ఇప్పుడు అత్యవసరం ఈ దానం!

ABN , First Publish Date - 2020-04-28T16:41:25+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్లో రక్తం కొరత ఒకటి! కొత్తగా రక్తదానం చేసేవారెవరకూ లేక దేశంలోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిల్వలు అడుగంటిపోయాయి.

ఇప్పుడు అత్యవసరం ఈ దానం!

ఆంధ్రజ్యోతి(28-04-2020)

లాక్‌డౌన్‌ వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల్లో రక్తం కొరత ఒకటి! కొత్తగా రక్తదానం చేసేవారెవరకూ లేక దేశంలోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిల్వలు అడుగంటిపోయాయి. మరీ ముఖ్యంగా రక్తమార్పిడి కీలకం అయిన తలసీమియా వ్యాధిగ్రస్థులకు ఇప్పుడిది పెద్ద ఇబ్బంది. ఈ సమయంలో రక్తం లోటు భర్తీ ఎలా?  వైద్యులు ఏమంటున్నారు? రక్తనిధి సంస్థలు ఎలా వ్యవహరిస్తున్నాయి?


ఎర్ర రక్తకణాలు ప్రాణాధారాలు. వాటి ఉత్పత్తి, నాణ్యత లోపిస్తే, వాటిని తిరిగి భర్తీ చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. తలసీమియా, సికిల్‌ సెల్‌ అనీమియా అనే ఈ రెండు రకాల రక్తసంబంధ సమస్యలు జన్యుపరంగా సంక్రమిస్తూ ఉంటాయి. సాధారణంగా మూడు నెలల పసికందు మొదలుకుని, 40 ఏళ్ల వయస్కుల వ్యక్తుల వరకూ వేధించే ఈ సమస్యలకు ఎముక మజ్జ మార్పిడి ఒక్కటే శాశ్వత పరిష్కారం. అయితే ఈ సర్జరీ ఎంతో ఖర్చు, శ్రమలతో కూడుకున్నది. కాబట్టి అప్పటివరకూ ఈ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు క్రమం తప్పకుండా రక్తమార్పిడి చేయించుకుంటూ  ఉండవలసిందే! తలసీమియా ఉన్న వ్యక్తులు ప్రతి నెల రోజులకూ, సికిల్‌ సెల్‌ అనీమియా వ్యక్తులు ప్రతి రెండు లేదా మూడు నెలలకూ ఒకసారి రక్తమార్పిడి చేయించుకుంటూ ఉండాలి. తెలంగాణాలో సికిల్‌ సెల్‌ అనీమియా కంటే, తలసీమియా బాధితులు ఎక్కువ. వీరితో పాటు ఎ ప్లాస్కిక్‌ ఎనీమియా అనే రక్త సంబంధ సమస్యలు ఉన్నవారికీ రక్తమార్పిడి అవసరం.


రక్తదానం ప్రాణదానం!

తలసీమియా సికిల్‌ సెల్‌ సొసైటీ ప్రత్యేకంగా ఇలాంటి రక్త సమస్యలు ఉన్న వారి కోసం ఏర్పాటైంది. వీరికి ఈ సంస్థ ఉచితంగా రక్తాన్ని అందిస్తూ వస్తోంది. ఈ సంస్థలో పేరు నమోదు చేయించుకున్న వ్యక్తులకు, వారి అవసరాన్ని బట్టి సమయానికి రక్తాన్ని అందిస్తోంది ఈ సంస్థ. లాక్‌డౌన్‌ కారణంగా ప్రయాణ మాధ్యమాల కొరతతో దాతలు ఇక్కడికి చేరుకుని రక్తదానం చేయలేని పరిస్థితి. దీనికి కరోనా వైరస్‌ సోకుతుందనే భయం కూడా తోడవడంతో పూర్వంతో పోలిస్తే, రక్తం నిల్వలు తగ్గాయని తలసీమియా అండ్‌ సికిల్‌ సెల్‌ సొసైటీ పేర్కొంటోంది. అందుకే ఇప్పుడు హీరోలు చిరంజీవి, నాని మొదలు రాజకీయ నాయకీయనేతలు కె.టి.ఆర్‌ లాంటివారి దాకా అందరకూ రక్తదానం ఆవశ్యకతను పదే పదే నొక్కి చెబుతున్నారు. స్వయంగా రక్తదానం చేస్తున్నారు. 


