సభలు.. సమావేశాలు.. భోజనాలు

ABN , First Publish Date - 2022-07-02T16:34:49+05:30 IST

బీజేపీ అగ్రనేతలు గ్రేటర్‌లో కలియ దిరిగారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు

సభలు.. సమావేశాలు.. భోజనాలు

గ్రేటర్‌లో బీజేపీ అగ్రనేతల సందడి 

విస్తృతంగా భేటీలు


హైదరాబాద్‌ సిటీ: బీజేపీ అగ్రనేతలు గ్రేటర్‌లో కలియ దిరిగారు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు అందరూ ఇక్కడే తిష్ఠ వేశారు. ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఇన్‌చార్జిలు బుధవారం రాత్రి నుంచి నగరంలో విస్తృత సమావేశాలు, సభలు నిర్వహించడంతో పాటు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి భోజనాలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గురువారం సమావేశాలు నిర్వహించారు. శుక్రవారం పర్యటనలు, ఐటీ ఉద్యోగులు, వైద్యులు, మేధావులతో పాటు ఆయా సామాజిక వర్గాల వారితో సమావేశం అయ్యారు. భారీ ఎత్తున జన సమీకరణ చేసేలా కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. శేరిలింగంపల్లి సాయిగార్డెన్‌లో అస్సాం కల్చరల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. చందానగర్‌లోని క్రిస్టల్‌ గార్డెన్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారితో సమావేశం ఏర్పాటు చేశారు. పాతబస్తీలో ఆయా వర్గాలకు చెందిన నాయకులతో సమావేశమయ్యారు.


బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, చార్మినార్‌, కార్వాన్‌, గోషామహల్‌, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో అగ్రనాయకులు పర్యటించారు. మరో వైపు చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లి పూజలు చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌మౌర్య అక్కడి వారితో సమావేశం నిర్వహించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్లలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్‌మౌర్య పర్యటించారు. ఈ సందర్భంగా నాదర్‌గుల్‌ 8వ డివిజన్‌లోని ఓ దళిత కుటుంబం ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి వారితో కలిసి సహ పంక్తి భోజనం చేశారు. బూత్‌ స్థాయి నేతలతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చించారు. రాజేంద్రనగర్‌ డివిజన్‌ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఈ.వేణు గోపాల్‌, సుమలతల నివాసంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మధ్యాహ్నం భోజనం చేశారు. 


సామాజిక వర్గాలతో

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారితో బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. అస్సాం, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్ణా టక, గుజరాత్‌, రాజాస్థాన్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కశ్మీర్‌, గోవా, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు, సంఘాలు, యువకులు, మహిళలతో సమావేశాలు నిర్వహించారు. ప్రధాని సభకు తరలి రావాలని వారికి కోరారు. 


 నోవాటెల్‌కు జేపీ నడ్డా 

మాదాపూర్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో నేడు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిమిత్తం బీజేపీ అగ్ర నాయకుడు జేపీ నడ్డా, ఇతర నేతలు శుక్రవారం నోవాటెల్‌కు చేరుకున్నారు. వీరికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ మేయర్‌ కార్తీక స్వాగతం పలికారు. 

 ఆకట్టుకున్న అస్సోం నృత్యరూపకం

మాదాపూర్‌లోని సాయినగర్‌లో అస్సోం కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాన్‌ విశ్వశర్మతో పాటు మంత్రులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. 

 కూలిన కటౌట్లు

నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బీజేపీ, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, కటౌట్లలో కొన్ని గాలికి కూలాయి. మాదాపూర్‌లో బీజేపీ కటౌట్‌ ఒకటి కింద పడగా.. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

Updated Date - 2022-07-02T16:34:49+05:30 IST