రాజీనామా చేసిన బీజేపీ నాలుగో ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2021-09-11T21:22:37+05:30 IST

మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామా చేయడంపై రాజకీయంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరో ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని నియమిస్తారా లేదంటే..

రాజీనామా చేసిన బీజేపీ నాలుగో ముఖ్యమంత్రి

గాంధీనగర్: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రాజీనామా చేశారు, అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేశారు. కాగా తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. అసెంబ్లీ పదవీ కాలం మరో ఏడాది ఉండగానే తన కేబినెట్‌ను విరమించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, తనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ణతలు తెలియజేస్తున్నట్లు రాజీనామా అనంతరం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్ రూపానీ పేర్కొన్నారు.


మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామా చేయడంపై రాజకీయంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరో ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని నియమిస్తారా లేదంటే.. రాష్ట్రపతి పాలన కొనసాగిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.


మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికైన అనంతరం గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్‌ను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం పూర్తవ్వగానే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఇక 2016, ఆగస్టు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ రూపానీ.. సెప్టెంబర్ 11న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవరత్‌కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-09-11T21:22:37+05:30 IST