బ్లాక్‌లో బ్లాక్‌ ఫంగస్‌ మందులు

ABN , First Publish Date - 2021-06-18T18:32:14+05:30 IST

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వినియోగించే ‘ఆంఫోటెరిసిన్‌ బి’ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న రెండు గ్యాంగ్‌లకు చెందిన 9మంది సభ్యులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి

బ్లాక్‌లో బ్లాక్‌ ఫంగస్‌ మందులు

రూ. 7,800 మందులు రూ. 50వేలకు విక్రయించే ప్రయత్నాలు

రెండు గ్యాంగులకు చెందిన 9మంది అరెస్టు

వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌


హైదరాబాద్‌ సిటీ: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వినియోగించే ‘ఆంఫోటెరిసిన్‌ బి’ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న రెండు గ్యాంగ్‌లకు చెందిన 9మంది సభ్యులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీ మొత్తంలో ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. బ్లాక్‌ ఫంగల్‌ సోకిన పేషెంట్లకు వినియోగించే రూ.7,858 ఎంఆర్‌పీ ఉన్న ‘ఆంఫోటెరిసిన్‌ బి’ ఇంజెక్షన్లు, రూ.7,400 ఎంఆర్‌పీ ఉన్న ఫంగిలిప్‌ ఇంజెక్షన్లను రూ. 35వేల నుంచి రూ.50వేల వరకు విక్రయిస్తున్నారు. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ గ్యాంగులోని ఐదుగురు, మరో గ్యాంగులోని నలుగురు చిక్కారు. మొదటి గ్యాంగుకు చెందిన మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని సీపీ తెలిపారు. 


మొదటి గ్యాంగ్‌లో... 

కర్నూలు జిల్లాకు చెందిన జి.శ్రీకాంత్‌(39) న్యూ బోయిన్‌పల్లిలో నివాసముంటూ సనత్‌నగర్‌లోని ఎంఎ్‌సఎన్‌ ల్యాబ్స్‌లో రీజినల్‌ సేల్స్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అనంతపురం జిల్లాకు చెందిన కె.శశికుమార్‌ (33) స్థానికంగా ఎస్సార్‌నగర్‌లో నివాసముంటూ అదే కంపెనీలో మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. కడప జిల్లాకు చెందిన బి.వెంకట సురేశ్‌(33) షాపూర్‌నగర్‌లో నివాసముంటూ రియల్‌ వ్యాపారంలో మీడియేటర్‌గా పని చేస్తున్నాడు. నల్గొండ జిల్లాకు చెందిన ఆర్‌.నిరంజన్‌(36) బోడుప్పల్‌లో నివాసముంటూ పద్మారావునగర్‌లోని బ్రింటన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు.


 కరీంనగర్‌కు చెందిన మహమ్మద్‌ అలీముద్దీన్‌(38) శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటూ సీసీ కెమెరా టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. అలీముద్దీన్‌కు సంబంధించిన బంధువులు ఒకరు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడడంతో ఇంజెక్షన్లు కొనుగోలు చేశారు. అందులో 13 ఆంఫోటెరిసిన్‌ బి ఇంజెక్షన్లు మిగిలిపోయాయి. అవి వృథా కావద్దని భావించిన అలీముద్దీన్‌ వాటిని విక్రయించడానికి సిద్ధమయ్యాడు. తన స్నేహితుడైన వెంకట సురేశ్‌కు రూ.15వేల చొప్పున ఇస్తానని చెప్పాడు. సురేశ్‌ అతని స్నేహితుడు నిరంజన్‌కు ఆయా ఇంజెక్షన్లు రూ.17,500 చొప్పున ఇస్తానన్నాడు. నిరంజన్‌ ఆయా ఇంజెక్షన్లను అతని స్నేహితుడు శశికుమార్‌కు రూ.30వేలకు విక్రయిస్తానన్నాడు. అతను తన బాస్‌ అయిన జి.శ్రీకాంత్‌కు రూ. 35వేల చొప్పున విక్రయిస్తానన్నాడు. అతను తన స్నేహితుడైన గుంటూరుకు చెందిన వినోద్‌ ద్వారా ఎస్సార్‌నగర్‌, ఎల్లమ్మ టెంపుల్‌ వద్ద నిందితులు ఇంజెక్షన్లను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారని గురువారం ఉదయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దాంతో రైయిడ్‌ చేసిన అధికారులు ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకోగా వినోద్‌ తప్పించుకున్నాడు. వారి నుంచి 13 ఆంఫోటెరిసిన్‌ బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు అప్పగించారు. పారిపోయిన నిందితుని కోసం గాలిస్తున్నారు. 


మరో గ్యాంగ్‌లో..

కర్నూలు జిల్లా, బనగానపల్లికి చెందిన టి.బాలస్వామి(31) స్థానికంగా కొత్తపేట్‌లో నివాసముంటూ ఓటీ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఎల్‌బీనగర్‌కు చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌(33) మణికొండలోని మెడికల్‌ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. కర్నూలుకు చెందిన బి.రంజిత్‌ (39)  బోడుప్పల్‌లో నివాసముంటూ అమెజాన్‌ సెల్లర్‌గా వ్యాపారం చేస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లో నివసించే అన్వేష్‌ కుమార్‌ రెడ్డి(33) స్థానికంగా సుమ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాడు. మెడికల్‌ డీలర్‌గా ఉన్న అన్వేష్‌ కుమార్‌ రెడ్డి తన కంపెనీ పేరిట పంజాబ్‌ రాష్ట్రం, అమృత్‌సర్‌ నుంచి లీగల్‌గానే ఇంజెక్షన్లు తెచ్చి విక్రయిస్తుంటాడు. అయితే అక్రమార్జనకు అలవాటు పడ్డ అన్వే్‌షకుమార్‌ రెడ్డి స్నేహితులైన బాలస్వామి, అబ్దుల్‌ ఖదీర్‌, బి.రంజిత్‌ల సాయంతో పేషెంట్ల వద్ద మిగిలిపోయిన ఇంజెక్షన్లను తీసుకొచ్చి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించే ప్రయత్నాలు చేశారు. సేకరించిన 15 ఇంజెక్షన్లను జూబ్లీహిల్స్‌లోని సుమ ఎంటర్‌ప్రైజె్‌సలో కూర్చొని వాటిని బ్లాక్‌లో విక్రయించే ప్రయత్నాలు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 15 ఫంగిలింప్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించినట్లు సీపీ వెల్లడించారు. 

Updated Date - 2021-06-18T18:32:14+05:30 IST