స్టాక్ మార్కెట్లకు... బ్లాక్ ఫ్రైడే...

ABN , First Publish Date - 2021-02-27T01:17:53+05:30 IST

స్టాక్ మార్కెట్లు శుక్రవారం(ఫిబ్రవరి 26) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ రోజు ఏకంగా 1,939 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట్ 14,430 పాయింట్ల దిగువన ముగిసింది.

స్టాక్ మార్కెట్లకు... బ్లాక్ ఫ్రైడే...

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం(ఫిబ్రవరి 26) భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ రోజు ఏకంగా 1,939 పాయింట్లు నష్టపోగా, నిఫ్ట్ 14,430 పాయింట్ల దిగువన ముగిసింది. కిందటి సెషన్లో 51 వేలకు పైగా ఉన్న సెన్సెక్స్ ఏకంగా 49 వేల పాయింట్లకు పడిపోయింది. అన్ని రంగాలు కూడా భారీగా పతనమయ్యాయి. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్లు మరో ‘బ్లాక్ ఫ్రైడే’ను చూశాయి. సూచీలు ఒకే రోజు మూడు శాతానికి పైగా నష్టపోవడం గమనార్హం. ఇంట్రాడేలో ఏ దశలోనూ సూచీలకు మద్దతు లభించలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1510 పాయింట్లు, నిఫ్టీ 387 పాయింట్ల తేడాను నమోదు చేశాయి.


రెండు పాయింట్లు పతనం... సెన్సెక్స్ ఉదయం 50,256 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 50,400 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,890 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ నేడు 1,939 పాయింట్లు లేదా 3.80 శాతం నష్టపోయి 49,099.99 వద్ద ముగిసింది. సూచీ నేడు ఓ సమయంలో 2150 పాయింట్ల మేర పడిపోయింది. నిఫ్టీ 568 పాయింట్లు లేదా 3.76 శాతం నష్టపోయి 14,529.15 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,888.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,919.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,467.75 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.


టాప్ లూజర్స్...

రిలయన్స్ స్టాక్ ఈ రోజు 3.02 శాతం క్షీణించి రూ. 2,079 వద్ద, టీసీఎస్ షేర్ 3.05 శాతం తగ్గి రూ. 2,903 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నేటి టాప్ లూజర్స్ జాబితాలో ఓఎన్‌జీసీ 6.76 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 6.24 శాతం, హీరో మోటో కార్ప్ 6.13 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 6.12 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 6.07 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్, ఎస్‌బీఐ ఉన్నాయి.


రంగాలవారీగా...

నిఫ్టీ 50 సూచీ 3.76 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2.34 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 3.12 శాతం, నిఫ్టీ బ్యాంకు 4.78 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.91 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.93 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.69 శాతం, నిఫ్టీ ఐటీ 2.30 శాతం,నిఫ్టీ మీడియా 2.58 శాతం, నిఫ్టీ మెటల్ 2.70 శాతం, నిఫ్టీ ఫార్మా 1.76 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 3.97 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.84 శాతం, నిఫ్టీ ప్రైవేటు బ్యాంకు 4.67 శాతం నష్టపోయాయి. ఇక... ఉదయం లాభాల్లో ఉన్న నిఫ్టీ ఫార్మా సాయంత్రానికి నష్టపోయింది.


మార్కెట్ పతనానికి కారణాలెన్నో...

ఇక మార్కెట్ పతనానికి పలు అంశాలుకారణమయ్యాయి.  ప్రపంచవ్యాప్తంగా బాండ్స్ ఈల్డ్ ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ ఏడాది గరిష్టాన్ని తాకాయి. కరోనా అనంతరం బాండ్స్ మార్కెట్లో ఈ తరహా పరిణామం ఇదే తొలిసారి. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌ల్లోనూ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. ఏడేళ్ల బాండ్స్ వేలం వైఫల్యంతో తాజా గందరగోళానికి బీజం పడినట్లు మార్కెట్ నిపుణులు స్పష్టం చేశారు. 


కరోనా అనంతరం వేగంగా పుంజుకుంటున్న డిమాండ్ ద్రవ్యోల్భణానికి దారి తీసే ప్రమాదముందనే అంచనాలున్నాయి. దీంతో కేంద్ర బ్యాంకులు ద్రవ్య విధానాలను తిరిగి కఠినతరం చేసే అవకాశాలున్నాయి. దీంతో బాండ్ మార్కెట్ అనిశ్చితితో ఉంది.బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్భణం ఆందోళనతో అమెరికా, ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కనిపించడం కూడా ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. 

Updated Date - 2021-02-27T01:17:53+05:30 IST