కల్తీదే కావాలంట

ABN , First Publish Date - 2020-06-04T08:58:07+05:30 IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పిడుగురాళ్ల కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా అయిన కల్తీ బ్లీచింగ్‌ ..

కల్తీదే కావాలంట

బ్లీచింగ్‌పై తీరుమారని అధికారులు

గుర్తింపులేని పరిశ్రమల నుంచి కొనుగోలు

త్రిసభ్య విచారణ చేపట్టినా స్పందన శూన్యం


పిడుగురాళ్ల, గుంటూరు(ఆంధ్రజ్యోతి), జూన్‌  3: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పిడుగురాళ్ల కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా అయిన కల్తీ బ్లీచింగ్‌ కలకలం సృష్టించింది. కనీస ప్రమాణాలు కూడా లేకుండా బ్లీచింగ్‌ సరఫరా చేశారంటూ వివిధ జిల్లాలోని పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు గగ్గోలు పెట్టారు. నాణ్యతలేని ముగ్గు, సున్నం, మరికొన్ని పరికరాలను బ్లీచింగ్‌ పేరుతో పిడుగురాళ్ల నుంచి సరఫరా చేసినట్లు తేలింది. రూ.కోట్లలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో కలెక్టర్‌ బిల్లులు ఆపివేయించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్‌ నియమించిన త్రిసభ్య కమిటీ ఇటీవలే పిడుగురాళ్ల, మాచవరంతోపాటు డీపీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించి నాణ్యతలేని బ్లీచింగ్‌ కొనుగోలు చేశారని నిర్ధారించినట్లు తేలింది.  ఇందుకు సంబంధించిన నివేదికను కూడా కలెక్టర్‌కు సమర్పించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కూడా కొందరు అధికారులు పిడుగురాళ్లలో తయారైన నాణ్యత లేని సున్నంలాంటి బ్లీచింగే కావాలని పట్టుబడుతున్నారని తెలిసింది.


ఎలాంటి చిరునామా, గుర్తింపులేని కంపెనీల నుంచి తెచ్చిన వాటినే దిగుమతి చేసుకుంటున్నారు. బుధవారం పిడుగురాళ్ల తహసీల్దారు కార్యాలయ సమీపంలోని గోడౌన్‌లో సున్నం బస్తాలను దిగుమతి చేశారు. ఈ బస్తాలపై కంపెనీ చిరునామా కూడా లేదు. వీటిల్లో కూడా సగం వరకు ముగ్గు ఉన్నట్లు తెలుస్తుంది. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని సంపత్‌నగర్‌లో కూడా బుధవారం కల్తీ బ్లీచింగ్‌ తెరపైకి వచ్చింది. పారిశుధ్యకార్మికులు మంగళవారం సుమారు 10, 12 బస్తాల బ్లీచింగ్‌ను ఆ ప్రాంతంలో చల్లడానికి తెచ్చారు. ఎటువంటి వాసన లేదని, ముగ్గు, సున్నం తరహాలోనే ఈ బ్లీచింగ్‌ ఉందని స్థానికులు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆరా తీయగా గుంటూరు నగరపాలక సంస్థకు  పిడుగురాళ్ల బ్లీచింగ్‌ రెండు లారీలు సరఫరా చేసినట్లు తెలిసింది. నగరపాలక సంస్థ అధికారులు శాంపిల్‌ తీసి నాణ్యతను పరిశీలించకుండా దీనినే ఉపయోగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-06-04T08:58:07+05:30 IST