బీఆర్‌ఎస్‌ కాకపోతే ఏఆర్‌ఎస్‌ పెట్టుకో

ABN , First Publish Date - 2022-04-29T09:02:26+05:30 IST

‘‘భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కాకపోతే అంతర్జాతీయ రాష్ట్ర సమితి(ఏఆర్‌ఎస్‌) అని పెట్టుకో.. తెలంగాణ ప్రజలు మీకు వీఆర్‌ఎస్‌ (వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌) ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం తెలిసే..

బీఆర్‌ఎస్‌ కాకపోతే ఏఆర్‌ఎస్‌ పెట్టుకో

ప్రజలు టీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇస్తారు..

బీసీని గులాబీ పార్టీ అధ్యక్షుడిని చేస్తారా..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు..కేసీఆర్‌ డబ్బులు పంపుతున్నారు

బీజేపీని తిట్టడానికే ప్లీనరీ: కిషన్‌రెడ్డి


మహబూబ్‌నగర్‌/న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ‘‘భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కాకపోతే అంతర్జాతీయ రాష్ట్ర సమితి(ఏఆర్‌ఎస్‌) అని పెట్టుకో.. తెలంగాణ ప్రజలు మీకు వీఆర్‌ఎస్‌ (వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌) ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం తెలిసే ప్రజలను తప్పుదారి పట్టించడానికే జాతీయ రాజకీయాలంటూ డ్రామాలు మొదలుపెట్టారు’’ అని సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం ఓబులాపురం సమీపంలో గురువారం నిర్వహించిన శిబిరం వద్ద సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్లీనరీలో తీర్మానం చేయించిన కేసీఆర్‌.. బీజేపీ పోరాడేంత వరకు మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదని విమర్శించారు. బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలంటున్న ఆయన.. కేంద్రంలో 27 మంది బీసీ మంత్రులతో పాటు ప్రధానే బీసీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. తనతో సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బీసీలని, టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి బీసీకి ఇస్తారా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర క్యాబినెట్‌లో ఎందరు బీసీలున్నారని, బీసీల ఆత్మగౌరవ భవనాలు ఏమయ్యాయని నిలదీశారు.


కేసీఆర్‌.. ఎంఐఎం అనే క్యాన్సర్‌ గడ్డను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారని దుయ్యబట్టారు. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలని ప్రధాని సూచిస్తే తండ్రీ కొడుకులకు సుర్రుమందని.. అందుకే ప్లీనరీలో ప్రధానిని దూషించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇటీవల ఖమ్మంలో కమ్మ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం వెనక టీఆర్‌ఎస్‌ హస్తం ఉందని తెలిసి తెలంగాణలో కమ్మ సామాజికవర్గం టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకతతో ఉందని, మళ్లీ ఆ సామాజిక వర్గాన్ని నమ్మించి మోసం చేయడానికే ఎన్టీఆర్‌ జపం చేస్తున్నారని విమర్శించారు. కాగా, చైనాలో వైద్య విద్యనభ్యసిస్తున్న 20 వేల మంది విద్యార్థులను కొవిడ్‌ నేపథ్యంలో ఆ దేశం అనుమతించడం లేదని, వారిని ఆదుకోవాలని ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ సంజయ్‌కి వినతి పత్రం ఇచ్చింది. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన హామీ ఇచ్చారు. 


బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం

దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు టీఆర్‌ఎస్‌ డబ్బులు పంపుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఏ ఫ్రంట్‌ అయినా పెట్టుకోవచ్చని.. అయితే 8 ఏళ్లుగా తెలంగాణలో ఏం ఉద్ధరించారని ప్రశ్నించారు. ‘‘గుణాత్మక పరిపాలన అంటే కల్వకుంట్ల పాలనా..? ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమా..? తండ్రీ కొడుకుల పాలనా..?’’ అని ప్రశ్నించారు. గురువారం కిషన్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు అబద్ధాలు, అభూత కల్పనలు సృష్టించారని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పులు చేసి కమీషన్ల పేరిట నిధులను కొల్లగొడుతున్నారని, టీఆర్‌ఎ్‌సపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. బీజేపీ అంటే కేసీఆర్‌ భయపడుతున్నారని.. బీజేపీని తిట్టడానికే ప్లీనరీ పెట్టుకున్నారని అన్నారు. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. 


ప్లీనరీ వేదికపై ఉద్యమకారులేరీ..?: జితేందర్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికపై ఉద్యమకారులు ఉన్నారా..? అని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ మంత్రులు ఎ.చంద్రశేఖర్‌, విజయరామారావు, మాజీ ఎమ్మెల్సీ దిలీ్‌పకుమార్‌, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డిలతో కలిసి హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గురువారం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తామే అసలైన ఉద్యమకారులమని స్పష్టం చేశారు. ‘‘2018 ఎన్నికల తర్వాత కేసీఆర్‌, మేము నుంచి నేనుకు వచ్చాడు. తన వల్లే టీఆర్‌ఎస్‌ 88 సీట్లు గెలిచిందని భావిస్తున్నాడు. అందుకే హిట్లర్‌ను మరిపిస్తూ పాలన చేస్తున్నాడు’’ అని విమర్శించారు. కవిత అమెరికా నుంచి వస్తుందని, కారు కావాలని కేసీఆర్‌ అంటే.. తాను ఆనాడు కొత్త కారును ఆయన ఇంటి ముందు పెట్టానని మాజీ మంత్రి చంద్రశేఖర్‌ అన్నారు. ‘తెలంగాణను దోచుకున్నది సరిపోక.. దేశాన్ని దోచుకోవడానికి జాతీయ రాజకీయాలు కావాలా..?’ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌.. కేసీఆర్‌పై మండిపడ్డారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పి, తర్వాత జాతీయ రాజకీయాలపై మాట్లాడాలని హితవు పలికారు. 

Updated Date - 2022-04-29T09:02:26+05:30 IST