Receptionist Murder Case: పెల్లుబికిన నిరసన జ్వాల... వినోద్ ఆర్యపై బీజేపీ సస్పెన్షన్ వేటు...

ABN , First Publish Date - 2022-09-24T19:52:00+05:30 IST

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఓ రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న

Receptionist Murder Case: పెల్లుబికిన నిరసన జ్వాల... వినోద్ ఆర్యపై బీజేపీ సస్పెన్షన్ వేటు...

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఓ రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న పందొమ్మిదేళ్ళ యువతి హత్యపై నిరసన వెల్లువెత్తింది. ఈ కేసులో ఓ బీజేపీ నేత కుమారుడు అరెస్టవడంతో, నిందితునికి చెందిన ఓ రిసార్ట్‌ను ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం కూల్చేసింది. నిందితుని సోదరుడిని, వారి తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.


బీజేపీ నేత వినోద్ ఆర్య (Vinod Arya) కుమారుడు పులకిత్ ఆర్య (Pulkit Arya)కు యమకేశ్వర్‌లో ఓ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ మేనేజర్‌గా సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్‌గా అంకిత్ గుప్తా పని చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న 19 ఏళ్ళ యువతి సెప్టెంబరు 18న అదృశ్యమయ్యారు, అనంతరం హత్యకు గురయ్యారు. ఈ కేసులో పులకిత్ ఆర్య, సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను శుక్రవారం అరెస్టు చేశారు.  వీరిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఆమె తండ్రి కథనం ప్రకారం ఆమెను నిందితులు లైంగికంగా వేధించారు. ఆ ఆడియో రికార్డయింది. 


రిసెప్షనిస్ట్ హత్య జరిగినట్లు వెల్లడైన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన పెల్లుబికింది. ఈ నేపథ్యంలో పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌ను కూల్చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. 


మరోవైపు బీజేపీ కూడా స్పందించింది. పులకిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్య (Ankit Arya)ను, వీరి తండ్రి వినోద్ ఆర్యను పార్టీ నుంచి శనివారం సస్పెండ్ చేసింది. అంకిత్ ఆర్య ఉత్తరాఖండ్ ఇతర వెనుకబడిన తరగతుల కమిషన్ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆ పదవి నుంచి తక్షణమే తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలిచ్చింది. 


ఇదిలావుండగా, పులకిత్ ఆర్యకు చెందిన వనతార రిసార్టుకు స్థానికులు నిప్పు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రేణు బిస్త్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేసి, ఆమె కారును ధ్వంసం చేశారు. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను సురక్షితంగా తీసుకెళ్ళారు. పులకిత్ ఆర్యతోపాటు మిగిలిన ఇద్దరు నిందితులను శుక్రవారం పోలీసులు తీసుకెళ్తున్నపుడు కూడా నిరసనకారులు ఆగ్రహంతో రాళ్ళు రువ్వారు. 


Updated Date - 2022-09-24T19:52:00+05:30 IST