స్పా..ట్‌లో దారుణాలు

ABN , First Publish Date - 2022-05-15T06:15:18+05:30 IST

స్పా..ట్‌లో దారుణాలు

స్పా..ట్‌లో దారుణాలు

మసాజ్‌ ముసుగులో స్పాలలో బ్లాక్‌మెయిలింగ్‌ 

యువతులను ఎరగా చూపి రహస్య చిత్రీకరణలు

ఇరుక్కుపోతున్న యువకులు, పెద్దవారు

‘శ్రీబాగ్‌’ కనుసన్నల్లో స్పా సిండికేట్‌

వీడియోలు చూపించి బెదిరింపులు

నగరం వేదికగా రెచ్చిపోతున్న ముఠా


ఇంజనీరింగ్‌ చదువుతున్న ఓ యువకుడు ఇటీవల నగరంలోని స్పా సెంటరుకు వెళ్లాడు. కస్టమర్‌ను చూడగానే, రిసెప్షన్‌లో మహిళా ఉద్యోగులు లోపల ఉన్న అమ్మాయిలను బయటకు పిలిపించారు. అందాల పోటీల మాదిరిగా వరుసలో నిలబెట్టారు. వారిలో నుంచి ఓ అమ్మాయిని ఆ యువకుడు ఎంచుకున్నాడు. లోపలకు వెళ్లాక ఆ యువతితో వేర్వేరు కార్యకలాపాలు కొనసాగించడానికి బేరం కుదుర్చుకున్నాడు. దానికి ఆ యువతి ప్రత్యేక రేటు చెప్పింది. అది ఇవ్వడానికి ఆ యువకుడు సిద్ధపడ్డాడు. ఇదంతా రహస్య కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను చూపించి ఇద్దరు వ్యక్తులు ఆ యువకుడ్ని బెదిరించడం మొదలుపెట్టారు. ఒంటి మీద ఉన్న ఆభరణాలు, జేబులో నగదు లాక్కుని ఇంటికి పంపారు. జరిగిన విషయం స్నేహితులతో చెప్పుకొని గగ్గోలు పెట్టాడు ఆ యువకుడు. 

50 ఏళ్ల వయసున్న వ్యక్తి మసాజ్‌ చేయించుకోవడానికి నగరంలోని స్పా సెంటరుకు వెళ్లాడు. ఎలాంటి మసాజ్‌ కావాలని అందులోని సిబ్బందిని అడగ్గా, దేనికైనా ఓకే అన్నాడు. ముగ్గురు అమ్మాయిలను తెరవెనుక నుంచి ముందుకు రప్పించారు. ఆ ముగ్గురితోనూ మసాజ్‌ చేయించుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ పెద్దాయన. లోపల జరుగుతున్న దృశ్యాలన్నీ రహస్యంగా అమర్చిన కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆయన ఇంటికి వెళ్లి రిలాక్స్‌గా సోఫాలో కూర్చున్నాడు. కాసేపటికి స్పా లోపల జరిగిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఆయన వాట్సాప్‌కు వెళ్లింది. దాన్ని చూడగానే ఆయనలో ఉన్న రిలాక్స్‌ మూడ్‌ ముక్కలై ముచ్చెమటలు పట్టాయి. వెంటనే ఆ స్పా సెంటరుకు పరుగులు పెట్టాడు. ఇద్దరు వ్యక్తులు ఎంట్రీ ఇచ్చి తాము చెప్పినట్టు చేస్తే విషయం సెటిల్‌ అయిపోతుందని ఆఫర్‌ ఇచ్చారు. వారు అడిగిన మొత్తం ఇచ్చుకుని బయటపడ్డాడు ఆ పెద్దాయన.

విజయవాడ నగరంలోని స్పా సెంటర్లలో జరుగుతున్న అక్రమాలకు ఈ రెండు ఘటనలు ఉదాహరణలు. ఇటీవల కాలంలో పోలీస్‌ కమిషనర్‌కు ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటం నగరంలోని స్పాల అక్రమాలను తెలియజేస్తోంది.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : 2014కు ముందు నగరంలో అక్కడకక్కడ స్పా కేంద్రాలుండేవి. రాష్ట్ర విభజన జరిగాక విజయవాడ నుంచి ఈ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కీలక ప్రాంతాల్లో స్పా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంజీ రోడ్డు, మొగల్రాజపురం, భారతీనగర్‌ వంటి ఏరియాలను టార్గెట్‌ చేసుకున్నారు. వాటికి ఒక బ్రాండ్‌ ఉండటం కోసం రాజకీయ, సినీతారలను ఆహ్వానించి ప్రారంభోత్సవాలు చేయించారు. ఇప్పుడు ఈ కేంద్రాలు శృంగార లీలలకు కేరాఫ్‌ అడ్రసులయ్యాయి. బ్లాక్‌ మెయిలింగ్‌కు బేస్‌మెంట్లుగా మారుతున్నాయి. ఉపాధి పేరుతో అందమైన యువతులు, మహిళలకు ఎర వేసి వారితో చేయరాని పనులు చేయిస్తున్నారు. ఒక స్పా సెంటరులో పదిమంది యువతులు ఉంటే, వారిలో ఆరుగురు ఇతర రాష్ట్రాలకు చెందినవారే. మిగిలిన వారు స్థానిక యువతులు. అమ్మాయిలు, మహిళల ఆర్థిక పరిస్థితి, కుటుంబ వెనుకబాటుతనాన్ని పరిశీలించి శిక్షణ పేరుతో స్పాల్లోకి లాగుతున్నారు. తర్వాత వారిని నెమ్మదిగా శృంగారలీలల ఊబిలోకి దింపుతున్నారు. స్పా కేంద్రాల్లో పనిచేస్తున్న వారి కుటుంబాల్లో వారు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలియదు. షాపింగ్‌ మాల్స్‌, ఇతర ఆఫీసుల్లో పనిచేస్తున్నామని చెప్పి వస్తున్నట్టు సమాచారం.

