కమల రేకుల్లో భాగ్యనగరం!

ABN , First Publish Date - 2022-07-02T10:15:33+05:30 IST

బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్పన సభ కోసం, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌడ్‌, జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌) వద్ద ఏర్పాట్లు దాదాపుగా ముగిశాయి.

కమల రేకుల్లో భాగ్యనగరం!

  • పరేడ్‌గ్రౌండ్‌లో విజయ సంకల్ప సభకు ఏర్పాట్లు.. 
  • 3వేదికలు.. మధ్యలో ప్రధాని, ఇతర ప్రముఖులు


హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన విజయ సంకల్పన సభ కోసం, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌడ్‌, జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌) వద్ద ఏర్పాట్లు దాదాపుగా ముగిశాయి. విజయ సంకల్ప సభా వేదిక పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ సంఖ్యలో జనం సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనే అంచనాతో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈ మైదానంలో 19లక్షల చదరపు అడుగుల మేర సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 4లక్షల చదరపు అడుగుల స్థలంలో పార్టీ శ్రేణులు, ప్రజలు కూర్చునేందుకు షెడ్లు/టెంట్లు నిర్మిస్తున్నారు. ఇందులో వీఐపీల కోసం 7 షెడ్లు నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానుండటంతో వేర్వేరుగా మూడు వేదికలను నిర్మిస్తున్నారు. ప్రధాని మోదీ ఆసీనులయ్యే వేదిక మధ్యలో ఉంటుంది.


 దీనిపై అమిత్‌ షా, గడ్కరీ, కిషన్‌ రెడ్డి, జేపీ నడ్డా, రాష్ట్ర నేతలు బండి సంజయ్‌, లక్ష్మణ్‌ కూర్చుంటారు. ఈ వేదికకు అటూ ఇటూ నిర్మిస్తున్న వాటిలో ఓ వేదికపై బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు ఆసీనులవుతారు. మరో వేదికపై కేంద్రమంత్రులు, మాజీ మంత్రులు కూర్చుంటారు. వర్షం పడ్డా సభకు హాజరయ్యే జనం తడవకుండా ఉండేందుకు జర్మన్‌ హ్యాంగర్‌ టెంట్లు వేస్తున్నారు. శనివారం మధ్యాహ్నానికి టెంట్ల ఏర్పాటు పూర్తి కానుంది. ప్రజలందరూ సభను సౌకర్యవంతంగా వీక్షించేందుకు అన్నివైపులా 30 ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. నేతల ప్రసంగాలు స్పష్టంగా వినిపించేలా 500వాట్స్‌ ఫ్లూయింగ్‌ సౌండ్‌ సిస్టమ్‌తో కూడిన బాక్సులు ఏర్పాటు చేశారు. భద్రతను డేగ కళ్లతో పర్యవేక్షించేందుకు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 30చోట్ల పార్కింగ్‌ స్థలాలను ఎంపిక చేశారు. గ్రౌండ్‌ లోపలా, బయటా 14 అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేకంగా 35 మంది అగ్నిమాపక సిబ్బంది సభలో జనం మధ్య ఉంటారు. ప్రధానమంత్రి కూర్చునే వేదికను ఎస్పీజీ అధికారులు పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకున్నారు. నిర్మాణ సమయంలోనూ అవసరమైన వారు మినహా మరెవ్వరిని వేదికవైపునకు అనుమతించడం లేదు. శుక్రవారం సాయంత్రం 5గంటల తర్వాత గ్రౌండ్‌ లోపలకి ఎవ్వరినీ అనుమతించలేదు. లోపల డాగ్‌ స్క్వాడ్స్‌, బాంబు స్క్వాడ్స్‌తో నిరంతర తనిఖీలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రితోపాటు జడ్‌ ప్లస్‌, జడ్‌ కేటగిచి భద్రత కలిగిన ప్రముఖులు సభకు హాజరు అవుతుండటంతో పరేడ్‌గ్రౌండ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల మందికిపైగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు.


15 బహుళ అంతస్తుల భవనాల నుంచి.. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోదీ, అమిత్‌ షా సహా బీజేపీకి చెందిన అత్యున్నత స్థాయి నేతలు వందల మంది హాజరవనున్న నేపథ్యంలో హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ ప్రాంగణాలను ఎస్పీజీ తమ అధీనంలోకి తీసుకుంది. బందోబస్తులో భాగంగా సైబరాబాద్‌లో వందలాది మంది పోలీసులు మోహరించారు. హెచ్‌ఐసీసీ నుంచి చుట్టు పక్కల 3 కిలోమీటర్ల మేర 15 బహుళ అంతస్తు భవనాలను గుర్తించారు. ఆ భవనాలపై నుంచి పోలీసులు తుపాకులతో పహారా కాస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి 5వేల మందికి పైగా పోలీసులతో అడుగడుగునా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.  ప్రధాని శనివారం డిల్లీ నుంచి బయల్దేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి హెచ్‌ఐసీసీకి ప్రత్యేక హెలీకాప్టర్‌లో వస్తారు. అందుకోసం హెచ్‌ఐసీసీలో 3 హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. దాంతో భద్రతా సిబ్బంది ప్రత్యేక హెలీకాప్టర్‌లతో 5 సార్లు ట్రయల్స్‌ నిర్వహించి భద్రతను సమీక్షించారు. హెచ్‌ఐసీసీ నుంచి 5 కిలోమీటర్ల నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కాగా మాదాపూర్‌ హైటెక్స్‌ నుంచి హెచ్‌ఐసీసీ మార్గమంతా కాషాయమయమైంది. ప్రదాని మోదీ సహా ప్రముఖుల ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-07-02T10:15:33+05:30 IST