జ్వలిస్తున్న పోరాట స్ఫూర్తి

ABN , First Publish Date - 2020-09-17T06:26:24+05:30 IST

భూమి కోసం... భక్తి కోసం... వెట్టిచాకిరి విముక్తి కోసం. మట్టి మనుషులే మహాయోధులుగా మారి పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలది. అది ప్రపంచ చరిత్ర పుటలలో...

జ్వలిస్తున్న  పోరాట  స్ఫూర్తి

పేద ప్రజలకు భూపంపిణీ చేస్తామని, అసమానతలు తొలగిస్తామని, అభివృద్ధి చేస్తామని గారడీ మాటలతో పార్టీలు, నాయకులు గద్దెనెక్కుతున్నారు. ఓట్ల కోసం తాత్కాలికమైన ఆశలు చూపి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రజల బతుకులలో మార్పు లేదు. అవినీతి, దోపిడీకి అంతులేదు. సమాజంలోని రుగ్మతలపై నేటికీ కమ్యూనిస్టులు పోరాడుతూనే ఉన్నారు.


భూమి కోసం... భక్తి కోసం... వెట్టిచాకిరి విముక్తి కోసం. మట్టి మనుషులే మహాయోధులుగా మారి పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలది. అది ప్రపంచ చరిత్ర పుటలలో చెరగని స్థానం పొందింది. ఆ పోరాటంలో భాగంగా పది లక్షల ఎకరాల భూమిని భూస్వాముల నుంచి విముక్తి చేసి నిరుపేదలకు పంచారు. మూడు వేల గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వంలో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. వడ్డీ వ్యాపారుల పీడ వదిలింది. అప్పులు, బే-దఖళ్ళు రద్దయ్యాయి. జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, మక్తేదార్లు, దొరలు, భూస్వాములు గ్రామాల నుంచి పట్టణాలకు పారిపోయారు. దొరల గడీలను కొల్లగొట్టి, ప్రజల నుంచి దోపిడీ చేసి కూడబెట్టిన ధాన్యాన్ని, ధనాన్ని ప్రజలకు పంచారు. ఆబాలగోపాలం మూడేళ్లపాటు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో ఊపిరి పీల్చుకున్నారు. 


నిజాం ఆగడాలకు వ్యతిరేకంగా 1945లో ఖమ్మంలో 40 వేల మందితో మహాసభ జరిగింది. రాజకీయ పోరాటాలకు నాంది పలికింది. నిజాం సర్కారుపై గర్జించింది. ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసి పోరాటాలకు మళ్లించింది. తెలంగాణలో భూస్వామ్య కుటుంబాల నుంచి ఎంతోమంది యోధులు, ఆంధ్ర మహాసభలో చేరారు. అనేకమంది నాయకులు పోరాట యోధులయ్యారు. ప్రజలకు అండగా నిలిచి తమ భూములను, ఆస్తులను వారికి పంచారు. ఆంధ్ర మహాసభల ద్వారా ఎందరో కళాకారులు ఉద్భవించారు. తమ కళారూపాల ద్వారా ప్రజలను పోరాటాల వైపు మళ్లించారు. 1946 జూలై 4న విస్నూరు గ్రామంలో ప్రజలు జరిపిన ఊరేగింపును సహించలేని రామచంద్రారెడ్డి, ఆయన తల్లి జానకమ్మ దాడి చేయించి, కాల్పులు జరిపించారు. ఊరేగింపు ముందు భాగంలో ఉన్న దొడ్డి కొమరయ్య కాల్పులలో అమరత్వం పొందాడు. తెలంగాణ అంతటా కొమరయ్య బలిదానం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట రూపంలో ప్రారంభమైంది. కమ్యూనిస్టు పార్టీపై నిజాం నిషేధం విధించాడు. గ్రామాల్లో సైనిక శిబిరాలను ఏర్పాటు చేయించాడు. ఇదే సాయుధ ప్రతిఘటన పోరాటానికి దారితీసింది. ఈ పోరాటం అసఫ్‌జాహీ వంశపు మధ్య యుగాల నాటి నిరంకుశ పాలనను పునాదులతో కుదిపివేసింది. చావుదెబ్బ కొట్టింది. పోలీస్‌ చర్యతో నిజాం పాలన వంద గంటల్లోనే ముగిసింది. నిజాం నుంచి విముక్తి పొందిన తెలంగాణలో యూనియన్‌ సైన్యాల సహకారంతో మళ్లీ దొరల పాలన మొదలైంది. రైతాంగ హక్కులను కాపాడటం కోసం అప్పటివరకూ జరిగిన రైతాంగ ఉద్యమం కొత్త మలుపు తీసుకుంది. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. 1951 వరకూ కొనసాగింది. హోంమంత్రి పటేల్‌ ప్రత్యేకంగా ఉద్యమాన్ని అణచడానికి కెప్టెన్‌ నంజప్పను నియమించాడు. గ్రామాలలో పగలంతా మిలటరీ దాడులు సాగించారు. అడవులలో జంతువులను కాల్చినట్లు ప్రజల్ని కాల్చివేసింది మిలటరీ. తీవ్ర అణచివేతకు గురిచేసింది. చరిత్ర పునరావృతమైంది. పేద ప్రజలకు భూపంపిణీ చేస్తామని, అసమానతలు తొలగిస్తామని, అభివృద్ధి చేస్తామని గారడీ మాటలతో పార్టీలు, నాయకులు గద్దెనెక్కుతున్నారు. ఓట్ల కోసం తాత్కాలికమైన ఆశలు చూపి ప్రజల్ని మరో రూపంలో మభ్యపెడుతున్నారు. మౌలికమైన సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. ప్రజల బతుకులలో మార్పు లేదు. సంపన్నులు కోట్లకు పడగలెత్తుతారు. అవినీతి, దోపిడీకి అంతులేదు. సమాజంలోని రుగ్మతలపై నేటికీ కమ్యూనిస్టులు పోరాడుతూనే ఉన్నారు.

జూలకంటి రంగారెడ్డి

సీపీఐయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

Updated Date - 2020-09-17T06:26:24+05:30 IST