ఆ ఇద్దరు ఎవరు?

మంగళగిరికి చెందిన ఓ వ్యక్తి, విజయవాడకు చెందిన మరో వ్యక్తి కలిసి ‘శ్రీబాగ్‌’గా మసాజ్‌ రంగంలో మాయలు చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. విజయవాడకు చెందిన వ్యక్తికి రెండు, మూడు స్పా కేంద్రాలు ఉన్నట్టు తెలిసింది. అతడికి మంగళగిరికి చెందిన వ్యక్తి తోడయ్యాడు. ఇక ఇద్దరూ స్పా కేంద్రాలను ఏలుతున్నారు. వారి గుప్పెట్లో ఉన్న కేంద్రాల్లో క్రాస్‌ మసాజ్‌ల ముసుగులో జరుగుతున్న వ్యవహారాలను సీక్రెట్‌ కెమెరాల ద్వారా వాళ్లే చిత్రీకరిస్తున్నారు. స్పా కేంద్రాలకు వచ్చే వారి నుంచి ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌ ఇస్తామని రిసెప్షన్‌లో ఫోన్‌ నెంబర్‌ తీసుకుంటున్నారు. వారానికి ఒకసారి తమ కేంద్రంలోకి కొత్త అమ్మాయిలు వస్తారని ఉద్యోగులతో చెప్పిస్తున్నారు. వారంవారం సరికొత్త అందాలను ఆస్వాదించవచ్చని మాయచేసి ఫోన్‌ నెంబర్లు తీసుకుంటున్నారు. ఆనక లోపల జరిగిన వ్యవహారాలకు సంబంధించిన వీడియోలను కస్టమర్లకు పంపి వెంటాడుతున్నారు. ఈ వీడియో బయటకు వస్తే కాపురాలు కూలిపోతాయనుకుంటున్న బాధితులు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పిన డిమాండ్లకు తలూపుతున్నారు. యువకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తామని బెదిరించడంతో అయిన వారి నుంచి అప్పులు చేసి ముట్టజెబు తున్నారు. కొన్ని స్పా కేంద్రాలను గుప్పెట్లో తీసుకుని ఆ ఇద్దరు చేస్తున్న అరాచకాలపై నగరం కోడై కూస్తోంది. 

ఆమె కనుసన్నల్లోనే..

స్పా సెంటరును ఏర్పాటుచేసే విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆమె తెర ముందుకు రాకుండా వెనుక నుంచే వ్యవహారాలు నడుపుతోంది. సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను సంపాదించి పెడతానని విజయవాడలో కొందరు దళారులను ఏర్పాటు చేసుకుంది. స్పా ఏర్పాటు చేయాలనుకుంటున్న వారి వద్దకు వెళ్తున్న ఆ వ్యక్తులు సదరు మహిళతో ఫోన్లలో మాట్లాడిస్తున్నారు. నిర్వహణ ఒకరు చేస్తే, అనుమతి మరొకరి పేరుతో ఉండేలా వ్యవహారం చక్కబెడుతున్నారు. లోపల ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు పోలీసులు దాడులు చేస్తే అనుమతి ఎవరి పేరు మీద ఉందో వారిని అరెస్టు చేస్తారు. ఈ కారణంగా నిర్వాహకులు తెలివిగా ఆయా కేంద్రాల్లో పనిచేసే వారి పేరు మీద అనుమతులు తీసుకుంటున్నారు. కొద్దిరోజులుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్పా కేంద్రాల జోలికి వెళ్లట్లేదు. గంజాయి, బ్లేడ్‌బ్యాచ్‌లపై దృష్టిపెట్టడంతో స్పా మాఫియా రెచ్చిపోతోంది. 



Updated Date - 2022-05-15T06:15:18+05:30 IST