చిత్తూరు ఆస్పత్రిలోనూ బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స

ABN , First Publish Date - 2021-06-18T07:08:06+05:30 IST

చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి బ్లాక్‌ ఫంగస్‌ కేసులకు చికిత్స అందుబాటులో ఉంటుంది

చిత్తూరు ఆస్పత్రిలోనూ బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్స
సమావేశంలో ప్రసంగిస్తున్న హరినారాయణన్‌

ప్రభుత్వాస్పత్రుల్లోని అన్ని బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాలి

వైద్యాధికారుల సమీక్షలో కలెక్టర్‌


తిరుపతి, జూన్‌ 17 (ఆంరఽధజ్యోతి): ‘చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి బ్లాక్‌ ఫంగస్‌ కేసులకు చికిత్స అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ ఏరియా, పీహెచ్‌సీలో ఉన్న బెడ్లకు పూర్తి స్థాయి ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాలి’ అని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వైద్యాధికారులతో కొవిడ్‌ నియంత్రణపై సమీక్షించారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను బాధితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనివల్ల స్విమ్స్‌, రుయాలపై భారం తగ్గుతుందన్నారు. ఇప్పటికే తిరుపతిలో 124 కేసులు ఉన్నాయని చెప్పారు. చిత్తూరులో చికిత్స మొదలుపెట్టాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అపోలో నరేష్‌కు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉన్న కొవిడ్‌ పడకలను మరో మూడు నెలలపాటు ఏమాత్రం తగ్గించవద్దన్నారు. భవిష్యత్‌ను అంచనా వేయలేమని, శానిటేషన్‌ మరింత మెరుగ్గా ఉండాలన్నారు. ఐసీఎంఆర్‌ కొత్త ప్రొటోకాల్‌ ప్రకారం చికిత్స అందేలా చూడాలన్నారు. ఆశించినంతగా కొవిడ్‌ కేసులు తగ్గలేదని కొవిడ్‌ సెంటర్లలోకి రోగుల అటెండర్లు వెళ్లడం వల్లే వ్యాప్తి పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వోలు సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోందన్నారు. జిల్లాలో ఆక్సిజన్‌కు ఇబ్బంది లేదని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పడకలను పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభించాలని డీసీహెచ్‌ఎస్‌, ఏపీఎంఐడీసీలను ఆదేశించారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మరో 10 కేఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంకు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. మదనపల్లె డీహెచ్‌లో అవసరాలు గుర్తించి పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చాలన్నారు. అదేవిధంగా జర్మన్‌ హాంగర్‌ ఏర్పాటుతో ఆక్సిజన్‌ అవసరం లేనివారికి చికిత్స అందించేలా చూడాలన్నారు. 


పీడియాట్రిక్‌ ట్రయేజ్‌లు ఏర్పాటుచేయండి


‘చిన్నపిల్లల ట్రయేజ్‌లు ఏర్పాటు కావాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కనీసం 20 శాతం బెడ్లు పీడియాట్రిక్‌ కోసం అందుబాటులో ఉంచాలి’ అని కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. కొవిడ్‌ బెడ్లు ఖాళీగా ఉన్నాయని సిబ్బందిని విధుల నుంచి తప్పించ వద్దని, ఏ సమయంలో అత్యవసర పరిస్థితులు వస్తాయో చెప్పలేమన్నారు. ప్రస్తుతం అడ్మిషన్లో ఉన్నవారికి మెరుగైన సేవలు అందించేలా చూడాలన్నారు. భవిష్యత్‌ అవసరాలకు సరిపడా మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత రాకూడదన్నారు. జేసీ (హెల్త్‌) వీరబ్రహ్మం, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భూమా వెంగమ్మ, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రామ్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీహరి, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్‌ బాలాంజనేయులు, డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌, శ్రీవాణి, ఏపీఎంఐడీసీ ఈఈ ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T07:08:06+05:30 IST