కరోనాతో కొందరు.. వ్యాక్సిన్‌తో ఇంకొందరు! ముందుకురాని దాతలు నెల్లూరు(వైద్యం) మే 14 : ఇందుకూరుపేటకు చెందిన ఓ గుండె జబ్బు వ్యక్తి నెల్లూరులోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రక్తం నిల్వలు నిండుకున్నాయ్‌!

రోజుకు అవసరం 200 యూనిట్లు.. అందుతున్నది 50

గతేడాది నుంచి ఇదే పరిస్థితి

కరోనాతో కొందరు.. వ్యాక్సిన్‌తో ఇంకొందరు!

ముందుకురాని దాతలు


నెల్లూరు(వైద్యం) మే 14 :


ఇందుకూరుపేటకు చెందిన ఓ గుండె జబ్బు వ్యక్తి నెల్లూరులోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స కోసం 5 యూనిట్ల ఓ పాజిటివ్‌ రక్తం కావాల్సి వచ్చింది. అయితే, రక్తం కొరత కారణంగా బాధితుడి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. చివరకు సొంతూరిలో తెలిసిన వారిని కలిసి రక్తం సేకరించడానికి రెండు రోజులు పట్టింది.


కోవూరుకు చెందిన ఓ మహిళ రక్తహీనతతో ప్రసవం కోసం ఓ ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆమెకు మూడు యూనిట్ల రక్తం కావాలని వైద్యులు చెప్పారు. నగరంలోని బ్లడ్‌బ్యాంకుల చుట్టూ తిరిగినా కేవలం ఒక యూనిట్‌ మాత్రమే అందింది. మిగిలిన యూనిట్ల  కోసం దాతలను కలిసి రక్తం సేకరించడానికి పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.


ఇలా ఎందరో అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొందరైతే రక్తం అందుబాటులో లేక శస్త్రచికిత్సలనే వాయిదా వేసుకునే  పరిస్థితి ఏర్పడింది. కరోనా మహమ్మారి రక్తదాతలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదైనప్పటి నుంచి స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించేవారు కరువయ్యారు. ఎక్కడైనా శిబిరాలు ఏర్పాటు చేసినా పదుల సంఖ్యలో మాత్రమే రక్తదానం చేస్తున్నారు. రాష్ట్రంలోనే రక్తం సేకరణలో జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ముందంజలో ఉండేది. అలాంటిది ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రోజుకు జిల్లాలో 200 యూనిట్ల అవసరం కాగా ప్రస్తుతం 50 యూనిట్లు దొరకడమే కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసర రోగులు రక్తం కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. 


45 వేల మంది దాతలు

రక్తదాన ఉద్యమంలో జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఉంది.  జిల్లాలో 45 వేల మందికిపైగా రక్తదాతలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కరోనా కారణంగా వీరిలో చాలా మంది రక్తదానం అవసరాలను తీర్చలేక పోతున్నారు. ఎవరైనా రోగులు అత్యవసరంగా ఫలానా రక్తం కావాలని కోరిన వెంటనే దాతలు స్పందించి రక్తదానం చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో రక్తదానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయోనన్న సమస్యలు నెలకొంటున్నాయి. ఎక్కువ మంది యువత జిల్లాలో రక్తదానం చేసేవారు. వారు కూడా రక్తం ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. ఇక సినీ హీరోల అభిమానులు పుట్టిన రోజులు, శుభకార్యాలకు రక్తదానం చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం కరోనా వల్ల ఆ ఆలోచనలనే విరమించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో దాతల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ప్రతి పది వేల మందిలో 15 మంది రక్తదానం చేయాల్సి ఉండగా ఐదుగురు మాత్రమే రక్తదానం చేస్తుండటంతో ఈ సమస్య నెలకొంది. వీరు కూడా ప్రస్తుతం ముందుకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.


చేతులెత్తేస్తున్న బ్లడ్‌బ్యాంక్‌లు

రక్తదాతలకు తమ సహాయ సహకారాలు అందించడంలో బ్లడ్‌ బ్యాంకులు  ఎంతో కృషి చేస్తున్నాయి.  ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్లడ్‌ బ్యాంక్‌ అత్యధికంగా ఏటా 20 వేల యూనిట్లకుపైగా రక్తం సేకరిస్తోంది. అయితే ప్రస్తుతం అవసరమైన రక్తం అందించలేకపోతోంది. సాధారణ రోజుల్లో రోజుకు 100 యూనిట్లకుపైగా రక్తం  పంపిణీ చేస్తుండగా, ప్రస్తుతం 20 నుంచి 30 యూనిట్లు  అందించడమూ కష్టంగా మారుతోంది. ఉన్న నిల్వలు కూడా మరో వారం రోజులకే సరిపోతాయి. ఆ తర్వాత పరిస్థితి ఏమటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నెల్లూరులో ఉన్న నోవా బ్లడ్‌బ్యాంక్‌, నెల్లూరు బ్లడ్‌బ్యాంక్‌, విజయ బ్లడ్‌బ్యాంక్‌లలోనూ రక్తనిల్వలు అందుబాటులో లేవు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే జీజీహెచ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ కూడా సేకరించలేని పరిస్థితిలో ఉంది. నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌ కూడా ఏటా వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తూ రక్తదాతలను ప్రోత్సహిస్తోంది. గూడూరు, కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, ఉదయగిరి ఏరియా ఆసుపత్రులలోని బ్లడ్‌ బ్యాంక్‌లు రెడ్‌క్రాస్‌ సహకారంతో రక్తాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుత కరోనా కారణంగా రక్తం సేకరించకలేక పోతున్నాయి. 


రక్తం కొరత తీవ్రంగా ఉంది 

కరోనా కారణంగా రక్తదాతలు ముందుకు రావటం లేదు. కళాశాలలు, పరిశ్రమలు కూడా అందుబాటులో లేక పోవడం మరో కారణం. వ్యాక్సిన్‌ వేసుకున్న వారు కొంత కాలం రక్తదానం చేయకూడదు. దీనివల్ల కూడా దాతలు ముందుకు రావడం లేదు. అవసరమైన మేర రక్తాన్ని అందించలేక పోతున్నాం. అయినా కొందరు రక్తదాతలకు వాట్సప్‌ మెసేజ్‌ ద్వారా రోగులకు రక్తం ఇచ్చేలా కృషి చేస్తున్నాం.

- చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌


కరోనా వల్లే..

కరోనా కారణంగా రక్తం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాతలు ముందుకు రావడం లేదు. దీనివల్ల అవసరమైన రోగులకు పూర్తిసాథయిలో రక్తం ఇవ్వలేకున్నాము. ఎలాగోలా కొందరు దాతల నుంచి రక్తం సేకరించినా అవసరాలను తీర్చలేకపోతున్నాం.

- భాస్కర్‌నాయుడు, నోవా బ్లడ్‌బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌


ఎంతో కష్టపడాల్సి వస్తోంది!

అత్యవసర  పరిస్థితుల్లో రక్తం సేకరణకు ఎంతో కష్ట పడాల్సి వస్తోంది. ఎంతో మంది దాతలకు రక్తం కోసం ఫోన్లు చేస్తే తాము వ్యాక్సిన్‌ వేసుకున్నామని ఇవ్వలేమన్న సమాధానం వినబడుతోంది. కొంత మేర రెడ్‌క్రాస్‌ ద్వారా రక్తం సేకరిస్తున్నాం.

- బయ్యాప్రసాద్‌, రక్తదాన మోటివేటర్‌ 

Updated Date - 2021-05-15T05:41:26+05:30 IST