మిర్చిపై నల్లతామర పంజా

ABN , First Publish Date - 2021-12-17T06:22:08+05:30 IST

మిర్చి పంటను నల్లతామర తెగులు నాశనం చేస్తోంది. తెగులుతో పూత, కాత లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో వరి, పత్తి పంటల తర్వాత మిర్చి పంటనే ఎక్కువగా సాగు చేస్తారు. పెట్టుబడిగా లక్షల రూపాయలు ఖర్చు చేశాక పంట చే

మిర్చిపై నల్లతామర పంజా
నడిగూడెం మండలంలో సాగు చేసిన మిర్చిపంట, కొత్తవైర్‌సతో పూత, కాపలేని మిరప పంట

అదుపులోకి  రాని తెగుళ్లు. రైతుల్లో ఆందోళన

శాస్త్రవేత్తలు పరిశీలించినా దక్కని ఫలితం

నడిగూడెం, డిసెంబరు 16: మిర్చి పంటను నల్లతామర తెగులు నాశనం చేస్తోంది. తెగులుతో పూత, కాత లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో వరి, పత్తి పంటల తర్వాత మిర్చి పంటనే ఎక్కువగా సాగు చేస్తారు. పెట్టుబడిగా లక్షల రూపాయలు ఖర్చు చేశాక పంట చేతికందే దశలో తెగుళ్ల బారిన పడటం రైతులను కుంగుబాటుకు గురిచేస్తోంది. వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశీలించి, సూచించిన మందులు సైతం ఈ తెగులును ఏం చేయలేకపోతుండటం గమనార్హం. 

21వేల ఎకరాల్లో మిర్చిసాగు

సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది 21,472 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. ప్రధానంగా హుజూర్‌నగర్‌, కోదాడ డివిజన్లలో సుమారు 17 వేల ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తున్నారు. అత్యధికంగా సన్నరకమైన(తేజరకం) మిర్చిని సాగు చేశారు. చింతలపాలెం మండలంలో 10,109 ఎకరాల్లో సాగు చేయగా, మేళ్లచెర్వు మండలంలో 2,343, మఠంపల్లిలో 2,365, మోతెలో 2,141 ఎకరాల్లో మిర్చి సాగు కాగా మునగాల మండలంలో 216 ఎకరాలు, నడిగూడెం 166 ఎకరాలు, పాలకవీడులో 61 ఎకరాలు, కోదాడలో 52, అనంతగిరి 9 ఎకరాల్లో సాగు చేశారు. ఇక్కడ సాగు చేసిన పంటను ఏపీలోని గుంటూరు, ఖమ్మం, వరంగల్‌ తదితర మార్కెట్లలో మంచిధరకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో ధర క్వింటా మిర్చి రూ.20 వేలు పలుకుతున్న తరుణంలో తెగుళ్లతో దిగుబడి లేక రైతులు నిరాశకు గురయ్యారు.  

శాస్త్రవేత్తలకూ అంతుచిక్కని తెగులు

చింతలపాలెం, పాలకవీడు మండలాల్లో బెంగుళూరుకు చెందిన ఐఐహెచ్‌ఆర్‌, కొండా లక్ష్మణ్‌బాపుజీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పర్యటించి పంటలను పరిశీలించారు. మూడు బృందాలుగా తెగుళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు మొక్కలకు పోషకపదార్థాలు అందడం లేదని, నల్లతామర వంటి తెగులు పూర్తిగా మొక్కలను తినివేస్తుండటంతో దిగుబడి పడిపోతుందని గుర్తించారు. ఇందుకుగాను రైతులు వాడే సాధారణ పురుగు మందులు కాకుండా మొక్కలకు బలాన్నిచ్చే బయో మందులు వాడాలని సూచించారు. మైక్రోన్యూట్రేషన్‌, కొవిడోక్లాటన్‌, స్ఫెనోప్పాడ్‌, ఏసీ టోనీఫ్రిడ్‌, ఇమిడాక్లోప్రిడ్‌ మందులను 10వేల పీపీఆర్‌ వేప నూనెలో కలిపి తరుచూ పిచికారీ చేయాలని సూచించారు. కేవీకేలో అభించే పొట్టిషిలియం లేకిన్ని, భవర్యి భస్నం వంటి బయో మందులను వాడితే మ ంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు సూచించారు. తక్కువ ఖర్చుతో తెగుళ్లను నివారించే పద్ధతులు పాటించాలని రైతులకు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు సైతం పంటలను పరిశీలించి సూచించారు. అయినా తెగులు అదుపులోకి రావడం లేదు.  

30 క్వింటాళ్లకు మూడు క్వింటాళ్ల దిగుబడి

జూన్‌ నుంచి సాగు చేసిన పంటలు డిసెంబరు నుంచి మార్చి వరకు దశల వారీగా కోతకు వస్తాయి. ఇటీవల తొలి కాపు కోయగా ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. సాధారణంగా మిర్చి పంట ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అలాంటిది ఎకరాకు మూడు క్వింటాళ్లు కూడా రాకపోవడంతో చేసేది ఏమీలేక అధికశాతం రైతులు మిరప పంటను దున్ని ఇతర పంటలను సాగు చేసే ఆలోచనల్లో ఉన్నారు.

రెండు ఎకరాలకు రూ.లక్ష పెట్టుబడి

రెండు ఎకరాల్లో మిర్చి సాగుచేస్తే రూ.లక్ష పెట్టబడి అయింది. నారు కొనుకొచ్చి పంట సాగు చేశా. అన్ని రకాల పురుగుల మందులు వాడినా తెగులు పోలేదు. నాలుగు రోజుల క్రితం చేను ఎరితే రెండు క్వింటాళ్ల కా యలు కూడా రాలేదు. పూత, కాపు లేకపోవడంతో తోటను తీసేద్దామనుకుంటున్నా. గతంలో ఎప్పుడూ ఇలాంటి తెగులు చూడలేదు. అధికారులు పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలి. 

ఫ పుట్ట అంజయ్య రైతు, బృందావనపురం. 

శాస్త్రవేత్తలు పరిశీలించారు 

మిర్చిపంటకు సోకుతున్న తెగుళ్లను తమతో పాటు శాస్త్రవేత్తలూ పరిశీలించారు. విపరీతంగా పురుగుల మందుల వాడకం రైతులు తగ్గించాలి. ఆర్గానిక్‌, బయో మందుల వాడకం వల్ల ఫలితాలు ఉంటాయి. శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం రైతులకు సూచనలు, సలహాలు అందిస్తున్నాం. 

ఫ అనిత, ఉద్యానవన శాఖ అధికారి

Updated Date - 2021-12-17T06:22:08+05:30 IST