మిల్లర్ల మోసం దారిమళ్లిన ధాన్యం

ABN , First Publish Date - 2021-06-17T05:40:55+05:30 IST

బ్లాక్‌ లిస్టులో ఉన్న పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లుల యజమానుల మోసంతో ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ధాన్యం దారిమళ్లింది. ఈ వ్యవహారం కాస్తా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లటంతో ధాన్యం రైతులు నష్టపోకుండా వెంటనే ఆయన స్పందించారు. అవసరమైన చర్యలు తీసుకొని రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు మంత్రి సూచించారు.

మిల్లర్ల మోసం దారిమళ్లిన ధాన్యం
లారీకి ధాన్యం ఎగుమతి చేస్తున్న దృశ్యం

 ధాన్యం కోసం పెద్దపల్లి ‘బ్లాక్‌లిస్ట్‌’ మిల్లర్ల అడ్డదారి

 రా రైస్‌మిల్లుల యజమానులతో మిలాఖత్‌ 

 జిల్లా నుంచి భారీగా ధాన్యం తరలింపు

 మంత్రి అజయ్‌కుమార్‌ దృష్టికి వెళ్లిన వ్యవహారం

వైరా, జూన్‌ 16: బ్లాక్‌ లిస్టులో ఉన్న పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లుల యజమానుల మోసంతో ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ధాన్యం దారిమళ్లింది. ఈ వ్యవహారం కాస్తా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లటంతో ధాన్యం రైతులు నష్టపోకుండా వెంటనే ఆయన స్పందించారు. అవసరమైన చర్యలు తీసుకొని రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్‌కు మంత్రి సూచించారు. ప్రస్తుతం ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల అధికారుల మధ్య ఈ ధాన్యం వ్యవహారంపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ఖమ్మంజిల్లాలో యాసంగిలో వరిసాగుచేసిన ధాన్యం మిల్లులకు కేటాయించే విషయంలో ఈ తతంగం నడిచింది. పెద్దపల్లి జిల్లాలో బ్లాక్‌ లిస్టులో ఉన్న కొంతమంది పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్లుల యజమానులు తమకు సన్నిహితంగా ఉండే అక్కడి రా రైస్‌మిల్లుల యజమానులతో మిలాఖత్‌ అయి ఖమ్మం జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహాకులను తప్పుదారిపట్టించారు. రోజురోజుకు వాతావరణంలో జరుగుతున్న మార్పులతో రైతుల్లో నెలకొన్న ఆందోళనను, తమ అవసరాలను ఆసరా చేసుకొని బ్లాక్‌ లిస్టులో ఉన్న మిల్లర్లు ఈ మోసానికి ఒడిగట్టారు. ఇక్కడి ధాన్యం మిల్లులకు తరలివెళ్లి దిగుమతి కావడమే పరమానందంగా భావించిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వెంటనే ఇక్కడి ధాన్యాన్ని పెద్దపల్లికి తరలించారు. వైరా, కొణిజర్ల, చింతకాని మండలాల్లోని రైతులకు చెందిన దాదాపు 36,300 క్వింటాళ్ల ధాన్యాన్ని బ్లాక్‌లిస్టు లో ఉన్న పార్‌బాయిల్డ్‌ మిల్లులకు తరలించారు. ఈ ధాన్యం విలువ రూ.6.85కోట్లుగా ఉందని అంచనా. వైరా, కొణిజర్ల మండలాల్లోని వైరా సొసైటీ నుంచి 15,508క్వింటాళ్లు, పూసలపాడు సొసైటీ నుంచి 4,063క్వింటాళ్లు, గరికపాడు సొసైటీ నుంచి 3,695క్వింటాళ్లు, పెద్దగోపతి సొసైటీ నుంచి 5వేల క్వింటాళ్ల ధాన్యాన్ని బ్లాక్‌ లిస్టులో ఉన్న