నిర్భయంగా చేయవచ్చు!

తలసీమియా వ్యాధిగ్రస్తులు వారి శరీర బరువును బట్టి, కిలోకు 15 మిల్లీ లీటర్ల రక్తం చొప్పున లెక్కగట్టి రక్తమార్పిడి చేయించుకోవలసి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి 28 రోజుల నుంచి నెల రోజులకు, సుమారుగా ఒక వ్యక్తికి ఒక యూనిట్‌ రక్తం అవసరం పడుతూ ఉంటుంది. మూడు నెలల పసి వయసులో చీకాకు, పొట్ట ఉబ్బడం, పాలిపోవడం లాంటి లక్షణాలతో ఈ వ్యాధి బయటపడుతుంది. మూడు నెలల వయసులో ఫీటల్‌ హీమోగ్లోబిన్‌ నుంచి ఎడల్ట్‌ హీమోగ్లోబిన్‌గా మారే క్రమంలో తల్లితండ్రుల నుంచి సంక్రమించిన ఈ అంతర్లీన జన్యు సమస్య హఠాత్తుగా బయటపడుతుంది.


రక్త కణాలు విరిగిపోతూ ఉండే ఈ వ్యాధిని గుర్తించి నిర్ధరించిన తర్వాత, వైద్యులు రక్తమార్పిడికి సంబంధించిన సూచనలు ఇస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి రక్తనిధిని సంప్రతించి రక్తాన్ని అందిస్తారు. ఇలాంటి వారి కోసం ఉచితంగా రక్తాన్ని అందించే సంస్థల వివరాలు కూడా రోగులకు అందిస్తారు. ఇందుకోసం రెడ్‌ క్రాస్‌, థలసీమియా అండ్‌ సికిల్‌ సెల్‌ అనీమియా మొదలైన సంస్థలు అక్కరకొస్తూ ఉన్నాయి. కరోనా ప్రభావంతో రక్తదానం దిగజారితే, తలసీమియా రోగుల కష్టా లు మరింత క్లిష్టమవుతాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే దాతలు భయం వీడి, రక్తదానానికి ముందుకు రావాలి. ఈ విషయంలో ఇప్పటికే రక్తదానం చేస్తున్న ప్రముఖులను ఆదర్శంగా తీసుకోవాలి!


అప్పుడు 80! ఇప్పుడు నలుగురే!

పలు స్వచ్ఛంద రక్తనిధి సంస్థలు సాధ్యమైనంత మేరకు రక్తం కొరత తలెత్తకుండా తమ వంతు సేవలను అందిస్తున్నాయి. ఆరు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ‘హోప్‌ ఫర్‌ లైఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ లాక్‌డౌన్‌ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇలా ఉన్నాయి!


‘‘ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఆధారంగా రక్తం అవసరం ఉన్న ఆస్పత్రికి దాతలను మా సంస్థ ద్వారా పంపిస్తుంటాం. లాక్‌డౌన్‌కు ముందు మొత్తం ఆరు రాష్ట్రాలకు కలిపి ఒక్క రోజులో సుమారు 60 నుంచి 80 యూనిట్ల రక్తాన్ని అందించేవాళ్లం. ఇప్పుడు రోజుకు నలుగురు దాతలను కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. అయితే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్థులకు ఎల్లప్పటికీ ఒకే దాత నుంచి రక్తం సేకరించి అందించడం వల్ల వారి ఆయుష్షు పెరిగే వీలుంటుందని అంటారు. ఒక తలసీమియా రోగికి, నలుగురు వ్యక్తుల నుంచి రక్తం అందించడం వల్ల, ఆ రక్తాల్లోని కొన్ని ఏజెంట్లు మ్యాచ్‌ అవకపోవచ్చు. కాబట్టి, ఒక తలసీమియా రోగికి, ఒక దాత నుంచే రక్తం సేకరించే పద్ధతి అనుసరిస్తూ ఉంటాం. ఇలాంటి సేవలకు ఆటంకం తలెత్తుతోంది. రక్తదానానికి ముందుకు వచ్చే వారికి కరోనా సోకే వీలు లేకుండా, వైద్యపరమైన అన్ని జాగ్రత్తలూ పాటిస్తున్నాం. భయం లేకుండా రక్తదానానికి సహకరించాలి.’’


