ఎన్నికల వాగ్ధానాల సంగతేంటో చెప్పండి

ABN , First Publish Date - 2022-07-06T13:58:10+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను డీఎంకే ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

ఎన్నికల వాగ్ధానాల సంగతేంటో చెప్పండి

- హామీలేమయ్యాయి?

- డీఎంకేపై బీజేపీ నేత అన్నామలై ఆగ్రహం

- రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలు


ప్యారీస్‌(చెన్నై), జూలై 5: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను డీఎంకే ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వ తీరును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష జరిగింది. వళ్లువర్‌కోట్టం సమీపంలో అన్నామలై అధ్యక్షతన జరిగిన నిరాహారదీక్ష శిబిరంలో నిర్వాహకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర నిర్వాహకులు కరు.నాగరాజన్‌, కరాటే త్యాగరాజన్‌, చక్రవర్తి, పాల్‌ కనకరాజ్‌, విజయ్‌ఆనంద్‌, వి.గిరినాధ్‌, ఏబీ కుమార్‌, నిర్మల్‌ కుమార్‌ తదితరులు ప్రసంగించారు. ముందుగా దీక్షా శిబిరం ప్రారంభించిన అన్నామలై మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ రెండుసార్లు డీజిల్‌, పెట్రోల్‌ ధరలు తగ్గించారని, కేంద్రప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బీజేపీ అధికారంలో లేని కేరళ సహా పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించారని, అయితే డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులో పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన వ్యాట్‌ తగ్గించకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గృహిణులకు రూ.1,000, నెలకోసారి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ తదితర 9 హామీలు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన డీఎంకే, మాట నిలబెట్టుకోలేక పోయిందని ఆరోపించారు. అలాగే, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువళ్లూర్‌, దిండుగల్‌, పుదుకోట తదితర నగరాల్లో ఏర్పాటుచేసిన నిరాహారదీక్షలో బీజేపీ శ్రేణులు పాల్గొని, డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



Updated Date - 2022-07-06T13:58:10+05:30 IST