Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నిందలు, నిజాలు!

twitter-iconwatsapp-iconfb-icon

జమ్మూకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా పోరాడాలని అక్కడి రాజకీయపార్టీలన్నీ సోమవారం ముక్తకంఠంతో నిర్ణయించాయి. నియోజకవర్గాల పునర్విభజన పూర్తిగా రాజకీయకోణంతో జరిగింది తప్ప, ఇందులో ప్రజాశ్రేయస్సు ఏమాత్రం లేదని విపక్షపార్టీల ఆరోపణ. కమిషన్ తన అవధులు దాటి  వ్యవహరించిందనీ, పునర్విభజన పేరిట సరిహద్దులు చెరిపేసి ఏకంగా జనాభాని తారుమారుచేసే కుట్రకు పాల్పడిందని గుప్కార్ అలయెన్స్ వాదన. జమ్మూకశ్మీర్ అన్నది ఒక్కటేననీ, దానిని రెండుగా చూసే ఈ మైండ్‌సెట్ అక్కడి రాజకీయపార్టీలు విడనాడినప్పుడే కమిషన్ నివేదికలో ఏ కుట్రలూ కనబడవని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర హితవు చెబుతున్నారు.


కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, పలు సామాజిక సంస్థలు కలసి ఒకే గొడుగుకింద ఉద్యమించాలని నిర్ణయించాయి. రెండేళ్ళక్రితం మార్చిలో ఏర్పడిన ఈ డీలిమిటేషన్ కమిషన్ మే 5న తన తుదినివేదిక ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్ము ప్రాంతానికి ఆరు అసెంబ్లీస్థానాలను కశ్మీర్ లోయకు ఒక్కటి అదనంగా ఇచ్చిన కమిషన్ కశ్మీర్‌లోని అనంతనాగ్ పార్లమెంటరీ స్థానం పరిధిలోకి జమ్మూలోని రజౌరీ, పూంచ్ అసెంబ్లీ సీట్లను తీసుకువచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు జమ్మూడివిజన్‌కు 43, కశ్మీర్ డివిజన్‌కు 47 ఖరారయ్యాయి. వివిధ రాజకీయపక్షాలు, పౌరులు, పౌరసంఘాలతో చర్చోపచర్చలు చేసిన తరువాతే ఈ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చినట్లు కమిషన్ వివరించింది. గతంలో మొత్తం 83 సీట్లలో జమ్మూలో 37, కశ్మీర్‌లో 46 అసెంబ్లీ స్థానాలుండేవి. తాజాగా ఆ సంఖ్య 90కు పెంచడంలో భాగంగా జమ్మూ సంఖ్యాబలం ఒక్కసారిగా హెచ్చింది. గత ఆరుదశాబ్దాల్లో అసెంబ్లీలో కశ్మీర్ లోయ ప్రాతినిధ్యం నాలుగుస్థానాలు మాత్రమే పెరిగితే, జమ్మూ వాటా పదమూడు పెరిగింది. లోయను క్రమంగా బలహీనపరచే కుట్ర ఇప్పుడు మరింత బలంగా జరిగిందన్నది ఆరోపణ. ఆయా ప్రాంతాల ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా కొన్ని స్థానాల పేర్లను సైతం మార్చిన కమిషన్, పునర్విభజన ప్రక్రియలో క్షేత్రస్థాయి వాస్తవికతలను బేఖాతరు చేసిందనీ, సౌలభ్యాన్ని కాక మతశక్తుల ఎజెండాను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరిగిందని విపక్షాల విమర్శ. కొన్ని స్థానాలను నలభైవేల లోపు జనాభాకు పరిమితం చేసి, దాదాపు రెండులక్షల జనాభా ఉన్నవాటిని సృష్టించడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని ఆరోపణ.


విపక్షాలు, మరీ ముఖ్యంగా పీడీపీ అధినేత మెహబూబా విరుచుకుపడుతున్నట్టుగా ఈ పునర్విభజన పక్రియ మొత్తంగా బీజేపీ పక్షానే ఉన్నదనీ, అంతిమంగా దానికే మేలు చేసే రీతిలో సాగిందనీ చెప్పలేం. కానీ, మొత్తం జనాభాలో జమ్మూ వాటాతో పోల్చితే దాని ప్రాతినిధ్యం అసెంబ్లీలో బాగా పెరిగినమాట నిజం. ఆ డివిజన్‌లో అన్ని స్థానాల్లోనూ హిందువులే అధిక సంఖ్యాకులు కాకున్నా బీజేపీకి బలమైన ఊనిక ఉన్నమాటా నిజం. అలాగే, గతంలో తాము గెలవని ప్రాంతాల్లో కొన్నింటిని ఇప్పుడు ఎస్టీలకు రిజర్వుచేయడం వెనుక కూడా రేపటి పొత్తుల, విజయాల లెక్కలున్నాయని అంటారు. ఇక, కశ్మీరీ పండిట్లను లోయనుంచి నామినేట్ చేయడమన్న ప్రతిపాదన వెనుక కూడా బలాబలాల మార్పు ఉన్నదని ఆరోపణ. అమెరికాలోనో, ఢిల్లీలోనో ఉన్నవారిని ఇలా నామినేట్ చేయడం ద్వారా ఇతరత్రా ప్రయోజనాలు నెరవేరవచ్చునేమో కానీ, రాష్ట్రానికి జరిగే మేలు ఉండదనీ, ముందుగా పండిట్లను తిరిగి లోయకు తీసుకురావడం ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటివరకూ కశ్మీర్‌కు చెందిన రాజకీయపక్షాలే చక్రం తిప్పుతూ, లోయనుంచివచ్చినవారే ముఖ్యమంత్రి అవుతున్న విష యం తెలిసిందే. నాలుగేళ్ళక్రితం పీడీపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్న బీజేపీ ఆ తరువాత అక్కడ రాష్ట్రపతిపాలన విధించడం, చివరకు ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలను చేయడం తెలిసిందే. డీలిమిటేషన్ పూర్తికాగానే ఎన్నికలు జరిపి, రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తానని కేంద్రం గట్టిగా చెబుతోంది. పునర్విభజన ప్రక్రియ పేరిట దేశచరిత్రలో తొలిసారిగా ఎన్నికల ప్రకటనకు ముందే, ఒక్క ఓటు కూడా పడకముందే రిగ్గింగ్ జరిగి ఫలితాలు నిర్ణయమైపోయాయన్న విపక్షాల విమర్శ సరైనదో కాదో భవిష్యత్తు చెబుతుంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.