- హిమజ

హోప్‌ ఫర్‌ లైఫ్‌ వ్యవస్థాపకురాలు, హైదరాబాద్


కరోనా రాదు!

‘‘పూర్వంతో పోలిస్తే, ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో దాతలు రక్తం ఇవ్వడానికి ముందుకు రాలేని పరిస్థితి. రక్తదానం ద్వారా కరోనా సోకుతుందేమో అనే భయం కూడా కొందరు దాతల్లో ఉంటోంది. కానీ ఇది నిజం కాదు. ఇప్పటివరకూ రక్తమార్పిడి ద్వారా కరోనా సోకిన దాఖలాలు లేవు. పైగా రక్తదానానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏవీ కరోనా కారణంగా మారలేదు. రక్త దాతలకు లాక్‌డౌన్‌లో ప్రయాణ మినహాయింపులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి దాతలు నిర్భయంగా రక్తదానానికి ముందుకు రావచ్చు.’’


- డాక్టర్‌ ఎ.ఎమ్‌.వి.ఆర్‌ నరేంద్ర

కన్సల్టెంట్‌ హెమటాలజిస్ట్‌


దాతలను వేడుకుంటున్నాం!

‘‘మా సంస్థ ప్రతి నెలా సుమారు 3 వేల మంది తలసీమియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా బాధితులకు సరిపడా 2 వేల యూనిట్ల రక్తాన్ని అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, బీదర్‌, గుల్బర్గా నుంచి ఎంతో మంది రోగులు మా దగ్గరకు వస్తూ ఉంటారు. డయాలసిస్‌, ప్రసవం, హీమోఫీలియా (రక్తస్రావం ఆగకపోవడం)... ఈ సందర్భాల్లో కూడా రక్తం అవసరం అవుతూ ఉంటుంది. మమ్మల్ని సంప్రతించే ఆస్పత్రులకు కూడా మేం రక్తాన్ని అందిస్తూ ఉంటాం. కార్పొరేట్‌ ఆఫీసులు, బ్యాంకింగ్‌ సెక్టార్లు క్రమం తప్పక బ్లడ్‌ క్యాంప్స్‌ ఏర్పాటుచేస్తూ మాకు రక్తాన్ని అందిస్తూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తూ ఉంటారు. ఇలా సేకరించిన రక్తాన్ని శుద్ధి చేసి, అవసరమైన వ్యక్తుల కోసం సిద్ధంగా ఉంచుతాం.


వీరి వివరాలు మా దగ్గర ఉంటాయి. కాబట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవలసిందిగా వారికి గుర్తు చేస్తూ ఉంటాం. అయితే లాక్‌డౌన్‌ కారణంగా దాతలు మా సంస్థకు చేరుకోలేని పరిస్థితి. ప్రయాణ సాధనాలు లేకపోవడం, కరోనా సోకుతుందనే భయం కారణంగా దాతలు కొంత వెనకడుగు వేస్తున్నారు. అయితే  ప్రస్తుతం మేమే మా సొంత వాహనంలో వారిని చేరుకుంటున్నాం. మా దగ్గర నమోదు అయిన దాతలకు పోలీసు డిపార్ట్‌మెంట్‌ అందించిన అనుమతి పత్రాలను వాట్సాప్‌ చేస్తున్నాం. వాటిని చూపిస్తే, పోలీసులు వారిని మార్గమధ్యంలో అడ్డుకోరు. తలసీమియా రోగులకు సమయానికి కాకుండా రెండు మూడు రోజుల వ్యవధితో రక్తం అందించినా అంతగా ప్రమాదం ఉండదు. ఇక సికిల్‌ సెల్‌ వారికి రక్తమార్పిడి వ్యవధి రెండు నుంచి మూడు నెలలు ఉంటుంది కాబట్టి ఆలోగా రక్తాన్ని సేకరించి ఉంచుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ దాతలు భయాలను పక్కనపెట్టి, రక్తదానంతో తలసీమియా వ్యాధిగ్రస్తులకు ప్రాణదానం చేయవలసిందిగా వేడుకుంటున్నాం!’’


- అలీం బేగ్‌, ఉపాధ్యక్షులు

తలసీమియా అండ్‌ సికిల్‌ సెల్‌ సొసైటీ, హైదరాబాద్

Updated Date - 2020-04-28T16:41:25+05:30 IST