రక్తదాత.. జయీభవ

ABN , First Publish Date - 2021-06-14T06:10:21+05:30 IST

రక్తదాత.. జయీభవ

రక్తదాత.. జయీభవ
ఖమ్మంలో రక్తదాన శిబిరం దృశ్యం(ఫైల్‌)

నిండు ప్రాణానికి రక్తదానం మెండుభరోసా 

ఏటా 60 శిబిరాల ద్వారా రక్త సేకరణ

జిల్లాలో 200 మందికి పైగానే దాతలు

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌ 13: రక్తం మన శరీరం అంతటా ప్రవహించే ద్రవ ఇంధనం.. మన గుండె రక్తనాళాలు కేశరక్త నాళాల ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి ప్రవహించి మనకి జీవనాధారం అయిన ఆక్సిజన్‌ను అందిస్తూ శరీరంలోని వ్యర్థపదార్ధాలను విసర్జించే ప్రక్రియకు తోడ ్పడుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రక్తాన్ని ఎన్నో పరిశోధనలు, ఎంతో శాస్త్రపురోగతి సాధించినా ఇప్పటి వరకు కృత్రిమంగా మాత్రం తయారు చేయలేకపోయారు. శరీరానికి గాయాలైనా, లేదా ఇతర కారణాలతో రక్తం కోల్పోయినవారికి ప్రాణదానం చేయాలంటే రక్తదానమే మార్గం.. ఒక్కసారి దానం చేసే ఒక్క యూనిట్‌ రక్తం.. నాలుగు నిండు ప్రాణాలను కాపాడుతుంది. జిల్లాలో రక్త దాతలు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారు.  జిల్లాలో కనీసం 40సార్లకు పైగా రక్తదానం చేసిన వారూ ఉన్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ఇదీ..

ప్రజలకు రక్తం విలువ తెలిసేలా..

ప్రజలకు రక్తం విలువ తెలియజేసేందుకు ప్రపంచ రక్తదాతల దినాన్ని ఏటా జూన్‌ 14న నిర్వహిస్తున్నారు. 1901లో ఆస్ర్టేలియాకు చె ందిన నోబెల్‌ విజేత కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ మెదటి సారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతిని పురస్కరించుకుని ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మెదటిసారిగా 2004లో ఈరోజును అన్ని దేశాల్లో నిర్వహించాయి. ఖమ్మం జిల్లాలో సుమారు 200లకు పైగానే రక్తాన్ని దానం చేసే దాతలు ఉన్నారు. వీరంతా ఆయా రక్తనిధి కేంద్రాల్లో పిలుపునకు అందుబాటులో ఉంటారు. 40 సార్లకు పైగానే రక్తాన్ని దానం చేసిన దాతలూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 2వేల యూనిట్ల రక్తం నిల్వ చేసేందుకు సామర్థ్యం ఉంటుంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి, శస్త్ర చికిత్సలకు, గర్భిణులకు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఇక్కడి నుంచి రక్తాన్ని అందిస్తుంటారు. అంతేకాకుండా జిల్లాలో ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకులు కూడా ఉన్నాయి. మమత ఆసుపత్రి, విజయశ్రీ, శివ, నోవాకేర్‌, సత్తుపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రితో పాటు లవ్‌లీ బ్లడ్‌బ్యాంకులు బాధితులకు రక్తాన్ని అందిస్తున్నాయి. జిల్లాలో ఏటా 60 నుంచి 70 రక్తదాన శిబిరాలు నిర్వహించి దాతల నుంచి రక్తాన్ని సేకరించి సిద్ధంగా ఉంచుతున్నారు. జిల్లాలో రెడ్‌క్రాస్‌ సొసైటీ, యువభారత్‌ శక్తి, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, పోలీస్‌శాఖ, ఆర్టీసీ ఉద్యోగులతో పాటు జోయాలుక్కాస్‌ ఉద్యోగులు చిమ్మపూడి గ్రామస్థులు, ఏదులాపురం గ్రామస్థులు ఏటా ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధికి రక్తదానం చేస్తున్నారు. వీరితో పాటు వ్యక్తిగతంగా ఆసుపత్రులకు వచ్చి రక్తాన్ని దానం చేసే వారు ఎంతో మంది ఉన్నారు. 

రక్తాన్ని ఎవరు దానం చేయవచ్చు  

18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న స్త్రీ పురుషులు రక్తం దానం చేయవచ్చు. శరీరబరువు కనీసం 45 కేజీలు ఉండాలి. హిమోగ్లోబిన్‌ కనీసం 12.5 గ్రాములు ఉండాలి. బీపీ సాధారణ స్థితిలో ఉండాలి. శరీరంలో కనీసం 5లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానం చేసేప్పుడు కేవలం 350 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. శరీరం 24గంటల్లోగా తిరిగి ఆ రక్తాన్ని తయారు చేసుకుంటుంది. మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. దానం చేసిన 20 నిమిషాల తర్వాత సాధారణమైన దినచర్యలన్నీ నిరాటంకంగా చేసుకోవచ్చు.

