Abn logo
Apr 14 2021 @ 18:03PM

సోనార్ బంగ్లా వెనుక బీజేపీ 'విభజన' రాజకీయం: రాహుల్

కోల్‌కతా: బెంగాల్‌ను ధ్వంసం చేసి విభజించాలని బీజేపీ చూస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి గోయల్‌పోఖోర్‌లో బుధవారంనాడు జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ, అసోం, తమిళనాడులో తరహాలోనే బెంగాల్‌ను ధ్వంసం చేసి విభజించాలని బీజేపీ చూస్తోందన్నారు. బీజేపీ 'బంగారు బంగ్లా' నినాదంపై రాహుల్ చురకలు వేశారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదేతరహా మాయమాటలు చెబుతుంటారని అన్నారు. నిజానికి వాళ్లు మతం, కులం, భాష పేరుతో విడగొట్టడం మాత్రమే చేస్తుంటారని విమర్శించారు.

బీజేపీతో పోరాటానికి మమతా బెనర్జీ ఈసారి పూర్తిశక్తియుక్తులు ఒడ్డుతున్నారన్న వాదనపై రాహుల్ మాట్లాడుతూ, మమతా బెనర్జీ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, తాను కానీ, తమ పార్టీ కానీ ఎప్పుడూ ఆ పని చేయలేదని అన్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఎన్డీయేలో మమత భాగస్వామిగా ఉన్నారని, రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారని అన్నారు. ''టీఎంసీకి  మీరు అవకాశం ఇచ్చారు. కానీ వాళ్లు విఫలమయ్యారు. ఉద్యోగాల కోసం ప్రజలు ఎన్నో పాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు కావలంటే కట్ మనీ తప్పనిసరి. బెంగాల్‌లో ఈ పరిస్థితి కనిపిస్తుంది'' అని రాహుల్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో సీపీఎంతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది.

Advertisement
Advertisement