తెల్ల బీభ‌త్సంపై న‌ల్ల చంద‌మామ

ABN , First Publish Date - 2021-08-03T06:18:48+05:30 IST

ఆమె, కాకులు దూర‌ని కార‌డ‌విలో వెన్నెల‌ను ఒడిసిప‌ట్ట‌డం మాను అంటే స‌సేమిరా అన్న ‘ఔరా! మాన‌వి’...

తెల్ల బీభ‌త్సంపై న‌ల్ల చంద‌మామ

ఆమె, కాకులు దూర‌ని కార‌డ‌విలో

వెన్నెల‌ను ఒడిసిప‌ట్ట‌డం మాను అంటే  

స‌సేమిరా అన్న ‘ఔరా! మాన‌వి’

జ‌యాప‌జ‌యాల‌ బేరీజుతో

పొద్దుపోని వాద‌న‌ల‌తో పొద్దును క‌లగ‌న‌డం, 

ఆత్మ‌శుద్ధికి విరుద్ధ‌మంటుంది

బాహువులు చాచి బ‌డుగుల గుమ్మంలోకి

వెలుగుల్ని కుమ్మ‌రించ‌మ‌ని

సూర్యునిపై ఒత్తిడి పెంచే జ‌య జ‌య జ‌య‌శ్రీ‌


గుండెలో రంధ్రముంటే జ‌నసంద్రంలో తిరిగి పూడ్చుకున్న‌ది

చిల్లు గుండె కూడా

బ‌ల‌వంతుడి పై చావుదెబ్బ‌కు

ఎట్లా ర‌ణ‌గొణధ్వ‌నితో సై అంటోందో చూడు అంటుంది

ఆమె పోని ఆదివాసిగూడెం లేదు, ద‌ళితవాడ లేదు

ధ‌ర్నా చేయ‌ని న‌ల్ల‌నిరోడ్డు లేదు, ఠాణా లేదు, చౌర‌స్తా లేదు

ఆమె తెల్ల భీభ‌త్సంపై న‌ల్లచంద‌మామ‌.

క‌డుపులో పెట్టుకొని పేదసేద‌ల్ని కాపాడే జనని


నువ్వు త‌ల్లిప్రేమ‌కు సుట్ట‌కుదురువు

ష‌ష్టిపూర్తిలు జ‌రుపుకుని మురిసేదానివైతే

ఉరికినకాడికి చాల‌ని కాలు చాపే దానివైతే

నీ గుండే ఇంకా ప‌దికాలాల పాటు స‌జావుగానే ఉండు


ఏది! ఎటూ తేల్చని రోక‌టిపోటు లోకం తీరు

తిరుగ‌లిలో న‌లిగి న‌లిగి తిరుగాడ‌ని గుండె ఆగిపోయింది

న‌ల్ల‌మ‌ల‌కు ఉరేనియం తాడు బిగుసుకున్న‌ప్పుడు

ఫాక్ష‌న్ రాయ‌ల‌సీమ ఫ్యాష‌న్‌ ప్రమోట్ చేసిన‌ప్పుడు

ముదనష్ట‌పు రాజ్యం చింకిబ‌తుకుల్ని కాటేసిన‌ప్పుడు

మొండిగా క‌డ‌పక‌డ‌ప తిరిగిన జీవితం స‌రిపోదా? గ‌ర్వించ‌డానికి...

నీ స్మృతిలో జ‌త క‌లిసి న‌డ‌వ‌డానికి జైకొట్ట‌డానికి

నాలుగుప‌దుల పోరాటయాత్ర స‌రిపోదా!

(31వ తేదీ అర్ధరాత్రి కన్నుమూసిన హ‌క్కుల కార్య‌క‌ర్త‌, 

పోరాటాల ధీరోదాత్త‌ కాకుమాను జ‌య‌శ్రీ‌కి...క‌న్నీళ్ళ‌తో..)

డా. చెరుకు సుధాక‌ర్‌

Updated Date - 2021-08-03T06:18:48+05:30 IST