వరం–శాపం

ABN , First Publish Date - 2022-07-13T06:18:26+05:30 IST

వచ్చే ఏడాదికల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రస్తుతం 141.2 కోట్ల జనాభా ఉన్న భారత్, 142.6కోట్ల జనాభాతో మొదటిస్థానంలో ఉన్న చైనాను దాటి...

వరం–శాపం

వచ్చే ఏడాదికల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ప్రస్తుతం 141.2 కోట్ల జనాభా ఉన్న భారత్,  142.6కోట్ల జనాభాతో మొదటిస్థానంలో ఉన్న చైనాను దాటి ఈ రికార్డు దక్కించుకోబోతున్నది. 2050 కల్లా భారత్ జనాభా దాదాపు 166కోట్లకు చేరుతుందనీ, అప్పటికి చైనా జనాభా ఇంకా తగ్గి దాదాపు 131 కోట్లకు పరిమితం అవుతుందని ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సోమవారం ఐరాస విడుదల చేసిన నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది నవంబరులో ప్రపంచ జనాభా 800కోట్ల మైలురాయిని చేరుతోందని కూడా ఐరాస శుభవార్త వినిపించింది. ఆరోగ్యరంగంలో ప్రపంచం సాధించిన అద్భుతప్రగతి ఇది అని ప్రశంసిస్తూనే ఈ జనాభా విస్ఫోటం నుంచి భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనని గుర్తుచేసింది. రాబోయే ముప్పైయేళ్ళలో పెరిగే ప్రపంచజనాభా కూడా కొన్ని ఆఫ్రికా దేశాల్లోనూ, ప్రధానంగా భారత్, పాకిస్థాన్ లలోనూ ఉండటం గమనించాల్సిన విషయం.


ప్రపంచంలోనే అతి తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్నదేశాల్లో చైనా ఒకటి కనుక, భారత్‌లో జనాభా పెరుగుతూనే ఉన్నది కనుక దానిని దాటిపోవడంలో విశేషమేమీ లేదు. జననాల సగటు ఇప్పటికే తక్కువగా ఉన్న చైనా, వచ్చే ఏడాది నుంచి తమ జనాభా క్షీణత ఆరంభమవుతుందని లెక్కలు వేసుకొనే, దీర్ఘకాలంగా అమలవుతున్న ఒకే బిడ్డ విధానాన్ని ఆరేళ్ళక్రితమే రద్దుచేసింది. 1979లో ఒక్కరినే కనాలన్న విధానాన్ని తెచ్చి, జరిమానాలు, బలవంతపు గర్భస్రావాల వంటి తీవ్ర శిక్షలతో నాలుగు దశాబ్దాల పాటు కట్టుదిట్టంగా అమలు చేసింది. ఆ తరువాత దేశం అన్ని రంగాల్లోనూ ఎదిగిరావడంతో పాటే, జనాభా తరుగుదల ప్రమాదమూ మొదలైంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలను కనే జంటలకు ప్రోత్సాహకాలు ప్రకటించినా పెద్దగా ప్రయోజనం లేకపోతున్నది. ఒకదేశం అభివృద్ధి చెందుతూంటే సంతానోత్పత్తిరేటు తగ్గడం సహజం. అభివృద్ధి, అక్షరాస్యత, కెరీర్, పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ వంటివి ఒకదానితో ఒకటి ముడిపడిన అంశాలు. ప్రస్తుతానికి 88కోట్ల శ్రామికశక్తి ఉన్నప్పటికీ భవిష్యత్తులో చైనాకు ఆ లోటు తప్పదు. తన ఉత్పత్తులతో యావత్ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న చైనా అంతే దూకుడుగా, అదే స్థానంలో కొనసాగలేకపోవచ్చు.


మన నాయకుల నోట ఎంతో గర్వంగా ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ అనే మాట వినిపిస్తూంటుంది. పనిచేసే వయసులో ఉన్న జనాభా లేదా ఉత్పాదక వయస్సు సమూహాన్ని ఇలా పేర్కొంటారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత భారతదేశం నవయవ్వనదేశమనీ, మిగతా ప్రపంచానికి నైపుణ్యం గల మానవవనరుల అవసరం ఎంతో ఉన్నదనీ, అందువల్ల సదరు ‘డివిడెండ్’ను మనం గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవాలని చెబుతూనే ఉన్నారు. భారతదేశానికి ఈ లబ్ధి 2005నుంచి 2055 వరకూ ఉన్నప్పటికీ, హెచ్చుస్థాయిలో 2021 నుంచి 2041 వరకూ ఉంటూ 2031లో ఉచ్ఛస్థితికి చేరబోతున్నదట. పనిచేయగలిగే వయసులోని వారు అతిఎక్కువగా, వారిపై ఆధారపడే వయసులోని వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న దశ ఉత్పాదకతకు అత్యధికంగా ఉపకరిస్తుంది. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలను సమకూర్చి ఆ శ్రామికశక్తిని బలంగా, సమర్థవంతంగా తయారుచేసుకోవడం ముందుగా జరగాలి. అది గరిష్ఠంగా దక్కినంత మాత్రాన సరిపోదు కనుక, సామర్థ్యాన్ని ఒడిసిపట్టగలిగే విధానాలు రూపొందించుకోవాలి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో మూడోవంతుమంది పిల్లలు సరైన ఎదుగుదల లేకుండా అనారోగ్యవంతులుగా ఉన్నారు. దాదాపు సగం మంది యువతులు రక్తహీనతతో బాధపడుతున్నారు. విద్యాప్రమాణాలు ఎంతో దిగజారి ఉన్నాయని అసర్ వంటి నివేదికలు చెబుతున్నాయి. నైపుణ్యం మూడుశాతం శ్రామికజనాలకు మాత్రమే ఉన్నదని పరిశ్రమల సమాఖ్య అంటోంది. ప్రతీ బడ్జెట్‌లోనూ ఆరోగ్యం, విద్య ఇత్యాది రంగాలకు కేటాయింపులు తగ్గుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి తప్ప, లక్షలాదిమంది యువకులు స్వాగతిస్తున్నారని చెప్పుకుంటున్న పాలకులు గుర్తించాల్సిందల్లా దేశంలో ఉపాధి కల్పన తగ్గుతూ, నిరుద్యోగికత తీవ్రస్థాయికి చేరిందని. తగిన ప్రణాళికలతో మన మానవశక్తిని సద్వినియోగం చేసుకోవడంపై ఇప్పటికైనా దృష్టిపెట్టకపోతే అది నిరుపయోగం కావడమే కాదు, సమాజంలో హింసకూ తిరుగుబాట్లకూ కూడా కారణమవుతుంది.

Updated Date - 2022-07-13T06:18:26+05:30 IST