కమలం దూకుడు

ABN , First Publish Date - 2022-06-02T07:42:58+05:30 IST

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ తన కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే జాతీయ నేతల విస్తృత

కమలం దూకుడు

-తెలంగాణపై ఫోకస్‌ పెంచిన అగ్ర నాయకత్వం

-విస్తృత కార్యక్రమాలతో పట్టు పెంచుకునే యత్నం

-జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

-ప్రధాని మోదీ సహా హాజరు కానున్న అగ్రనేతలు

-కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షుల రాక

-పార్టీ బలోపేతానికి దోహదపడతాయనే యోచన

-ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

-హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ తన కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే జాతీయ నేతల విస్తృత పర్యటనలు, కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్న ఆ పార్టీ.. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాలనూ ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో జూలై 2, 3 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా అగ్రనేతలంతా హాజరు కానున్నారు. వీరితోపాటు 40 మంది కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతారు. దీంతో ఈ సమావేశాలు తెలంగాణలో పార్టీ విస్తృతికి మరింతగా దోహదపడతాయని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు హైటెక్స్‌ సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌ వేదిక కానుంది. అనంతరం పార్టీ సంప్రదాయంగా నిర్వహించే సంఘటనా మంత్రుల సమావేశం జూలై 4న జరుగుతుంది. ఈ సమావేశాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణపై ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, బీజేపీ జాతీయ సంఘటన్‌ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌, కార్యదర్శి అరవింద్‌ మీనన్‌ బుధవారం రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌, అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి హైటెక్స్‌లోని నోవాటెల్‌, తాజ్‌ కృష్ణా హోటళ్లను సందర్శించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నోవాటెల్‌లోనే సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. 

పార్టీ విస్తృతికి దోహదం..

పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో పార్టీ విస్తృతికి దోహదపడతాయని బీఎల్‌ సంతోష్‌ అన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధి, వికాసం కోసం బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అమలు కావాల్సింది భారత రాజ్యాంగమే తప్ప.. కల్వకుంట్ల రాజ్యాంగం కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదన్న ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడి ప్రభుత్వం సెంటిమెంటుతో కొనసాగుతోంది తప్ప.. పేదలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతీ పోలింగ్‌ బూత్‌ పరిధిలోని కార్యకర్త కూడా హైదరాబాద్‌ వచ్చి జాతీయ సమావేశాల ప్రాధాన్యం తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ కాస్మోపాలిటన్‌ నగరమని, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ ఉంటున్నారని, జాతీయ సమావేశాల సందర్భంగా ఇక్కడకు వస్తున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు ఆయా రాష్ట్రాల ప్రజలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సంతోష్‌ సూచించారు. కాగా, భవిష్యత్తులో తెలంగాణాలో బీజేపీ రాజకీయం ఎలా ఉండబోతుందో చెప్పడానికి జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణే ఉదాహరణ అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. 

ఎజెండాలో కీలక అంశాలు

రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సతో తీవ్రంగా పోరాడుతున్న బీజేపీ హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తుండడం, దేశంలోని ఆయా రాజకీయ పార్టీల నేతలతో సమావేశమవుతున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశాలు నిర్వహించాలనుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ సమావేశాల్లో కీలక ఎజెండాలు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. రానున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు ఉంటాయని పేర్కొన్నాయి. ఇప్పటి వరకు పార్టీ బలంగా లేని రాష్ట్రాల్లో బలోపేతం చేయడం, 2024 లోక్‌సభ ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌ వంటి అనేక కీలక అంశాలు ఎజెండాలో ఉన్నట్లు తెలిసింది. అలాగే, పలు తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. 

టీఆర్‌ఎ్‌సతో వ్యూహాత్మక పోరు..

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువు ఉన్నా.. రాష్ట్రంలో పట్టు కోసం బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటినుంచే సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా అధికార టీఆర్‌ఎ్‌సపై వ్యూహాత్మక పోరు సాగిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం తమ కార్యకలాపాలతో రాజకీయంగా వేడి పుట్టిస్తుండగా.. జాతీయ నాయకత్వం తరచుగా ఇక్కడికి వస్తూ వారిలో ఉత్సాహం నింపుతోంది. గడచిన నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్ర పర్యటనకు వచ్చార. మే 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వచ్చిన అమిత్‌షా.. కేసీఆర్‌ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని ప్రకటించారు. అవసరమైతే ఎన్నిసార్లయినా రాష్ట్రానికి వస్తానన్నారు. అనంతరం మే 26న హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ కూడా సీఎం కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకుపడ్డారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు కూడా వచ్చి జిల్లా స్థాయిలో వివిధ పథకాలను సమీక్షిస్తున్నారు. జాతీయ నేతలు రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇకముందు కూడా పెద్దసంఖ్యలో నేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఢిల్లీలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

గురువారం ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరు కానున్నారు. తద్వారా తెలంగాణకు తాము ఎంత ప్రాధాన్యమిస్తున్నామో తెలియజేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యమకారులను బీజేపీ వేదికగా ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఉద్యమకారుల ఆకాంక్షల సభ పేరిట గురువారం ఈ సభను నిర్వహిస్తున్నారు. అనంతరం సర్పంచులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మౌనదీక్ష చేయనున్నారు. మరోవైపు హిందుత్వ ఎజెండానూ బీజేపీ కొనసాగిస్తోంది. బండి సంజయ్‌ తరచుగా ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో బీసీ ఓటుబ్యాంకును గణనీయంగా పెంచుకోవడంపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. సీనియర్‌ నేత కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ టికెట్‌ ఇవ్వడం వ్యూహాత్మకమేనని అంటున్నారు. 

Updated Date - 2022-06-02T07:42:58+05:30 IST