ప్రశాంత్ కిశోర్‌పై బీజేపీ ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2020-02-20T03:22:28+05:30 IST

ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై బీజేపీ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆయనను పోలింగ్ బూత్‌లను కబ్జా చేసేవారితో పోల్చింది.

ప్రశాంత్ కిశోర్‌పై బీజేపీ ఘాటు విమర్శలు

పాట్నా : ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై బీజేపీ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆయనను పోలింగ్ బూత్‌లను కబ్జా చేసేవారితో పోల్చింది. లోక్‌సభలో బీజేపీ విప్ సంజయ్ జైశ్వాల్ రాసిన ‘ఫేస్‌బుక్’ పోస్ట్‌లో ప్రశాంత్ కిశోర్ పేరును ప్రస్తావించకుండా, ఆయనపై విరుచుకుపడ్డారు. 


‘‘బీజేపీతో వ్యాపారం చేసి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఇప్పుడు 1990లనాటి పద్ధతిని ప్రయత్నిస్తున్నారు. ఎవరి కోసమో మనమెందుకు బూత్‌లను కబ్జా చేయాలి? మనమే నాయకులం కావచ్చు కదా? అని అప్పటి బందిపోట్లు, దోపిడీదారులు ఆలోచించడం మొదలెట్టారు. వాళ్లు కూడా కొంత కాలం విజయాలు అందుకున్నారు’’ అని జైశ్వాల్ పోస్ట్ చేశారు.


అయితే ప్రజలు నేడు చాలా తెలుసుకుంటున్నారని, గూండాలకు ఓట్లు వేయబోరని ధీమా వ్యక్తం చేశారు. ఓ రాజకీయ వ్యాపారి ధన బలంతో తనకోసం ఓ సుఖంగా ఉండే గూటిని నిర్మించుకోవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. అదే సాధ్యమైతే, బరువైన జేబులు ఉన్నవారే ప్రజా ప్రతినిథులు అయి ఉండేవారని దెప్పిపొడిచారు.


పౌరసత్వ సవరణ చట్టానికి జేడీయూ మద్దతివ్వడంతో ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్‌ను ప్రశాంత్ కిశోర్ విమర్శించిన సంగతి తెలిసిందే. అమిత్ షా సిఫారసుతోనే తనను జేడీయూలో చేర్చుకున్నారని ప్రశాంత్ కిశోర్ ‘‘అబద్ధం’’ చెప్పడంతో, నితీశ్ కుమార్ ఉపేక్షించకుండా, ప్రశాంత్‌ను జేడీయూ నుంచి బహిష్కరించారు. అనంతరం ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ గాంధీజీ ఆదర్శాలను తాను ఎన్నడూ వదిలిపెట్టబోనని నితీశ్ కుమార్ చెప్తూ ఉంటారని, ప్రస్తుతం ఆయన పార్టీ జేడీయూ గాంధీజీ హంతకుడు గాడ్సే పట్ల మెతక వైఖరిని ప్రదర్శించేవారితో ఉందని ఎద్దేవా చేశారు. గాంధీ, గాడ్సే చేతిలో చేయి వేసుకుని నడవలేరన్నారు.


ప్రశాంత్ కిశోర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీకి మింగుడుపడటం లేదు.



Updated Date - 2020-02-20T03:22:28+05:30 IST