అదనపు వడ్డన!

ABN , First Publish Date - 2022-08-06T05:13:20+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధమైంది. సర్దుబాటు పేరిట మళ్లీ ట్రూ అప్‌ చార్జీల భారం మోపనుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

అదనపు వడ్డన!

  విద్యుత్‌ వినియోగదారులపై బాదుడు

  ట్రూ అప్‌ చార్జీల పేరుతో వాయింపు

  జిల్లాలో 3.11 లక్షల మందిపై భారం

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధమైంది. సర్దుబాటు పేరిట మళ్లీ ట్రూ అప్‌ చార్జీల భారం మోపనుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. తాజాగా సర్కారు తీసుకున్న నిర్ణయంతో విద్యుత్‌ చార్జీల భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేయగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.  దీంతో వెనక్కి తగ్గిన  ప్రభుత్వం  మళ్లీ ఇప్పుడు ట్రూ అప్‌ పేరుతో చార్జీల మోతకు సన్నద్ధమైంది. 2014 నుంచి 2019 వరకు వినియోగించిన విద్యుత్‌కు సంబంధించి 18 నెలలపాటు ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేయనుంది.   ఈ నెల నుంచి గుట్టుచప్పుడు కాకుండా దీనిని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది.  దీంతో జిల్లాలో 3.11 లక్షల మంది వినియోగదారులపై భారం పడనుంది. 

ఇదీ పరిస్థితి.. 

 జిల్లా వ్యాప్తంగా 2,62,601 మంది గృహ విద్యుత్‌ వినియోగదారులు, కమర్షియల్‌ వినియోగదారులు 22,566 మంది, పారిశ్రామిక వినియోగదారులు 965 మంది ఉన్నారు. పీడబ్ల్యూఎస్‌, వీధి లైన్లకు సంబంధించి 6,341 కనెక్షన్లు, వ్యవసాయానికి సంబంధించి 18,821 కనెక్షన్లు ఉన్నాయి.  మొత్తంగా జిల్లాలో  3,11,337 కనెక్షన్లు ఉన్నాయి.  సరాసరిన 43 లక్షల యూనిట్ల వినియోగం జరుగుతుంది. కాగా 2014 -2019 వరకు వినియోగించిన విద్యుత్‌పై సర్దుబాటు పేరిట.. 18 నెలలపాటు అదనపు చార్జీలు వసూలు చేయనునున్నారు.  ఒక్కో యూనిట్‌పై ఏడు పైసలు చొప్పున వసూలు చేసేందుకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) ఏపీఈపీడీసీఎల్‌కు అనుమతి ఇచ్చింది. దీని ఆధారంగా ఈ ఏడాది జూలై నెలలో వాడిన  విద్యుత్‌ ఆధారంగా  యూనిట్‌ వద్ద 7 పైసల చొప్పున అదనంగా బిల్లులో ట్రూఅప్‌ చార్జీలు వేస్తారు. అంటే వంద యూనిట్లు వాడిన వినియోగదారుడు నుంచి రూ.7 చొప్పున అదనంగా వసూలు చేస్తారు.  ఇదిలా ఉండగా పార్వతీపురంలో 45,625 , సాలూరు పరిధిలో 36,997, పాలకొండలో 25,659 కనెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో  గరిష్ఠంగా 200 యూనిట్లు విద్యుత్‌ను వినియోగించే వినియోగదారులు ఉన్నారు. వారిపై సుమారు రూ. 14 భారం పడనుంది. ఈ నెల నుంచే వినియోగదారులు వాటిని చెల్లించాల్సి ఉంటుంది.  ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్‌ చార్జీలు పెరగ్గా.. తాజాగా మరోసారి ట్రూఅప్‌ చార్జీల పేరిట అదనపు భారం పడనుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడో  వినియోగించిన విద్యుత్‌కు ఇప్పుడు అదనపు వసూళ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.   

వాస్తవానికి గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అన్ని కేటగిరీల వినియోగదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్‌ చార్జీలు వసూలు చేసింది. దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. టీడీపీ శ్రేణులు కూడా ఆందోళనకు సిద్ధమవడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.  దీంతో విద్యుత్‌ వినియోగదారులు కాస్త ఊరట చెందారు. అయితే ప్రజలపై ఆర్థిక భారం మోపడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం మళ్లీ అదనపు వడ్డనకు తెరతీసింది.  విద్యుత్‌ సంస్థల  ఖర్చులు, నష్టాలను పూడ్చుకునేందుకు  సర్దుబాటు పేరిట వచ్చే 18 నెలల పాటు అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు.  2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు ఐదేళ్లలో వినియోగించిన మొత్తం విద్యుత్‌కు.. యూనిట్‌కు 7 పైసలు వంతున ట్రూఅప్‌ చార్జీలను లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని ప్రస్తుత నెల నుంచి 18 నెలల పాటు సర్దుబాటు చేయనున్నారు. కాగా 2019 ఏప్రిల్‌ తర్వాత తీసుకున్న సర్వీసులకు ఈ ట్రూఅప్‌ చార్జీల వడ్డన ఉండదని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులు, ఎస్సీ, ఎస్టీలకు రాయితీపై విద్యుత్‌ను అందిస్తున్నారు. అయితే వారి విషయంలో ట్రూఅప్‌ చార్జీల విధింపుపై ఇంకా స్పష్టత లేదు. ఇంకా దీనిపై విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయం ప్రకటించాల్సి ఉందని చెబుతున్నారు. ఏదేమైనా ట్రూ అప్‌ చార్జీల వసూళ్లపై సర్కారు పునరాలోచించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.  

 కట్టాల్సి ఉంది

2014 నుంచి 2019 వరకు వాడిన విద్యుత్‌కు సంబంధించి యూనిట్‌కు ఏడు పైసల చొప్పున వినియోగదారులు ట్రూ అప్‌ చార్జీలు కట్టవలసి ఉంది. 18 వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నాం.

- రజనీకాంత్‌, ఏఏవో, పార్వతీపురం మన్యం జిల్లా


 

Updated Date - 2022-08-06T05:13:20+05:30 IST