లాభసాటిగా కాలాజీరా సాగు!

ABN , First Publish Date - 2020-10-14T01:24:35+05:30 IST

జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అని కూడా అంటారు.

లాభసాటిగా కాలాజీరా సాగు!

కశ్మీర్: జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అని కూడా అంటారు. ఈ రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక చిట్కా వైద్యాల్లో వాడుతూ ఉంటారు . ఇంట్లో ఎక్కువగా వాడుకునే పోపు దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. ప్రపంచ సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్ధానం వుంది. ప్రాచీన కాలము నుంచి ఇది వాడుకలో ఉంది . ప్రాచీన కాలంలోఈజిప్టు దేశంలో జీలకర్రను మమ్మీలను తయారు చేయటంలో కూడా వాడేవారు. గ్రీకులు, రోమన్లు కూడా జీలకర్రను వాడేవారట.


నల్ల జీలకర్రను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుతుంది. ఈ విత్తనాల పొడిని బ్రెడ్‌, బిస్కట్లు, రొట్టెలు, ఇడ్లీ, టీ, సూపుల్లో వేసుకుని తీసుకుంటారు. దీనిని రోజువారీ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరిగి మధుమేహం అదుపులోకి వస్తుంది. తేనె, నల్ల జీలకర్ర పొడి, వెల్లుల్లిని కలిపి ఔషధంగా తయారుచేస్తారు. దీన్ని వాడితే జలుబు, దగ్గు తగ్గుతాయి. వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, సోడియం, జింక్‌, మాంగనీస్‌, కాపర్‌, ఐరన్‌ తదితర పోషకాలుంటాయి. వీటివల్ల రక్తహీనత, అసిడిటీ, ఆస్తమా, కేన్సర్, కిడ్నీ వ్యాధులు తగ్గుతాయి. అలాగే రక్తశుద్ది జరుగుతుంది. జీర్ణక్రియ, జీవక్రియలను మెరుగుపరుస్తుంది. ఈ విత్తనాల్లోని థైమో క్వినోన్‌.. బయోయాక్టివ్‌ కాంపోనెంట్‌గా పనిచేస్తుంది. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్నిస్తుంది.


హానికారక బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల నుంచి జీర్ణాశయాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియలను వేగవంతం చేస్తుంది. శక్తిమంతమైన యాంటీబ్యాక్టీరియల్‌ ఏజెంట్‌గా నల్లజీలకర్ర పనిచేస్తుంది. దీన్ని వాడటం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇన్ని ఔషధ విలువలున్న నల్లజీలకర్ర కశ్మీరులో ఎక్కువగా కొండప్రాంతాల్లో, అడవుల్లోనే దొరుకుతుంది. అయితే దీన్ని సాగు చేయించాలని జమ్మూకశ్మీరులోని అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ అధికారులు భావించారు. కొందరు రైతులతో మాట్లాడి ఈ విషయంలో అవగాహన కల్పించారు. రైతులకు నల్లజీలకర్ర మార్కెట్ విలువను, ఆరోగ్య విలువను వివరించారు. రైతులు ఈ పంట సాగు చేసేలా ప్రోత్సహించారు. దీంతో కశ్మీరు లోయలో నల్లజీలకర్ర సాగు జరుగుతోంది.


మార్కెట్ ధరను బట్టి చూస్తే నల్లజీలకర్ర సాగుతో తమకు చాలా మేలు కలుగుతుందని రైతులు చెప్తున్నారు. ఎకరానికి కనీసం లక్షరూపాయల వరకూ లాభం వచ్చే అవకాశం ఉందని, అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. గతంలో నల్లజీలకర్ర అడవుల్లోనే లభించేదని, కానీ అధికారుల సూచనలతో తాము కూడా ఈ నల్లజీలకర్ర సాగు చేస్తున్నామని చెప్పారు. 


కాలాజీరా సాగు చేయడంలో అన్ని దశల్లో తాము రైతులకు అండగా ఉంటున్నామని అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ అధికారులు చెప్పారు. ఏ సమయంలో కోతలు మొదలుపెట్టాలి? గించలు నాటేటప్పుడు ఎంత లోతు తవ్వాలి? వంటి అంశాల నుంచి అధిక దిగుబడి కోసం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే విషయంలో కూడా తాము సూచనలు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఈ పంటల వల్ల వచ్చే లాభాలపై ఎప్పటికప్పుడు రైతుల నుంచే వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా కాలాజీరా చాలామంది బతుకుల్లో వెలుగులు నింపిందని స్పష్టంచేశారు.

Updated Date - 2020-10-14T01:24:35+05:30 IST