ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ఎందుకు బుసలు కొడుతోంది?

ABN , First Publish Date - 2021-02-28T01:44:12+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ఎందుకు బుసలు కొడుతోంది?

ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ఎందుకు బుసలు కొడుతోంది?

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌ను వ్యూహాత్మకంగా నరుకుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎవరు, ఎందుకు చేస్తున్నారనే అంశాలకు వెళితే వాటికి చాలా మూలాలు ఉండొచ్చు. కానీ తెగ నరికే కార్యక్రమంలో కేంద్రం పాత్ర ఎంత?, రాష్ట్రం పాత్ర ఎంత? అంటే చాలా విషయాల్లో కేంద్రానికి పూర్తిగా తెలిసే అవకాశం లేదు. రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి లేదా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర శాఖ నుంచి వెళ్లే ప్రాథమిక సమాచారం ఆధారంగానే కేంద్రం స్పందిస్తుంది. కేవలం పెట్టుబడులు మిగతా అన్నీ కూడా రాష్ట్ర నాయకత్వం వేస్తున్న అడుగులు, తీసుకున్న నిర్ణయాలు, స్వప్రయోజనాలు వీటికి అనుగుణంగానే కేంద్రాన్ని, కేంద్ర పార్టీ నాయకత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నట్లు చాలా విషయాల్లో అర్థమవుతుంది. 


అమరావతి విషయంలో ఏనాడూ కేంద్ర పార్టీ నోరు విప్పకపోయినా రాష్ట్ర నాయకత్వమే ఇష్టారాజ్యంగా మాట్లాడింది. తమకు సంబంధం లేదని, పార్టీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు అని పొంతన లేని సమాధానాలు చెబుతూ సాగదీసుకుంటూ వచ్చారు. విశాఖ స్టీల్‌కు సంబంధించి కూడా స్థానికంగా ఒక మాట చెబుతున్నారు.  ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో తెలియదు. ప్రజల మనోభావాలను కేంద్రానికి చెబుతున్నారా? లేదా అనేది తెలియదు. విశాఖ రైల్వే జోనుకు సంబంధించి కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాట్లాడలేదు. 


ఇక ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరాన్ని కూడా నిలువునా చంపేయడానికి రెడీ అయిపోయారు. ఇది కేంద్రం తప్పుకాదు. పోలవరాన్ని పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ఎత్తు తగ్గించి దాన్ని పూర్తి చేయాలనే ప్రతిపాదనను జలవనరుల మంత్రిత్వ శాఖ ఒప్పుకోవడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బలమైన ఆలోచన చేసింది.  పోలవరం ఎత్తు తగ్గించడం.  తద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించి దాదాపు లక్ష నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని 45 వేల కుటుంబాలకు ఇస్తే సరిపోతుందని భావిస్తోంది. మరి దీనికి రాష్ట్ర బీజేపీ నాయకులు తానా అంటే తందానా అని ఎందుకు అంటున్నారనేది అర్థం కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించుకునే నిర్ణయానికి సై కొడుతున్నారు. పోలవలం ఎత్తుకు సంబంధించి ఇటీవలే ఆరు పేజీల లేఖ ఒకటి ఏపీ నాయకుల నుంచి కేంద్రమంత్రిత్వ శాఖకు చేరింది. అయినా వాళ్లు తిప్పికొట్టారు. కానీ వైసీపీ ప్రభుత్వం, బీజేపీలోని ఓ వర్గం మాత్రం పోలవరం ఎత్తు తగ్గించాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. 


కేంద్రమంత్రిత్వ శాఖకు సలహాదారుడిగా ఉన్న తెలంగాణ బీజేపీ నాయకుడు వెదిరె శ్రీరాంరెడ్డి అనే వ్యక్తి పోలవరం ఎత్తు తగ్గించాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు. పోలవరం అథారిటీతో పాటు కేంద్రమంత్రిత్వ శాఖ అధికారులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లు ఒప్పుకోవడంలేదు. వెదిరె శ్రీరాంరెడ్డి భార్య డాక్టర్ శిల్పా రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సలహాదారిణిగా పని చేస్తున్నారు. ఏపీకి నష్టం జరుగుతున్నా బీజేపీలోని ఒక వర్గం నేతలు చప్పట్లు కొడుతున్నారు. మిగతా వాళ్లంతా కన్నీళ్లు పెడుతున్నారు. ఏం చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలనే రాష్ట్ర ప్రభుత్వ చెడు ఆలోచనకు మద్దతు పలుకుతూ వెదిరె కుటుంబం ముందుకు పోతుంటే..రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం ఎందుకు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. తప్పు అని తెలిసి ఎందుకు ఖండించలేకపోతున్నారు. పోలవరం లాంటి బహుళార్థక ప్రాజెక్టును నాశనం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. రాముడి రాజ్యంలో విషపు బాణాలు ఎందుకు వేస్తున్నారు. 


ఇలాంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ‘‘ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ఎందుకు బుసలు కొడుతోంది?. జగన్ ప్రభుత్వం తానా అంటే ఏపీ బీజేపీ తందానా అని ఎందుకంటోంది?. జగన్ ప్రయోజనం కోసం బీజేపీ నేతలు కేంద్రాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారా?. అమరావతి, విశాఖ ఉక్కు తర్వాత ఇప్పుడు పోలవరంపై ఎందుకు విషం కక్కుతున్నారు?. ఆంధ్రప్రదేశ్ జీవనాడిని పిల్లకాలువలా మార్చే కుట్రకు ఎందుకు తెరలేపుతున్నారు?. జగన్ కోసం పోలవరాన్ని చంపే విషపు బాణం వేస్తున్న శ్రీరాముడెవరు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-02-28T01:44:12+05:30 IST