Abn logo
Sep 25 2021 @ 23:37PM

పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

 - ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే సిలిండర్‌ ధర పెంచుతారు

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

హుజూరాబాద్‌, సెప్టెంబరు 25: హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలో పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం హుజూరాబాద్‌లో విద్యుత్‌ కనెక్షన్లు, ఇంటి అనుమతుల పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ బీజేపీ వాళ్లు ఓటుకు 2వేలు ఇస్తారు.. తెల్లవారితే సిలిండర్‌ ధర పెంచి మనవద్ద నుంచే వసూల్‌ చేస్తారన్నారు. బీజేపీకి ఓటేస్తే పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని మంచి నూనె ధర 300 రూపాయలకు పెంచుతారన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మ్యూటేషన్‌ కాగితాలు, నల్ల, విద్యుత్‌ కనెక్షన్లు, విద్యుత్‌ మీటర్ల మార్పు పత్రాలు అందజేసేది తెలంగాణ ప్రభుత్వమన్నారు. తన బాధను ప్రజల మీద రుద్ది ఓ పెద్ద మనిషి లబ్ధి పొందాలని అనుకుంటున్నాడన్నారు. హుజూరాబాద్‌లో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే తెలంగాణ ప్రభుత్వాన్ని బలపర్చలన్నారు. మాయ మాటలు చెప్పే వారి వైపు ఉంటారా.. న్యాయం, ధర్మం వైపు ఉంటారా అని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- పేదల సంక్షేమాన్ని విస్మరించిన గత ప్రభుత్వాలు

- మంత్రి గంగుల కమలాకర్‌

గత ప్రభుత్వాలు ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. తెలంగాణ రాకముందుకు కరెంటు ఉండేదా..? తాగు నీరు ఇచ్చారా..? ఆలోచించుకోవాలన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రలున్నాయని,  ఎక్కడైనా పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి ఇచ్చారా అని ప్రశ్నించారు.

- నిరుపేదలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 

జమ్మికుంట రూరల్‌: నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం  పట్టణంలో 887, 467 సర్వే నంబర్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న 361 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్‌ చేతుల మీదుగా పొజిషన్‌, హౌస్‌ యాజమాన్యం, వాటర్‌ కనెక్షన్‌, కరెంట్‌ కనెక్షన్‌, టైటిల్‌ సర్టిఫికెట్లను ఆందజేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో ఏళ్లుగా సమస్య పరిష్కారం కోసం తిరుగుతున్నారని, తన దృష్టికి వచ్చిన వెంటనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఎప్పుడో పరిష్కారం కావాల్సిన సమస్యను ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టడం వల్లే ఇబ్బందులు పడ్డారని, ఇకపై ఏలాంటి సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తక్కలపల్లి రాజేశ్వర్‌రావు, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహాశీల్దార్‌ సోలిపురం రాజిరెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.