సువేందు ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై నాటుబాంబులతో దాడి!

ABN , First Publish Date - 2021-01-19T23:46:59+05:30 IST

బెంగాల్‌లో అధికార టీఎంసీ పార్టీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి ఇవాళ తలపెట్టిన ఓ ర్యాలీ తీవ్ర హింసకు దారితీసింది...

సువేందు ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై నాటుబాంబులతో దాడి!

కోల్‌కతా: బెంగాల్‌లో అధికార టీఎంసీ పార్టీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి ఇవాళ తలపెట్టిన ఓ ర్యాలీ తీవ్ర హింసకు దారితీసింది. ఆయన ర్యాలీ కోసం వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు నాటుబాంబులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. పశ్చిమ బెంగాల్లోని పూర్వ మెడ్నీపూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2.15 సమయంలో బీజేపీ కార్యకర్తలు హేరియా వైపు వెళ్తుండగా దాడి జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. దుండగులు నాటు బాంబులు, రాళ్లు విసరడంతో పలువురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారనీ... కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. దాడిపై తీవ్ర ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపట్టారు. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అధికార టీఎంసీ పేర్కొంది. కాగా పోలీస్ అధికారులంతా ర్యాలీలో విధులు నిర్వహిస్తున్నందున ఇంకా ఈ కేసులో ఎలాంటి అరెస్టులు జరగలేదని స్థానిక పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన అన్నారు. 

Updated Date - 2021-01-19T23:46:59+05:30 IST