BJP Vs AAP : ఢిల్లీ విద్యా విధానంపై విదేశీ పత్రికల కథనాలు... డబ్బులిచ్చి రాయించుకున్నారన్న బీజేపీ...

ABN , First Publish Date - 2022-08-19T22:57:10+05:30 IST

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న

BJP Vs AAP : ఢిల్లీ విద్యా విధానంపై విదేశీ పత్రికల కథనాలు... డబ్బులిచ్చి రాయించుకున్నారన్న బీజేపీ...

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానంపై న్యూయార్క్ టైమ్స్ (The New York Times), ఖలీజ్ టైమ్స్ (Khaleej Times) రాసిన కథనాలు డబ్బులిచ్చి రాయించుకున్నవేనని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా (Manish Sisodia) ఇంట్లో సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) సోదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ఈ కథనాల గురించి ప్రస్తావిస్తూ శిశోడియాను ఉత్తమ విద్యా శాఖ మంత్రిగా ప్రశంసించారు. దీంతో బీజేపీ ఘాటుగా స్పందించింది. 


బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ (Amit Malviya) శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, న్యూయార్క్ టైమ్స్, ఖలీజ్ టైమ్స్ ఒకే కథనాన్ని ఏ విధంగా ప్రచురించాయని ప్రశ్నించారు. ఈ రెండు పత్రికల్లోనూ రాసిన కథనాలను ఒకే వ్యక్తి రాశారని, ఒకే రకమైన బొమ్మలను పెట్టారని, వీటిల్లో వాడిన పదాలు కూడా ఒకటేనని చెప్పారు. ఆ బొమ్మలు కూడా ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందినవన్నారు. అసలు లేని ఢిల్లీ విద్యా విధానంపై ఈ కథనాలను రాశారన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తనను తాను కాపాడుకోవడానికి చెప్తున్నదంతా  పెయిడ్ ప్రమోషన్ (డబ్బు చెల్లించి ప్రచారం చేసుకోవడం) తప్ప మరొకటేమీ కాదన్నారు. 


బీజేపీ ఢిల్లీ విభాగం ఐటీ సెల్ ప్రతినిధి పునీత్ అగర్వాల్ ఇచ్చిన ట్వీట్‌లో, న్యూయార్క్ టైమ్స్, ఖలీజ్ టైమ్స్ పత్రికల్లో కచ్చితంగా ఒకే విధమైన వ్యాసాలు ఏ విధంగా వచ్చాయని ప్రశ్నించారు. ఒకే మాటలు, ఒకే బొమ్మలు, ఒకే వ్యాసకర్త ఎలా వచ్చారన్నారు. ‘‘ఇది వార్త కాదు కేజ్రీవాల్ గారూ, దీనిని పెయిడ్ అడ్వర్టయిజింగ్ అంటారు. మనీశ్ శిశోడియా ఆయనకు తగిన చోటుకు వెళ్తారు, అది జైలు’’ అని హెచ్చరించారు. 


శిశోడియా ఇంట్లో సీబీఐ సోదాలు

ఢిల్లీ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ మనీశ్ శిశోడియా ఇంట్లోనూ, మరో 20 చోట్ల శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఈ విధానంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో దీనిని ఆ తర్వాత రద్దు చేశారు. సీబీఐ దాడుల తర్వాత కేజ్రీవాల్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఢిల్లీలో విద్యా విప్లవం వచ్చిందని, మనీశ్ శిశోడియాను అంతర్జాతీయ పత్రికలు ప్రశంసిస్తున్నాయని చెప్పారు.


సీబీఐ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, మనీశ్ శిశోడియాతో సహా నలుగురు పబ్లిక్ సర్వెంట్లపై కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తునకు సహకరిస్తానని శిశోడియా చెప్పారు. బాగా పని చేసేవారిని మన దేశంలో వేధించడం దురదృష్టకరమని ఆరోపించారు. 




Updated Date - 2022-08-19T22:57:10+05:30 IST