రాజకీయ స్ఫూర్తినిచ్చింది నల్లగొండే

ABN , First Publish Date - 2022-05-21T06:08:33+05:30 IST

నల్లగొండ జిల్లా తనకు రాజకీయ సూర్ఫినిచ్చిందని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

రాజకీయ స్ఫూర్తినిచ్చింది నల్లగొండే
చౌటుప్పల్‌లో అభివాదం చేస్తున్న పవన్‌కల్యాణ్‌

 కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా

 జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌

 ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్యకర్తల కుటుంబానికి ఆర్థికసాయం

 అడుగడుగునా ఘనస్వాగతం పలికిన ప్రజలు

చౌట్పుపల్‌, వలిగొండ, కోదాడ, మే 20: నల్లగొండ జిల్లా తనకు రాజకీయ సూర్ఫినిచ్చిందని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో శుక్రవారం వచ్చిన పవన్‌ కల్యాణ్‌ 11.27గంటల కు చౌటుప్పల్‌కు చేరుకున్నారు. అక్క డి నుంచి కోదాడకు చేరుకోగా, జాతీయ రహదారిపై కేతేపల్లి, సూర్యాపేటలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. చౌటుప్పల్‌, కోదాడలో భారీ గజమాలలతో సత్కరించి కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. ఆయా చోట్ల పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ బాధితులకు తమవంతు చేయుత ఇచ్చామన్నారు. తెలంగాణ లో జనసేన పార్టీని రానున్న రోజుల్లో మరింత విస్తృ తం చేస్తామని పేర్కొన్నారు. అందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యాలయం తీసుకొని, నెలలో ఐదారు రోజులు అందుబాటులో ఉంటానని తెలిపారు. 2007 నుంచి రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానన్నారు. తెలంగాణ సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. జనసేనను బలోపేతం చేసేందుకు విద్యార్థులు, యువతను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం జనసేన నాయకులు కార్యకర్తలు పల్లెల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించా రు. ఆంధ్రప్రదేశ్‌లో ఏమీ ఆశించని తాను తెలంగాణలో ఏం ఆశిస్తానని, నిరంతరం పార్టీ కోసం, ప్రజల సంక్షే మం కోసం పాటుపడతానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20శాతం నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ నాయకులతో చర్చిస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో జనసేనకు 5నుంచి 6వేల వరకు ఓట్లు ఉన్నాయని, తాము గెలవకపోయినా గెలుపు ఓటములను ప్రభావితం చేస్తామన్నారు. 


పవన్‌కు ఘన స్వాగతం

చౌటుప్పల్‌, కోదాడతోపాటు జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా, సూర్యాపేట పట్టణంలో ప్రజలు పవన్‌ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకపోయినా కేవలం సోషల్‌మీడియాతోనే జనసైనికులు, ప్రజలు పవన్‌ పర్యటన వివరాలు తెలుసుకొని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చౌటుప్పల్‌లో, కోదాడ రంగాథియేటర్‌ వద్ద భారీగా అభిమానులు గుమికూడారు. పవన్‌పై పూలవర్షం కురిపించారు. పవన్‌తో కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. ఒకానొక దశలో అభిమానులను నిలువరించడం పోలీసుల తరంకాలేదు. కొమరబండ బైపాస్‌ వద్ద కరచాలనం చేసేందుకు పోటీపడటంతో తొక్కిసలాట జరిగి, ముగ్గురు గాయపడ్డా రు. భారీగా తరలివచ్చిన ప్రజలతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్‌ అయింది. కోదాడలో పవన్‌ ప్రసంగించకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. 11.27గంటలకు పవన్‌ చౌటుప్పల్‌కు చేరుకోగా, అక్కడి నుంచి కోదాడకు 4.30గంటలకు చేరుకున్నారు. కాగా, పవన్‌ అభిమానులు కోదాడలో ఉదయం 10గంటల నుంచే సందడి చేశారు. బైక్‌పై తిరుగుతూ, జనసేన పార్టీ జెండాలు పట్టుకొని ర్యా లీ నిర్వహించారు. కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్దకు మధ్యా హ్నం 2గంటల ప్రాంతంలో పవన్‌ చేరుకోగా అప్పటికే అక్కడ ఉన్న అభిమానుల కేరింతలతో టోల్‌ప్లాజా మార్మోగింది. వారిని చూసి పవన్‌ అభివాదం చేయగా, కరచాల నం చేసేందుకు కార్యకర్తలు, అభిమానులు పోటీపడ్డారు.


కార్యకర్తలకు అండగా ఉంటా

వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెంది న పార్టీ కార్యకర్త కొంగరి సైదులు కుటుంబ సభ్యులను పవన్‌ చౌటుప్పల్‌లో పరామర్శించారు. సైదులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతడి భార్యకు రూ.5లక్షల చెక్కును అందజేశారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కడియం శ్రీనివాస్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, రూ.5లక్షల చెక్కును అతడి తల్లి కడియం లక్ష్మమ్మకు కోదాడలో అందజేశారు. సైదు లు పిల్లల చదువు, వైద్యం ఖర్చులను తాను భరిస్తాన ని పవన్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ, పార్టీ, ప్రజల కోసం పని చేసిన జనసైనికులు సైదులు, శ్రీనివాస్‌ అని, వారి మృతి బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు. కాగా, సైదులు భార్య సుమతి మాట్లాడుతూ, పవన్‌కల్యాణ్‌ తమ కుటుంబానికి ధైర్యం, భరోసా ఇచ్చి ఆదుకున్నార ని పేర్కొంది. కార్యక్రమాల్లో జనసేన రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గోకుల రవిందర్‌రెడ్డి, నాయకులు మేకల సతీష్‌ రెడ్డి, తోర్పునురి లింగస్వామి, పర్నే శివరెడ్డి, ఆముదాల పరమేష్‌, నందగిరి నరేష్‌, మార్గం శ్రీశైలం, ప్రవీణ్‌, పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:08:33+05:30 IST