బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామాలు

ABN , First Publish Date - 2021-11-30T08:51:57+05:30 IST

బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ లబ్ధి కోసం కొట్లాడుతున్నారు తప్ప.. రైతుల కోసం కాదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామాలు

  • ఇప్పుడు కొనాల్సిన వడ్లను వదిలేసి వచ్చే..
  • యాసంగి వడ్ల గురించి కొట్లాట ఎందుకు?
  • ఇంకా రోడ్లపైనే ఉన్న 60 శాతం వడ్లు 
  • రెండు నెలలలుగా కుప్పల వద్దే రైతుల నిద్ర
  • మార్కెట్లను సీఎం ఆకస్మిక తనిఖీ చేయాలి
  • నా ప్రతిపాదనపై 24 గంటల్లో స్పందించాలి
  • యద్ధం లేకున్నా యుద్ధవిమానాలు కొంటున్న..
  • ప్రధాని మోదీ వడ్లు కొనలేరా?: జగ్గారెడ్డి


హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయ లబ్ధి కోసం కొట్లాడుతున్నారు తప్ప.. రైతుల కోసం కాదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ఓవైపు రైతు ఆకలితో ఉంటే.. ఆ పార్టీలు మాత్రం రాజకీయ ఆటలాడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో 60 శాతం వడ్లు ఇంకా రోడ్లపైనే ఉన్నాయని, రెండు నెలలుగా రైతులు వడ్ల కుప్పల వద్దే పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన వాళ్లే దీక్షల్లో కూర్చుంటే ఏం లాభమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ దీక్ష చేస్తే దానికి ఒక అర్థం ఉందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామాలు ఆపాలన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మార్కెట్‌ యార్డులను ఆకస్మిక తనిఖీ చేయాలని, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లాలని కోరారు. 


అప్పుడే.. రైతులు పడుతున్న ఇబ్బందులు, టీఆర్‌ఎస్‌ నాయకుల పనితీరు, అధికారులు ఏం చేస్తున్నారన్నది తెలుస్తుందని అన్నారు. తన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి 24 గంటల్లో  స్పందిస్తారని తాను భావిస్తున్నానన్నారు. ధాన్యం తరలింపునకు గోనె సంచులు, లారీలు ఏర్పాటు చేస్తే 48 గంటల్లో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. రైతు సమస్యను పరిష్కరిస్తే కేసీఆర్‌కే మంచి పేరు వస్తుందని, లేదంటే సీఎంను కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు వారికి దగ్గరగా ఉండే రైతుల ధాన్యాన్నే కొనుగోలు, రవాణా చేయిస్తున్నారని ఆరోపించారు. సాధారణ రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారని తెలిపారు. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మీడియాలో మాట్లాడడం మానేసి.. వడ్లు కొనిపించే పని చేస్తే మంచిదని హితవు పలికారు. 


తెలంగాణ రైతులపై సానుభూతి లేదా?

వ్యవసాయ చట్టాల రద్దు కోసం జరిగిన ఆందోళనల్లో చనిపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ పరిహారం ప్రకటించడం సంతోషమని జగ్గారెడ్డి అన్నారు. అయితే ఆ రైతులపై ఉన్న సానుభూతి.. తెలంగాణ రైతులపై లేదా? అని ప్రశ్నించారు. ఇక్కడి రైతులపైనా సానుభూతి ఉంటే గోనె సంచులు, ధాన్యం రవాణా కోసం లారీలను ఏర్పాటు చేయించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శలకు కేసీఆర్‌ ఎంత వివరణ ఇచ్చినా ప్రయోజనం ఉండదని, తాము ఇస్తున్న సలహాలను పాటిస్తే ఆయనకు లాభం, రైతులకు మేలూ జరుగుతుందని అన్నారు. వచ్చే యాసంగి ధాన్యం సంగతి వదిలేసి.. ఇప్పుడు పండించిన ధాన్యం కొనుగోలు సంగతి తేల్చాలన్నారు. ‘‘వడ్లు కొనడం చేతకాక.. వరి వేయవద్దు అంటే ఎలా? దేశానికి యుద్ధం అవసరం లేనప్పుడు యుద్ధ విమానాలు కొంటున్నారు కదా? వడ్లు కొనలేరా?’’ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ రైతుల్ని శాసించలేరని, రైతులు ఇష్టం వచ్చింది వేసుకుంటారని, వాళ్లు చేయాల్సింది కొనడమేనని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఉనికికోసం మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఆ పార్టీకి నలుగురు ఎంపీలు ఉండి తెలంగాణ రైతుల కోసం ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. 


230కి ఒక్క ఓటు తక్కువ వచ్చినా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా

మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి 230 ఓట్లు ఉన్నాయని, వాటిలో తన భార్యకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్మలా జగ్గారెడ్డిని బలిపశువును చేస్తున్నారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. అందరినీ ఒప్పించి అభ్యర్థిని పెట్టాను కాబట్టి తానే బాధ్యత వహిస్తానని, ఎమ్మెల్యే పదవికి పరిమితమవుతానని అన్నారు. మెదక్‌లో తాము పోటీలో ఉన్నాం కాబట్టే స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ వచ్చిందని పునరుద్ఘాటించారు. 

Updated Date - 2021-11-30T08:51:57+05:30 IST