ఆశీస్సులే గొప్ప సంపద

ABN , First Publish Date - 2020-10-02T07:00:32+05:30 IST

జీవితపు చుక్కాని సుడిగుండంలో చిక్కుకుంటుంది. అప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కావాలన్న ఆలోచన వస్తుంది...

ఆశీస్సులే గొప్ప సంపద

ప్రతి మనిషి జీవితంలో ఎన్నో భయంకర పరిస్థితులు, ఆపదలు ఎదురవుతాయి. వాటిని దాటడానికి చేసే అన్ని ప్రయత్నాలూ కొన్నిసార్లు విఫలమౌతాయి. జీవితపు చుక్కాని సుడిగుండంలో చిక్కుకుంటుంది. అప్పుడు భగవంతుని ఆశీర్వాదాలు కావాలన్న ఆలోచన వస్తుంది. భగవంతుణ్ణి ఆశీస్సులు ఎందుకు కోరుకుంటాం? వాటిలో అంత శక్తి ఉందా? అవి విధిని సైతం మార్చగలవా? అసలు ఆశీస్సులు ఎందుకు కావాలి? 


పిల్లలు ఏ చిన్న పని చేసినా తల్లితండ్రులు సంతోషంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. పిల్లలు మాట వినకపోతే తల్లితండ్రులకు సంతోషం కలుగుతుందా? భగవంతుణ్ణి రోజూ పూజించి, కీర్తించినంత మాత్రాన సరిపోదు. ఆయన నిర్దేశించిన మార్గంలో నడవాలి. అలాకాకుండా మనకు నచ్చిన విధంగా నడుచుకున్నప్పుడు భగవంతుడికి మన చర్యల పట్ల సంతోషం ఎలా కలుగుతుంది? 


ఆపదలో ఉన్న వ్యక్తికి సాయం చేసినప్పుడు వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. అది అందరికీ అనుభవమే. ఈ ఆశీస్సులు మన ఖాతాలో నిధిలా జమ అవుతాయి. ఇది అసత్యం కాదు. ఆర్థిక కష్టం వచ్చినప్పుడు అక్కరకు వస్తుందని డబ్బును బ్యాంకులో దాచుకున్నట్టే మన ‘కర్మ’ అనే ఖాతాలో ఆశీర్వాదాలు జమ పడుతూ ఉండాలి. జీవితంలో అంతుచిక్కని పరిస్థితులూ, సమస్యలూ మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆ ఆశీస్సులే ఆత్మశక్తిని ప్రసాదిస్తాయి. అప్పుడు పర్వతమంత ఆపదలు సైతం అణువంత కనిపిస్తాయి. కాబట్టి మనం చేసే పనులు ఇతరులకు సుఖ సంతోషాలు కలిగించాలనేది మన లక్ష్యం కావాలి. మన మాటలతో ఇతరుల్లో ఉత్సాహాన్నీ, ఉల్లాసాన్నీ నింపాలి. యథాశక్తిగా వారికి సాయపడాలనే మంచి హృదయం ఉండాలి. 


చెడు ఆలోచనతో, కర్మతో, స్వార్థపూరితమైన లౌకిక వ్యవహారాలతో ఇతరులను బాధ పెడితే వారి ఆవేదనే మనకు తెలియని శాపం అవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు నిబ్బరంగా ఆలోచించే మనశ్శాంతి ఉండదు. అప్పుడు చిన్న కష్టాలే కొండంతగా కనిపిస్తాయి. మనం సంపాదించుకున్న ‘ఆశీస్సులు’ అనే సంపద జీవితంలో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. ఇతరులకు సాయపడి, వారి నుంచి ఆశీస్సులు పొందడం అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన కళ. అదే ఉత్తమంగా జీవించే కళ. అదే పరమాత్మ దగ్గరకు మనల్ని నేరుగా చేరుస్తుంది. 

- బ్రహ్మకుమారీస్‌

Updated Date - 2020-10-02T07:00:32+05:30 IST