లతా మంగేష్కర్ మృతి... బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా...

ABN , First Publish Date - 2022-02-06T19:18:33+05:30 IST

లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ బీజేపీ శాసన సభ ఎన్నికల

లతా మంగేష్కర్ మృతి... బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా...

లక్నో : ‘భారత రత్న’ లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ బీజేపీ శాసన సభ ఎన్నికల మేనిఫెస్టో ‘లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర’ విడుదల వాయిదా పడింది. దీనిని కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా ఆదివారం ఉదయం 10.15 గంటలకు బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించవలసి ఉంది. 


ఈ కార్యక్రమం కోసం అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ హాజరయ్యారు. కానీ మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసి, ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ లతా మంగేష్కర్ మృతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ ఎన్నికల ప్రణాళికను ఎప్పుడు విడుదల చేస్తారో తర్వాత ప్రకటిస్తారు.


స్వతంత్ర దేవ్ సింగ్ మాట్లాడుతూ, లతా మంగేష్కర్ వంటివారు శతాబ్దాలకు ఒకసారి జన్మిస్తారన్నారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసే తేదీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. 


లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమెకు కోవిడ్ నయమైనప్పటికీ, ఇతర వ్యాధుల కారణంగా మరణించారని వైద్యులు తెలిపారు. ఆమె పార్దివ దేహానికి నివాళులర్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైకి వెళ్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు ఆయన ముంబై చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఆమె పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. ఆమె పార్దివ దేహాన్ని ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె నివాసం నుంచి శివాజీ పార్కుకు తరలిస్తారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. 


లతా మంగేష్కర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జాతీయ పతాకాన్ని రెండు రోజులపాటు అవనతం చేస్తారు. 


Updated Date - 2022-02-06T19:18:33+05:30 IST