బీజేపీ Vs టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-06-30T09:58:36+05:30 IST

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సుదీర్ఘకాలం తరువాత హైదరాబాద్‌ వేదిక కాబోతున్న వేళ.. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర

బీజేపీ Vs టీఆర్‌ఎస్‌

ప్రచార యుద్ధం!

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ..

ప్రభుత్వ పథకాలతో టీఆర్‌ఎస్‌ హోర్డింగ్‌లు

మెట్రో పిల్లర్లు, బస్టాప్‌లకు సర్కారు ఫ్లెక్సీలు

వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధికార పార్టీ

ముందస్తుగా ప్రకటన బోర్డుల బుకింగ్‌

సమావేశాలు, సభ జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

దీటుగా కాషాయమయం చేస్తున్న బీజేపీ

ప్రధాన మార్గాలు, కూడళ్లలో ఫ్లెక్సీలు, కటౌట్లు

బీజేపీకి జరిమానాలు విధిస్తున్న జీహెచ్‌ఎంసీ

విజయ్‌ సంకల్ప్‌ సభతో చరిత్ర సృష్టిస్తాం: బండి

బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి!

విజయ్‌ సంకల్ప్‌ వేదికపై పార్టీలోకి..

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సుదీర్ఘకాలం తరువాత హైదరాబాద్‌ వేదిక కాబోతున్న వేళ.. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు సహా ఆ పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతలంతా హాజరు కాబోతున్న వేళ.. రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎ్‌సతో ఆ పార్టీకి ప్రచారపరమైన యుద్ధం మొదలైంది. పార్టీ ప్రతిష్ఠాత్మక సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కేంద్రంలోని తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్న కమలనాథుల ప్రయత్నాలకు టీఆర్‌ఎస్‌ ఆదిలోనే గండి కొట్టింది. ముందస్తు వ్యూహంతోనో, అధికార బలాన్ని ఉపయోగించిందోగానీ.. బీజేపీ ఫ్లెక్సీలకు అధికారిక బోర్డులు, హోర్డింగ్‌లపై స్థానం లేకుండా చేసింది. 66 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌లోని 2600 పిల్లర్లకు రెండు వైపులా ఉండే ప్రకటన బోర్డులను ముందుగానే టీఆర్‌ఎస్‌ బుక్‌ చేసుకుంది. జూలై 2, 3వ తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మూడు నాలుగు రోజుల కిందటి నుంచే ఫ్లెక్సీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మెట్రో పిల్లర్లు, బస్టా్‌పలలో.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ సమావేశాలు ముగిసే మరుసటి రోజు వరకు ఈ ఫ్లెక్సీలు ఉంటాయని యాడ్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. దీనిని బట్టి టీఆర్‌ఎస్‌ ఏకంగా వారం, పది రోజుల కోసం నగరంలోని ప్రకటన బోర్డులు, అధికారిక హోర్డింగులను బుక్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరో రూపంలో తమ ప్రచార ఏర్పాట్లు చేస్తోంది. 

పక్కా ప్లాన్‌తో టీఆర్‌ఎస్‌..

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి పార్టీ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు నగరానికి రానున్నారు. వారి బస కోసం ఇప్పటికే హోటళ్లు బుక్‌ చేశారు. దీంతో ఆయా ప్రాంతాలతోపాటు ప్రధాని మోదీ విమానం దిగనున్న బేగంపేట, సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీ, బహిరంగ సభ జరిగే పరేడ్‌ గ్రౌండ్‌ మార్గాల్లోని అన్ని బస్టా్‌పలు, మెట్రో పిల్లర్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రాలతో, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దర్శనమిస్తున్నాయి. బీజేపీ ప్రచారానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఈ ప్లాన్‌ను అమలు చేస్తుండడంతో బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. ప్రధాన రహదారులు, కూడళ్లు, అంతర్గత మార్గాలు, కాలనీల్లో కాషాయ తోరణాలు, జెండాలు, నేతలకు స్వాగతం పలుకుతూ రెండు రోజుల ముందునుంచే భారీ ఫ్లెక్సీల ఏర్పాటుకు తెరతీశారు. హెచ్‌ఐసీసీ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌ తదితర మార్గాలు ఇప్పటికే కాషాయమయం అయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు స్వాగతం పలుకుతూ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  

బీజేపీకి జరిమానాలు..

బీజేపీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలపై జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం అధికారులు జరిమానాల వర్షం కురిపిస్తున్నారు. ట్విటర్‌లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెనాల్టీలు వేస్తున్నారు. నాంపల్లిలో ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కటౌట్ల ఏర్పాటుపై రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. ఆబిడ్స్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీల ఏర్పాటుపై పెనాల్టీ వేశారు. పేర్లు ఉన్నచోట నాయకులకు, పేర్లు లేని ఫెక్సీలకు పార్టీ ప్రధాన కార్యదర్శి పేరిట ఈ-చలానా జనరేట్‌ చేశారు. బుధవారం రాత్రి వరకు రూ.3.50 లక్షలు పెనాల్టీ వేశారు. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఇందిరాగాంధీ విగ్రహానికి బీజేపీ బ్యానర్లు.. తొలగింపు

మాదాపూర్‌: బీజేపీ అగ్రనేతలకు స్వాగతం పలుకుతూ ఆ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్లను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి కూడా కట్టడం వివాదానికి దారితీసింది. మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ బీజేపీ బ్యానర్లను కట్టిన విషయం తెలుసుకున్న యూత్‌కాంగ్రెస్‌ నాయకులు అక్కడికి వెళ్లి ఆ బ్యానర్లను తొలగించారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాదాపూర్‌ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్ది చెప్పి పంపించారు. 

సాలు మోదీ.. సంపకు మోదీ!

పరేడ్‌ గ్రౌండ్స్‌ సమీపంలో ఫ్లెక్సీ కలకలం

బీజేపీ శ్రేణుల ఆగ్రహం.. తొలగించిన 

కంటోన్మెంట్‌ బోర్డ్‌ అధికారులు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బహిరంగ సభ జరిగే సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ సమీపంలో ప్రధాని మోదీ ఫొటోతో ఏర్పాటైన ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. ‘‘సాలు మోదీ.. సంపకు మోదీ.. బై బై మోదీ’’ అంటు గుర్తు తెలియని వ్యక్తులు టివోలి చౌరస్తా వద్ద బుధవారం తెల్లవారుజామున ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు అక్కడకు చేరుకొని ఫ్లెక్సీని చించివేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పి కంటోన్మెంట్‌ బోర్డు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో బోర్డు సిబ్బంది వచ్చి 10 గంటల ప్రాంతంలో ఫ్లెక్సీ తొలగించారు. నాంపల్లిలోని బీజేపీ  కార్యాలయంలో ‘‘సాలు దొర.. సెలవు దొర’’ అంటూ సీఎం కేసీఆర్‌నుద్దేశించి మూడు రోజుల క్రితం డిజిటల్‌ డిస్‌ప్లే ఏర్పాటు చేయడం తెలిసిందే. కాగా, పరేడ్‌ గ్రౌండ్స్‌ వద్ద మోదీ ఫ్లెక్సీ వివాదం అనంతరం ఈ డిజిటల్‌ బోర్డు ప్రదర్శనను నిలిపివేశారు. 


Updated Date - 2022-06-30T09:58:36+05:30 IST