త్రిపుర పురపాలికల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

ABN , First Publish Date - 2021-11-28T22:18:21+05:30 IST

త్రిపురలోని నగర పాలక, పురపాలక సంఘాలకు జరిగిన

త్రిపుర పురపాలికల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

అగర్తల : త్రిపురలోని నగర పాలక, పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. అగర్తల నగర పాలక సంస్థతోపాటు 13 పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ప్రారంభమైంది. టీఎంసీ, సీపీఎం నామమాత్ర ఫలితాలు మాత్రమే సాధించగలిగాయి. 


అగర్తల నగర పాలక సంస్థలో 51 వార్డులు ఉన్నాయి. వీటితోపాటు 13 మునిసిపల్ కౌన్సిళ్ళు, ఆరు నగర పంచాయతీల్లో మొత్తం 334 స్థానాలు ఉన్నాయి. వీటిలో బీజేపీ 112 స్థానాల్లో ఏకగ్రీవంగానూ, 217 స్థానాల్లో ఎన్నికల్లోనూ విజయం సాధించింది. మొత్తం మీద బీజేపీ 329 స్థానాలను కైవసం చేసుకుంది. సీపీఎం-3, టీఎంసీ-1, TIPRA-1 స్థానాలను దక్కించుకున్నాయి. అగర్తల నగర పాలక సంస్థలోని అన్ని (51) స్థానాలనూ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 


త్రిపుర శాసన సభ స్పీకర్ రతన్ చక్రబర్తి స్పందిస్తూ, పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని టీఎంసీ ఖూనీ చేసిందన్నారు. ఇప్పుడు త్రిపుర ప్రజల్లో అయోమయాన్ని, అరాచకాన్ని సృష్టించడానికి వచ్చిందని మండిపడ్డారు. తమ రాష్ట్రంలో కనీసం ఒక స్థానాన్ని అయినా టీఎంసీ గెలిచే అవకాశం లేదన్నారు. 


ఎన్నికల ఫలితాలపై టీఎంసీ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, త్రిపురలో బలమైన ప్రతిపక్షంగా నిలిచినట్లు తెలిపింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని పేర్కొంది. తమను ఆశీర్వదించినందుకు త్రిపుర ప్రజలకు, త్రిపురేశ్వరి మాతకు ధన్యవాదాలు తెలిపింది. రిగ్గింగ్, బెదిరింపులు, హింసాకాండ ఎదురైనప్పటికీ, బలమైన ప్రతిపక్షంగా నిలిచామని పేర్కొంది. దయాదాక్షిణ్యాలు లేకుండా సృష్టించిన అరాచకానికి త్వరలోనే తెరపడుతుందని హెచ్చరించింది. 


Updated Date - 2021-11-28T22:18:21+05:30 IST