ఏ పరిస్థితుల్లో రక్తదానం చేయకూడదంటే..

గర్భవతులు, పసిపిల్లలకు పాలిస్తున్నవారు. పెద్ద ఆపరేషన్‌ చేయించుకున్నవారు. మలేరియా చికిత్స చేయిం చుకున్నవారు. పచ్చకామెర్లు వచ్చి చికిత్స చేయించుకున్న వారు. లైంగిక వ్యాధులు హెచ్‌ఐవీ, మధుమేహం ఉన్నవారు. స్టెరాయిడ్లు, హార్మోన్లకు సంబందించిన ఔషదాలు వాడేవారు రక్తదానం చేయకుడదు.

రక్తాన్ని దానం చేస్తే ప్రయోజనాలు ఎన్నో 

డాక్టర్‌ బి.బాలు, ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి బాధ్యులు

ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతి మూడు నెలలకోమారు రక్తాన్ని దానం చేయవచ్చు. దానం చేస్తే ప్రయోజనం కూడా ఉంటుంది. ప్రధానంగా కొలెస్ర్టాల్‌ తగ్గుతుంది. గుండెకు సంబందించిన వ్యాధులు దరిచేరవు. ఎముకల మధ్య గుజ్జు పెరిగి రక్త కణాల పెరుగుతాయి. రక్తంలో ఉండే ఐరన్‌ స్టోరేజీ తగ్గి ప్రయోజనం ఉంటుంది. క్యాన్సర్‌ రాదు. వీటితో పాటు మరొకరికి ప్రాణం దానం చేసినట్లవుతుంది.

54సార్లు రక్తం దానం చేశా 

పువ్వాళ్ల నాగేశ్వరరావు, ఖమ్మం

ఏ పాజిటివ్‌ రక్తం నాది. 54సార్లు రక్తాన్ని దానం చేశా. ఓ సారి టీవీ స్ర్కోలింగ్‌లో చిన్నారికి ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని రావడంతో ఆ చిరునామాకి వెళ్లి ఆ చిన్నారికి కావాల్సిన ప్లేట్‌ లెట్స్‌ ఇచ్చా. జీవితంలో ఎంతో సంతృప్తిని ఇచ్చింది. రక్తాన్ని దానం చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. మనిషి హుషారుగా ఉంటారు. ఎన్టీఆర్‌ జన్మదినం, ప్రైవేటు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్నో శిబిరాల్లో రక్తాన్ని దానం చేశా. నా ఫోన్‌ నెంబర్‌ 9700804738 రక్తం కావల్సిన వారు ఎవరైన ఫోన్‌ చేయొచ్చు.

45 సార్లు రక్తం దానం చేశా 

రాయపూడి జనార్ధన్‌, ఖమ్మం

(ఫోన్‌: 9440160667)

నాది ‘‘ఓ’’ పాజిటివ్‌ గ్రూప్‌ రక్తం. 45సార్లు రక్తాన్ని దానం చేశా. గర్భిణులకు, చిన్నారులకు రక్తాన్ని అందిం చాం. రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా పలువురికి రక్తాన్ని ఇచ్చా. 18మందికి వివిధ ప్రమాదాల్లో రక్తాన్ని కోల్పోయిన వారికి కూడా దానం చేశా. శిబిరాల్లో పాల్గొని రక్తాన్ని దానం చేయడంతో ప్రభుత్వ అధికారులు గుర్తించారు. గవర్నర్‌ ప్రశంసా పత్రాలకు సిఫారస్‌ చేశారు.

రక్తదానంపై అపోహలు వీడాలి 

మద్ది శ్రీనివాసరెడ్డి, లాయర్‌, ఖమ్మం

(ఫోన్‌: 9948741830)

రక్తదానంపై అపోహలు వీడాలి. నాది ‘‘ఓ’’ పాజిటివ్‌ గ్రూపు రక్తం 31 సార్లు రక్తాన్ని దానం చేశా. దాదాపు 1000మందికి నా రక్తాన్ని అందించగలిగా. ఇది ఎన్ని మంచి పనులు చేసినా లభించని సంతృప్తినిచ్చింది. ఇంకా ఇంకా చేస్తూనే ఉంటా. రక్తాన్ని దానం చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. దానం చేసిన 20 నిమిషాల్లో మళ్లీ మన పనులన్నీ చేసుకోవచ్చు. 

Updated Date - 2021-06-14T06:10:21+05:30 IST