Abn logo
Sep 24 2021 @ 00:27AM

పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

ఇల్లందకుంటలో స్వశక్తి సంఘాల మహిళలకు చెక్కులను పంపిణీ చేస్తున్న మంత్రి హరీష్‌రావు

- రైతులకు రుణ విముక్తులను చేస్తాం

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

ఇల్లందకుంట, సెప్టెంబరు 23: పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇచ్చిన ప్రతి మాట నిలుపుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి ఆలయ కల్యాణ మండపంలో స్వయం సహాయ మహిళ సంఘాలకు 7.5 కోట్ల రుణాల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ మండలంలోని 18 గ్రామాలకు చెందిన మహిళా భవనాలకు 2.36 కోట్లు, మండల కేంద్రంలోని సంఘం భవనానికి 50 లక్షలు, ఇల్లందకుంట దేవాలయ అభివృద్ధికి 10 కోట్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని గ్రామాల్లో మహిళా స్వశక్తి భవనాలు నాలుగు నెలల్లోగా పూర్తి చేసేలా కృషి చేస్తానన్నారు. వచ్చే  బడ్జెట్‌లో నిధులు కేటాయించి 50 వేల నుంచి లక్ష  రూపాయల రుణాలు మాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నియోజకవర్గంలో నాలుగు వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పూర్తి చేయించలేదని, వాటిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. సొంత స్థలం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించే ఇస్తానని పేర్కొన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణో అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడంలో భాగంగా ఇల్లందకుంటలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తానన్నారు. రెండు నెలలుగా మండలంలో 15 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. కుడి చేయితో కేసీఆర్‌ ఇస్తుంటే కేంద్రం ఎడమ చేయితో లాక్కుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఊసురు పోసుకుంటుందని, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని న్యాయం, ధర్మం వైపు నిలబడి, కష్టపడే వాళ్లను ఆశీర్వదించాలని కోరారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి కొత్త ఎమ్మెల్యే వచ్చే వరకు మండలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, డీఆర్డీవో పీడీ శ్రీలత, కేడీసీసీ వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ కొంరెల్లి, సర్పంచ్‌ శ్రీలత, ఎంపీటీసీ దంసాని విజయ-కుమార్‌, నాయకులు వెంకటేష్‌, సంజీవరెడ్డి, రాజిరెడ్డి, అయిలయ్య, రఫీఖాన్‌, అశోక్‌ పాల్గొన్నారు.