బీజేపీ స్నేహ యాత్ర

ABN , First Publish Date - 2022-07-04T10:00:04+05:30 IST

తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ.. అందుకు అవసరమైన వ్యూహాలను జాతీయ కార్యవర్గంలో చర్చించి ఖరారు చేసింది.

బీజేపీ స్నేహ యాత్ర

  • ప్రభావిత వ్యక్తులు, సంస్థల వద్దకు వెళ్దాం
  • తెలంగాణలో త్వరలోనే యాత్ర ప్రారంభం
  • ముస్లింలు, క్రైస్తవ ఓట్లపైనా కన్ను
  • బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం


హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ.. అందుకు అవసరమైన వ్యూహాలను జాతీయ కార్యవర్గంలో చర్చించి ఖరారు చేసింది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేసేందుకు ప్రజల్లోకి వెళ్లడం, సంస్థాగతంగా బలపడడంతోపాటు ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులు, సంస్థలను ఆకర్షించాలని నిర్ణయించింది. సమాజంలో ప్రతిష్ఠ ఉన్న వృత్తుల్లో ఉన్నవారు, ప్రజలను ప్రభావితం చేసే అన్ని వర్గాలకు చేరువ య్యేందుకు ‘స్నేహ యాత్ర’ను చేపట్టాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో బీజేపీ చేపట్టిన పథకాలు, చేసిన అభివృద్ధి, భావజాలం తదితర అంశాలపై ఆయా వ్యక్తులు, సంస్థలకు వివరిస్తారు. ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, వైద్యులు, లాయర్లు, ఇంజనీర్లు, ఆర్టీఐ కార్యకర్తలు తదితరులను కలవనుంది. తెలంగాణలో త్వరలోనే ఈ యాత్ర ప్రారంభించాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. పార్టీపరంగా, సభ్యత్వపరంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు బీజేపీకి పోటీ వచ్చే వారు లేరని, దాంతోపాటు ‘స్నేహ యాత్ర’ ద్వారా అందరినీ కలవాలనే ప్రతిపాదనను ప్రధాని మోదీ స్వయంగా చేశారని సమాచారం. విస్తృతంగా ఈ యాత్ర చేపట్టాలని భావించా రు. ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులను, సమాజం కోసం పనిచేస్తున్న వారిని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారిని గౌరవించే పనిని కూడా బీజేపీ ద్వారా చేయాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయిలో ఒక సమావేశం పెట్టుకుని విధి విధానాలపై త్వరలో నిర్ణయం తీసుకుని స్నేహ యాత్రను ప్రారంభించనున్నారు.


మైనారిటీలకు దగ్గర కావాలనే వ్యూహం

ముస్లింలలోనూ వెనకబడిన వర్గాలపై దృష్టి పెట్టాలని బీజేపీ కార్యవర్గ సమావేశాలు నిర్ణయించాయి. ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు బీజేపీ దూరమన్న భావనను దూరం చేసి, ఆయా వర్గాల్లోని వెనకబడిన వారిని దగ్గర చేసుకోవాలన్న అంశంపై చర్చ జరిగింది. దీనిపై జాతీయ కార్యవర్గంలో మాట్లాడిన నాయకులు అనేక సూచనలు చేశారు. బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో ఒక్క ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే కూడా లేరు. వారికి అసలు టికెట్టే ఇవ్వలేదు. అయినా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ట్రిపుల్‌ తలాక్‌ కారణంగా ఆ వర్గంలోని కొందరు కూడా ఓట్లేశారు. ఉదాహరణకు, యూపీలోని రాంపూర్‌ పార్లమెంట్‌ స్థానంలో 55ు ఆ సామాజిక వర్గ ఓటర్లే ఉన్నారు. అయినా ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక, ఎన్నికల తర్వాత ముస్లిం మైనార్టీల్లో వెనకబడిన వర్గాలకు చెందిన పస్మంద్‌ ముస్లింల నుంచి ఒక నేతను తీసుకుని మంత్రివర్గంలో స్థానం కల్పించారు. వెరసి, ముస్లింలలో అంతా బీజేపీకి వ్యతిరేకం కాదని, మహిళల నుంచి మద్దతు వస్తోందని భావించారు. తెలంగాణలో కూడా ముస్లింలలో వెనుకబడిన వర్గాలున్నాయని, వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చే సి వారిని ఆకట్టుకోవాలని పలువురు నేతలు సూచించారు. అలాగే, ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ బ్రహ్మాండమైన ఫలితాలు సాధించడాన్ని గుర్తు చేశారు. నాగాలాండ్‌, గోవా, మణిపూర్‌, మిజోరంలలో క్రిస్టియన్‌ జనాభా ఎక్కువ. ఆయా రాష్ట్రాల్లో 50-70ు ఆ సామాజికవర్గ ఓటర్లే ఉన్నారు. అయినా, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది. అక్కడ పాటించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలను చివరి వ్యక్తి వరకూ తెలిసేలా ప్రచారం చేశారు. అటువంటి ప్రణాళికనే తెలంగాణలో కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేయాలని ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్ర నేతలకు సూచించారు.


48 గంటల మోడల్‌ ఇతర చోట్లా అమలు

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లోను పార్టీ ముఖ్య నేతలు పర్యటించాలన్న ప్రణాళిక బాగా పనిచేసిందని జాతీయ కార్యవర్గం అభిప్రాయపడింది. ప్రజల్లోకి వెళ్లడంతో క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉందని తెలిసింది. అదే సమయంలో పార్టీ కార్యకర్తలను కలిసేందుకు అవకాశం దొరికింది. ప్రజలకు కూడా బీజేపీపై నమ్మకం ఏర్పడేందుకు ఉపకరించిందని కార్యవర్గంలో మాట్లాడిన నేతలు తెలిపారు. ఇకనుంచి ఎక్కడ కార్యవర్గ సమావేశాలు జరిగినా ఈ మోడల్‌ను అనుసరించాలని నిర్ణయించారు.

Updated Date - 2022-07-04T10:00:04+05:30 IST