ఢీ అంటే.. ఢీనే!!

ABN , First Publish Date - 2020-07-13T08:45:03+05:30 IST

: రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎ్‌సను ఇకపై బీజేపీ గట్టిగా ఢీ కొట్టబోతోందా? ఆదివారం వరంగల్‌లో ఎంపీ అరవింద్‌పై దాడి యత్నం ఘటనతో ఈ విషయమై

ఢీ అంటే.. ఢీనే!!

  • టీఆర్‌ఎస్‌పై కమల దళం కదనం
  • అరవింద్‌ను కలిసిన బండి సంజయ్‌


హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎ్‌సను ఇకపై బీజేపీ గట్టిగా ఢీ కొట్టబోతోందా? ఆదివారం వరంగల్‌లో ఎంపీ అరవింద్‌పై దాడి యత్నం ఘటనతో ఈ విషయమై కమలం పార్టీ మరింత గట్టి నిర్ణయానికి వచ్చిందా? ఆ మేరకు భవిష్యత్తు పరిణామాలపై టీఆర్‌ఎ్‌సకు విస్పష్ట సంకేతం ఇచ్చిందా? తెలంగాణలో ఇక ఈ రెండు పార్టీ ల మధ్య హోరాహోరీ కొనసాగబోతోందా? అంటే ఔననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఎంపీ అరవింద్‌పై వరంగల్‌ పార్టీ కార్యాలయం వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేయడా న్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ తరహాలో ఇక్కడ కూడా అధికార పార్టీ రాజకీయ దాడులకు దిగుతోందని గుర్తించిన నాయకత్వం.. అక్కడిలాగే ఇక్కడా దీటుగా స్పందించాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, విధానాలపై విరుచుకుపడుతున్నా రు. మరోవైపు మిగతా నేతలమధ్య ఘాటు విమర్శల పర్వం కొనసాగుతోంది. కొద్దినెలల కిందట, మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎంపీటీసీ సభ్యుడు ఒకరు హత్యకు గురైనప్పుడే దాడులను ఎదుర్కొనాలని బీజేపీ నాయకత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. వరంగల్‌ ఘటనతో ఈ నిర్ణయానికి కార్యరూపం ఇవ్వనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.


అడ్డుకుందాం.. తెగించి కొట్లాడుదాం

టీఆర్‌ఎస్‌ దాడులను ఎక్కడికక్కడ అడ్డుకుం దాం.. తెగించి కొట్లాడుదాం.. అనే దిశగా ఇకపై కదులుతామని, వరంగల్‌ నుంచే ఈమేరకు కార్యాచరణ ఆరంభమైందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. వరంగల్‌ దాడి ఘటన సమాచారం అందగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఆయన ఆదేశాల మేరకు వరంగల్‌లో ఉన్న పార్టీ కేడర్‌ అప్పటికప్పుడు సన్నద్ధమై నేరుగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను నిలదీసేందుకు వెళ్లాయి. ‘మా పార్టీ కార్యాలయంపై దాడి విషయంలో సమాధాన చెప్పేదాక టీఆర్‌ఎ్‌సను వదలిపెట్టే ప్రసక్తేలేదు’ అని ఒక నేత తేల్చిచెప్పగా, ‘టీఆర్‌ఎస్‌ ఎలా వెళ్తే.. మేం అలా వెళ్తాం’ అని మరో కీలక నేత కుండబద్ధలు కొట్టారు. వరంగల్‌ ఘటనలో ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసేవరకు, ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసేవరకు తాము పోరాటం చేస్తామని  మరో సీనియర్‌ నేత తేల్చిచెప్పారు. కాగా,  వరంగల్‌ ఘటన అంశాన్ని లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీకి నివేదించాలని నిర్ణయించారు.

 

అరవింద్‌ అంటేనే.. వారికి కంటగింపు

నిజామాబాద్‌ ఎంపీగా అరవింద్‌ విజయం టీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి ఇప్పటికీ మింగుడుపడటం లేదు. దీంతోపాటు ఆయన టీఆర్‌ఎస్‌ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ కంటగింపుగా మారారు. అరవింద్‌ తండ్రి డీఎస్‌.. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నా, పార్టీతో సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో అరవింద్‌ దూకుడును అడ్డుకునేందుకు, టీఆర్‌ఎస్‌ ఆయన విద్యార్హతను తెరపైకి తెచ్చింది. పీజీ సర్టిఫికెట్‌ నకిలీదంటూ ఆరోపణలు చేయగా వాటిని అరవింద్‌ తిప్పికొట్టారు. కాగా, వరంగల్‌ ఘటన తర్వాత సాయంత్రం నగరానికి చేరుకున్న అరవింద్‌ను బండి సంజయ్‌ కలిశారు. 


భౌతిక దాడులు ప్రజాస్వామ్య పద్ధతి కాదు

భౌతిక దాడులు ప్రజాస్వామ్య పద్ధతి కాదని ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. ఒకవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీఆర్‌ఎస్‌ మరోవైపు విపక్ష ప్రజాప్రతినిధులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఇది అసహనంతో చేస్తున్న పని అని విమర్శించారు.

-ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

Updated Date - 2020-07-13T08:45:03+05:30 IST