పెద్దపల్లిలోని భవానీ రైస్‌ ఇండస్ట్రీస్‌ దిగుమతి చేశారు. కొనుగోళ్లు అన్నీ పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో  సహకార సంఘాలు చేశాయి. వాస్తవంగా పెద్దపల్లిలోని అన్నపూర్ణ రైస్‌ ఇండస్ట్రీస్‌కు ఈ నాలుగు సొసైటీల ధాన్యాన్ని తరలించి దిగుమతి చేయాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా బ్లాక్‌ లిస్టులో ఉన్న భవానీ రైస్‌ ఇండస్ట్రీస్‌ పార్‌బాయిల్డ్‌ మిల్లుకు తరలించి దిగుమతి చేశారు. అన్నపూర్ణ రైస్‌మిల్లుకు ఇక్కడి నుంచి కేవలం 2,617క్వింటాళ్ల ధాన్యాన్ని మాత్రమే దిగుమతి చేశారు. అన్నపూర్ణ రైస్‌మిల్లును అడ్డుపెట్టుకొని బ్లాక్‌ లిస్టులో ఉన్న భవానీ పార్‌బాయిల్డ్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ యజమాని తన ఫోన్‌నెంబర్‌ను కొనుగోలు కేంద్రాలకు ఇచ్చి ఈ మోసానికి పాల్పడ్డాడనే విమర్శలున్నాయి. అలాగే చింతకాని మండలంలోని రామకృష్ణాపురం, లచ్చగూడెం తదితర గ్రామాల్లో డీసీఎంఎస్‌ కొనుగోలు చేసిన 7వేల క్వింటాళ్ల ధాన్యాన్ని పెద్దపల్లిలోని రాఘవేంద్ర రా రైస్‌మిల్లుకు తరలించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా బ్లాక్‌ లిస్టులో ఉన్న సాయి హనుమాన్‌ పార్‌బాయిల్డ్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ మిల్లుకు తరలించారు. తమకు జరిగిన మోసాన్ని గ్రహించిన వైరా సహకార సంఘాల అధ్యక్షుడు, సీఈవోలు ఖమ్మంజిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ను, డీఎస్‌వో రవీందర్‌ను ఆశ్రయించారు. ఒక సందర్భంలో ఈ వ్యవహారంపై డీఎస్‌వోకు పూసలపాడు సొసైటీ అధ్యక్షుడు గాలి శ్రీనివాసరావుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అడిషనల్‌ కలెక్టర్‌, డీఎస్‌వో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌కు నివేదించారు. అలాగే వైరా మండలంలోని పూసలపాడు సొసైటీ అధ్యక్షుడు గాలి శ్రీనివాసరావు,  మూడు సంఘాల సీఈవోలు, సిబ్బంది పెద్దపల్లి వెళ్లి ఆ జిల్లా అదనపు కలెక్టర్‌ను, డీఎస్‌వోను కలిసి తాము మోసపోయిన విధానాన్ని వివరించారు. తమ రైతులు నష్టపోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు రోజులపాటు పెద్దపల్లిలోనే వీరంతా పడిగాపులు కాశారు. బుధవారం పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహసీల్దార్‌ రామచంద్రరావు పెద్దపల్లి వెళ్లి ఖమ్మంజిల్లాలోని కొనుగోలు కేంద్రాల నిర్వాహాకులను బ్లాక్‌లిస్టులోని మిల్లుల యజమానులు ఎలా మాయమాటలతో ఇబ్బంది పెట్టిన విషయాన్ని అక్కడి అధికార యంత్రాంగానికి వివరించారు. ప్రస్తుతం ఈ రెండుజిల్లాల అధికారులకు మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే పౌరసరఫరాలశాఖ కమిషనర్‌తో మాట్లాడి రైతులు నష్టపోకుండా డబ్బు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని, రైతులు నష్టపోకుండా చూడాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కోరుతున్నారు.


Updated Date - 2021-06-17T05:40:55+05:30 IST